భారత్ తో యుద్ధ భయం నేపథ్యంలో కొత్త ఎన్ఎస్ఏ ను నియమించిన పాక్

Best Web Hosting Provider In India 2024

భారత్ తో యుద్ధ భయం నేపథ్యంలో కొత్త ఎన్ఎస్ఏ ను నియమించిన పాక్

 

ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కొత్త జాతీయ భద్రత సలహాదారును పాకిస్తాన్ నియమించింది.లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ అసిమ్ మాలిక్ కు ఎన్ఎస్ఏ బాధ్యతలను అప్పగించింది.

 
పాకిస్తాన్ కొత్త ఎన్ఎస్ఏ లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ అసిమ్ మాలిక్
 

పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ తమపై ప్రతీకార దాడికి దిగుతుందన్న భయాల నేపథ్యంలో, పాకిస్తాన్ కొత్త జాతీయ భద్రత సలహాదారును నియమించింది. ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) డైరెక్టర్ జనరల్ గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ అసిమ్ మాలిక్ కే జాతీయ భద్రతా సలహాదారు (NSA) బాధ్యతలను అప్పగించింది. ఐఎస్ఐ చీఫ్ గా కూడా ఆయనే కొనసాగుతారని, ఎన్ఎస్ఏగా అదనపు బాధ్యతలను చేపడ్తారని వివరించింది.

 

పహల్గామ్ ఉగ్రదాడితో..

జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందడంతో భారత్ నుంచి సైనిక ప్రతిస్పందనపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఎన్ఎస్ఏ గా మహ్మద్ అసిమ్ మాలిక్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్ క్యాబినెట్ డివిజన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మహ్మద్ అసిమ్ మాలిక్ కు అధికారికంగా ఎన్ ఎస్ ఏ బాధ్యతలు అప్పగించారు. డీజీ (ఐ) లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ అసిమ్ మాలిక్ హెచ్ఐ (ఎం) తక్షణమే జాతీయ భద్రతా సలహాదారుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

2024 నుంచి ఐఎస్ఐ చీఫ్ గా

2024 సెప్టెంబర్లో అసిమ్ మాలిక్ ను ఐఎస్ఐ చీఫ్ గా నియమించారు. తన కొత్త పదవిలో అసిమ్ మాలిక్ దేశ జాతీయ భద్రతా వ్యూహాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారని నిపుణులను ఉటంకిస్తూ పాక్ మీడియా పేర్కొంది. ఐఎస్ఐ చీఫ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పాత్రలను కలపడం వల్ల మిలిటరీ ఇంటెలిజెన్స్, జాతీయ భద్రతా విధాన రూపకల్పన మధ్య సమన్వయం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇది మొదటి సారి

అసిమ్ మాలిక్ దేశానికి 10వ ఎన్ఎస్ఏ కాగా, రెండు కీలక పదవుల్లో ఏకకాలంలో సేవలందించే బాధ్యతను ఐఎస్ఐ చీఫ్ కు అప్పగించడం ఇదే తొలిసారి. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ప్రభుత్వాన్ని తొలగించిన 2022 ఏప్రిల్ నుండి ఎన్ఎస్ఏ స్థానం ఖాళీగా ఉంది. ఆ సమయంలో డాక్టర్ మొయీద్ యూసుఫ్ ఎన్ఎస్ఏగా ఉన్నారు.

 
 


Best Web Hosting Provider In India 2024


Source link