Best Web Hosting Provider In India 2024

అమరావతి ప్రజా రాజధాని పనుల పున: ప్రారంభానికి వైసీపీ అధ్యక్షుడికి ఆహ్వానం.. ఆహ్వానం అందించిన ప్రోటోకాల్ విభాగం
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అమరావతి నిర్మాణ పనుల పున:ప్రారంభ ఆహ్వానం అందింది. ప్రధాని మోదీ హాజరయ్యే కార్యక్రమానికి రావాల్సిందిగా వైసీపీ అధ్యక్షుడికి ప్రోటోకాల్ విభాగం తరపున ఆహ్వాన పత్రాన్ని పంపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పున: నిర్మాణ పనులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందింది. ప్రోటోకాల్ విభాగం ఆధ్వర్యంలో అమరావతి రీ లాంచ్ ఆహ్వాన పత్రికను మాజీ ముఖ్యమంత్రి నివాసంలో అందచేశారు.
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి కూటమి ప్రభుత్వం వైసీపీ అధ్యక్షుడిని కూడా ఆహ్వానం పలికింది. ప్రోటోకాల్ అధికారులు వెళ్లిన సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యదర్శికి ఆహ్వాన పత్రికను అందచేసినట్టు ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి.
రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు రావాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం తరపున ఆహ్వానించారు. తాడేపల్లి నివాసంలో జగన్ అందుబాటులో లేకపోవడంతో.. పీఏకు ఆహ్వానపత్రిక అందచేశారు.
పదేళ్ల తర్వాత ప్రధాని చేతుల మీదుగా…
అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పదేళ్ల క్రితం ప్రధాని మోదీ ప్రారంభించారు. 2016లో వెలగపూడి సచివాలయ నిర్మాణం పూర్తి చేశారు. 2019 నాటికి హైకోర్టు అందుబాటులోకి వచ్చింది. రాజధాని నిర్మాణంలో భాగంగా పలు నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించారు. 2019 వరకు రేయింబవళ్లు పనులు సాగాయి.
2019 మే నెలలో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణాన్ని నిలిపివేశారు. అదే ఏడాది డిసెంబర్లో 3 రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. వెరసి 2019-24 మధ్య రాజధాని నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది. 2019 వరకు అమరావతి నిర్మాణం కోసం దాదాపు రూ.5వేల కోట్ల ఖర్చు చేశారు. మరో రూ.41 వేల కోట్ల పనులు పురోగతిలో ఉండగా ఎక్కడివక్కడ ఆగిపోయాయి.
రాజధాని పనుల పున: ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ మే 2వ తేదీ సాయంత్రం ఈ పనుల్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. మరోవైపు రాజధాని నిర్మాణంపై వైసీపీ తమ వైఖరిని ఇప్పటి వరకు వెల్లడించలేదు. అధికారంలో ఉన్న సమయంలో విశాఖపట్నంకు రాజధాని తరలించాలని భావించినా పలు కారణాలతో అది సాధ్యపడలేదు. అమరావతి నుంచి శాశ్వతంగా విశాఖపట్నం వెళ్లేందుకు జగన్ ప్రయత్నించినా ఆచరణలో మాత్రం అమలు కాలేదు.
మరోవైపు రెండోసారి అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో వైసీపీ వైఖరి ఎలా ఉండబోతుందనేది చర్చగా మారింది. రాజధాని విషయంలో వైసీపీ ప్రస్తుతం మౌనంగా ఉన్నా, భవిష్యత్తులో మెలిక పెడుతుందనే ఆందోళన అమరావతి రైతుల్లో ఉంది. దీంతో ప్రధాని నుంచి స్పష్టమైన భరోసా కోరుకుంటున్నారు. విభజన చట్టంలో అమరావతిని రాజధానిగా చేస్తూ పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రిని రైతులు కోరారు.
ప్రధాని రాక నేపథ్యంలో పెట్టుబడిదారుల్లో కూడా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి నోటి వెంట వచ్చే ప్రకటన కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ఐదేళ్లుగా నెలకొన్న పరిణామాలు, రాజధాని లేని రాష్ట్రంగా పడిన కష్టాలు, రియల్ ఎస్టేట్ మార్కెట్ తిరోగమనం, పెట్టుబడులు రాకపోవడం వంటి ఇబ్బందుల నేపథ్యంలో ప్రధాని ఏమి ప్రకటన చేస్తారనే ఆసక్తి నెలకొంది.