





Best Web Hosting Provider In India 2024

కుల గణనలో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వాముల్ని చేయాలి, బీజేపీకి 400 సీట్లు వచ్చుంటే రిజర్వేషన్లు రద్దయ్యేవన్న రేవంత్
జనగణనలో కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరిందని కులగణనపై కేంద్రం మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం జనగణనలో కుల గణన చేపట్టాలని నిర్ణయించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడు ప్రారంభించి ఎప్పటిలోగా ముగిస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు. కులగణనపై విధివిధానాలు అందరికి అందుబాటులో ఉంచాలని, కులగణనలో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వాముల్ని చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. కులగణనలో తెలంగాణ అనుభవాన్ని కేంద్ర ప్రభుత్వంతో పంచుకుంటామన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అనుకున్న 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగం మార్చేసి ఈపాటికి రిజర్వేషన్లు రద్దు చేసి ఉండేవారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మొదట్లో మోదీ ఆలోచన కూడా ఇదేనని రాజకీయ ఒత్తిళ్లతోనే నిర్ణయం మార్చుకున్నారన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి కులగణన చేయాల్సిందేనని, బీహార్లో నితీష్ కుమార్ కుల గణన చేయాల్సిందేనని ఒత్తిడి చేశారని అందుకే కేంద్రం కుల గణన చేపట్టరన్నారు.
ఫలించిన రాహుల్ యాత్ర..
ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లను ప్రజలు తిరస్కరించడం వల్ల రాజకీయ ఒత్తిడితో కులగణన చేస్తున్నారని, రాహుల్ భారత్ జోడో యాత్ర వల్లే కులగణన జరుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి ఫలించిందన్నారు.
కులగణనపై స్పష్టమైన విధివిధానాలు ఖరారు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో కులగణన చేపట్టినపుడు 56 ప్రశ్నలతో కూడిన సమాచారాన్ని ప్రజల నుంచి తెలంగాణ ప్రభుత్వం సేకరించిన తర్వాత విధానపరమైన నిర్ణయాలు తీసుకుందని చెప్పారు.
తెలంగాణలో కుల గణనను కాంగ్రెస్ పార్టీ విధానంగా, కొందరి విధానంగా తాము చేపట్టలేదని అందరి అభిప్రాయాలను సేకరించి కుల గణన చేపట్టినట్టు వివరించారు. అందరి అమోదంతో దేశంలోనే మొదటి రాష్ట్రంగా కులగణనలో నిలిచిందన్నారు. తెలంగాణ మోడల్ దేశానికి రో ల్ మోడల్ అని రాహుల్ కితాబిచ్చారన్నారు.
నరేంద్ర మోదీకి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని, తెలంగాణ అనుభవాన్ని పంచుకోడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. కులగణనలో పేదలకు ఎలాంటి న్యాయం దక్కాలో ప్రభుత్వం గుర్తించాల్సి ఉందన్నారు. నిజమైన పేదలకు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే ఆలోచన
బీసీలకు 42శాతం ఆలోచన ఉందని, దానిపై తీర్మానం కూడా చేశామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పటికే ఈ విషయం ఆలస్యమైనా కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు.
పకడ్బందీగా కులగణన చేయాలి…
దేశంలో పకడ్బందీగా కుల గణన చేయాలని, విద్య, ఉద్యోగ, ఉపాధిలలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించాల్సి ఉందన్నారు. దేశంలో కులగణన చేసి చూపిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు.
గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం 25ఏళ్లుగా ఉందని,అక్కడ ఎందుకు చేయలేకపోయారని, పకడ్బందీగా కుల గణన చేసే ఆలోచన బీజేపీలో లేదన్నారు. కాంగ్రెస్ ఒత్తిడి వల్లే బీజేపీ కులగణన చేపడుతోందని రేవంత్ విమర్శించారు.
కులగణనలో అన్ని పార్టీలను భాగస్వాముల్ని చేయాలని, అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలన్నారు. కుల గణనతో దేశ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అంతిమంగా బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. తాము ఎలాంటి ఆరోపణలు చేయడం లేదని బలహీన వర్గాలకు మేలు చేయడమే తమ లక్ష్యమన్నారు. కులగణనను ఎన్నికలకు, వివాదాలతో ముడి పెట్టడం లేదన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో 1976కు ముందు కాపులు ఓసీలుగా ఉంటే తర్వాత బీసీలు అయ్యారని, లంబాడాలు బీసీల్లో ఉంటే తర్వాత ఎస్టీలు అయ్యారని, 96లో కొప్పుల వెలమ వర్గం ఓసీ నుంచి బీసీలు అయ్యారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆస్తులు, అప్పుల గురించి అబద్దాలు చెబుతారని, కులాల గురించి ఎవరు అబద్దం చెప్పుకోరని, సమగ్ర వివరాలు ప్రభుత్వం వద్ద ఉంటే పథకాలను అమలు చేయడం మరింత సులువు అవుతుందన్నారు. అందుకే సమగ్రంగా కులగణన చేయాలన్నారు.
దేశంలో కులగణన ఎప్పుడు ప్రారంభించి ఎప్పటిలోగా ముగిస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు. కులగణనపై విధివిధానాలు అందరికి అందుబాటులో ఉంచాలని, కులగణనలో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వాముల్ని చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. కులగణనలో తెలంగాణ అనుభవాన్ని కేంద్ర ప్రభుత్వంతో పంచుకుంటామన్నారు.
కర్రెగుట్టలో జరుగుతున్న కూంబింగ్పై ముఖ్యమంత్రి స్పందించారు. హింసకు తమ పార్టీ వ్యతిరేకమని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలన్నారు. పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.
సంబంధిత కథనం
టాపిక్