




Best Web Hosting Provider In India 2024

‘ఎల్ఆర్ఎస్’ దరఖాస్తుదారులకు అలర్ట్ – మరోసారి గడువు పొడిగింపు, ఈ ఛాన్స్ మిస్ కాకండి..!
ఎల్ఆర్ఎస్ గడువుపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 30వ తేదీతో గడువు ముగియగా… మే 3 వరకు పొడిగించింది. దరఖాస్తులు ఈలోపు ఫీజు చెల్లించి… రాయితీని పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది.
ఎల్ఆర్ఎస్ (ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ) దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 30వ తేదీతో గడువు ముగిసిన నేపథ్యంలో…. మరోసారి గడువు పొడిగించింది. మే 3వ తేదీ వరకు దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించి… 25 శాతం రాయితీని పొందవచ్చని ప్రకటించింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు.
మే 3 వరకు అవకాశం….
మే 3వ తేదీలోపు ఫీజు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ అవకాశం ఉంటుంది. ఈ గడువు ముగిసిన తర్వాత అలాంటి అవకాశం ఉండదు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించగా.. మరోసారి పెంచే అవకాశం లేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. పురపాలక శాఖ జారీ చేసిన జీవో 28 ప్రకారం ఎల్ఆర్ఎస్ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లిస్తే 25 శాతం రాయితీ పొందవచ్చు. మరో 3 రోజులు మాత్రమే ఉండటంతో ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దని అధికారులు సూచిస్తున్నారు.
2020లో ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను ప్రవేశపెట్టారు. ఇందుకోసం గ్రామాలు, పట్టణాల్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ స్కీమ్ లో భాగంగా…అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. 25 లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. గతేడాది నాటికి పది లక్షలోపు దరఖాస్తులు మాత్రమే పరిష్కరించారు. స్కీమ్ లో వేగం పెంచేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో 25 శాతం రాయితీతో కూడిన ఓటీఎస్ ను ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి దీని గడువు మార్చి చివరి నాటికే ముగియగా… ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. ఈ సమయం కూడా ముగియటంతో మరో 3 రోజులు అవకాశం కల్పించింది.
ఈ పథకం ద్వారా అనధికార లే అవుట్లను క్రమబద్ధీకరిస్తున్నారు. ఇప్పటికే పరిశీలించిన దరఖాస్తులను క్లియర్ చేశారు. అర్హత ఉన్న వారికి ప్రోసిడింగ్స్ కాపీలను కూడా అందజేశారు.ఎల్ 1, ఎల్2, ఎల్ 3 దశల్లో పరిశీలన పూర్తి అయిన వాటికి మాత్రమే ప్రోసిడింగ్ కాపీలను ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని దరఖాస్తులకు పరిష్కారం చూపారు. త్వరలోనే మిగతా ఫీజులు చెల్లించిన దరఖాస్తులను పరిష్కరించనున్నారు. సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు వస్తుండగా… వాటిని కూడా అధిగమిస్తూ ముందుకెళ్లే పనిలో ప్రభుత్వం ఉంది.
అప్లికేషన్ సెర్చ్ ఆప్షన్….
దరఖాస్తుదారులు తమ దరఖాస్తు వివరాలు మర్చిపోతే…దరఖాస్తు వివరాలు తిరిగి పొందడానికి ‘యూనివర్సల్ సెర్చ్’ ఫీచర్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆప్షన్ తో దరఖాస్తు రసీదులను తప్పుగా ఉంచిన లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లను మార్పు వంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. యూనివర్సల్ సెర్చ్ ఆప్షన్ ద్వారా నిర్దిష్ట వివరాలను నమోదు చేసి అప్లికేషన్ నంబర్, ఇతర సంబంధిత సమాచారం వివరాలను తెలుసుకోవచ్చు. ఇక https://lrs.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ స్టేటస్ వివరాలు మాత్రమే కాకుండా…. ఎల్ఆర్ఎస్ ఫీజును కూడా చెల్లించుకోవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్