భారత అమ్మాయిలకు షాక్.. ఏడేళ్ల తర్వాత లంక చేతిలో వన్డే ఓటమి.. రిచా పోరాటం వృథా

Best Web Hosting Provider In India 2024


భారత అమ్మాయిలకు షాక్.. ఏడేళ్ల తర్వాత లంక చేతిలో వన్డే ఓటమి.. రిచా పోరాటం వృథా

భారత వుమెన్స్ క్రికెట్ టీమ్ కు షాక్. శ్రీలంక చేతిలో టీమిండియా అనూహ్య ఓటమి పాలైంది. ఏడేళ్ల తర్వాత వన్డేలో తొలిసారి లంక చేతిలో భారత్ ఓడింది. ముక్కోణపు సిరీస్ లో ఈ పరాజయం ఎదురైంది.

రిచా ఘోష్

వుమెన్స్ వన్డే ట్రై సిరీస్ లో భారత మహిళల జట్టుకు షాకింగ్ ఓటమి ఎదురైంది. ఆదివారం (మే 4) కొలంబోలో జరిగిన వన్డేలో భారత్ 3 వికెట్ల తేడాతో శ్రీలంక చేతిలో ఓడింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. రిచా ఘోష్ (48 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టింది.

ఛేజింగ్ లో 7 వికెట్లు కోల్పోయిన శ్రీలంక 49.1 ఓవర్లలో టార్గెట్ రీచ్ అయింది. నీలాక్షిక సిల్వా (33 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), హర్షిత సమరవిక్రమ (61 బంతుల్లో 53; 5 ఫోర్లు) లంకను గెలిపించారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా మూడు వికెట్లు తీసింది.

మంచి ఆరంభమే

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు మంచి ఆరంభమే దక్కింది. ప్రతీకా రావల్ (35), స్మృతి మంధాన (18) ఫస్ట్ వికెట్ కు 51 రన్స్ జోడించారు. కానీ మంధాన రనౌట్ కాగా.. ప్రతీక కూడా ఆ కాసేపటికే ఔటైంది. మంధానకు ఇది 100వ వన్డే. హర్లీన్ డియోల్ (29), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (30), జెమీమా రోడ్రిగ్స్ (37) భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు.

రిచా అదుర్స్

181/5తో ఇబ్బందుల్లో పడ్డ టీమిండియాను రిచా ఘోష్ ఆదుకుంది. దీప్తి శర్మ (24)తో కలిసి ఇన్నింగ్స్ నడిపించింది. హాఫ్ సెంచరీ ఖాతాలో వేసుకుంది. శ్రీలంక బౌలర్లలో చమరి ఆటపట్టు, సుగంధిక కుమారి చెరో మూడో వికెట్లతో భారత్ ను దెబ్బకొట్టారు.

హర్షిత, నీలాక్షిక మెరుపులు

ఛేజింగ్ లో శ్రీలంకను భారత్ కట్టడి చేయలేకపోయింది. మొదట్లో హర్షిత, లాస్ట్ లో నీలాక్షిక హాఫ్ సెంచరీలతో లంక విజయంలో కీలక పాత్ర పోషించారు. విష్మి (33), కవిష (35), అనుష్క (23 నాటౌట్) కూడా కీలక పరుగుల చేశారు. ఓ దశలో లంకను 238/7తో కట్టడి చేసిన భారత్ గెలిచేలా కనిపించింది. కానీ అనుష్క, సుగంధిక కలిసి లంకను విజయతీరాలకు చేర్చారు.

ఏడేళ్ల తర్వాత శ్రీలంక మహిళల జట్టుకు భారత్ పై ఇదే తొలి వన్డే విజయం. ట్రై సిరీస్ లో లంకకు ఇది రెండో గెలుపు. లంకతో తొలి మ్యాచ్ లో గెలిచిన భారత్.. ఆ తర్వాత దక్షిణాఫ్రికానూ ఓడించింది. తర్వాతి మ్యాచ్ లో బుధవారం (మే 7) దక్షిణాఫ్రికాతో భారత్ మరోసారి తలపడనుంది.

సంక్షిప్త స్కోర్లు: భారత్ 275/9 (జెమీమా రోడ్రిగ్స్ 37, రిచా ఘోష్ 58, సుగంధ కుమారి 3/44, చమరి ఆటపట్టు 3/43); శ్రీలంక 49.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 278 (హర్షిత సమరవిక్రమ 53, నీలాక్షికా సిల్వా 56, స్నేహ్ రాణా 3/45)

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

Best Web Hosting Provider In India 2024


Source link