కండీషనర్ కోసం వందలు వందలు ఖర్చు చేయకండి.. ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోండి!

Best Web Hosting Provider In India 2024

కండీషనర్ కోసం వందలు వందలు ఖర్చు చేయకండి.. ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోండి!

Ramya Sri Marka HT Telugu

వేసవి వేడికి వెంట్రుకలు దెబ్బతింటున్నాయా? కండిషనర్‌తో జుట్టును మృదువుగా, మెరిసేలా తయారు చేయాలని చూస్తున్నారా? అయితే దీని కోసం వందలకు వందలు ఖర్చు చేయకండి. ఎలాంటి హానికరమైన పదార్థాలు లేకుండా ఇంట్లోనే సహజమైన పదార్థాలతో సులభంగా కండీషనర్ తయారు చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం రండి.

జుట్టు సహజంగా అందంగా మార్చే కండీషనర్ (Pixabay)

వేసవి తాపానికి చర్మంతో పాటు జుట్టు కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. వేడి, చెమటతో పాటు హానికరమైన యూవీ కిరణాలు, దుమ్ము, ధూళి కలగలిసి వెంట్రుకలు పొడిగా, నిర్జీవంగా తయారవుతాయి.చూడటానికి ఇది కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఈ సమస్య నుంచి తప్పించుకునేందుకు చాలా మంది కండీషనర్ వాడుతుంటారు. అయితే మార్కెట్లో దొరికే కండషనర్లతో ఈ ససమ్యకు పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే మీరు పొరపడినట్లే.ఎందుకుంటే వాటి తయారీలో హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తారు. వీటిని జుట్టుకు ఉపయోగించడం వల్ల మేలు కన్నా ఎక్కువ హానే కలుగుతుంది.

వెంట్రుకలకు కానీ చర్మానికి కానీ ఎల్లప్పుడూ సహజమైన పదార్థాలను ఉపయెగించడం చాలా మంచిది. అలాగే వీటిని ఇంట్లోనే తయారు చేసుకుంటే డబ్బు ఆదా చేసుకోవడంతో పాటు మెరుగైన ఫలితాలను పొందచ్చు. అలాంటి వాటిలో ఒకటే ఈ బాదం-అలోవెలా కండీషనర్. ఇది మీ జట్టును తేమగా ఉంచడమే కాకుండా అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది.ఈ కండీషనర్ తయారు చేసే పద్ధతితో పాటు దీన్ని వాడటం వల్ల కలిగే అద్భుతమైన ఉపయోగాలు ఏంటో చూద్దం రండి!

బాదం-అలోవెలా కండీషనర్ తయారీకి కావలసిన పదార్థాలు:

  • అలోవెరా జెల్ – 2 టేబుల్ స్పూన్లు
  • బాదం నూనె- 1 టేబుల్ స్పూన్
  • ఎసెన్షియల్ ఆయిల్- కొన్ని చుక్కల మీకు ఇష్టమైనది(లావెండర్, రోజ్మేరీ వంటివి సువాసన కోసం మాత్రమే)

బాదం-అలోవెలా కండీషనర్ తయారీ విధానం:

  1. బాదం-అలోవెలా కండీషనర్ తయారీ కోసం ముందుగా ఒక శుభ్రమైన గిన్నె తీసుకోండి.
  2. అందులో 2 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు వేయండి. మీరు తాజా అలోవెరా నుండి జెల్ తీస్తున్నట్లయితే దాన్ని బాగా పలుచగా ఉండేలా చూసుకోండి.
  3. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బాదం నూనెను,తర్వాత కొద్దిగా ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలపండి.
  4. అన్నీ వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలపి మెత్తటి పేస్టులా తయారు చేయండి.
  5. తలస్నానం చేసిన తర్వాత ఈ కండీషనర్‌ను కుదుళ్ల నుంచి చివర్ల వరకూ బాగా పట్టించండి.
  6. 5-10 నిమిషాల పాటు ఉంచిన తర్వాత గోరువెచ్చటి నీటితో బాగా కడగండి.

ఈ కండీషనర్ వల్ల ఉపయోగాలు:

వేసవిలో చెమట, సూర్యరశ్మి , వేడి గాలుల కారణంగా జుట్టు పొడిబారి నిర్జీవంగా మారుతుంది. ఈ సమస్యను దాటేందుకు బాదం నూనె చక్కగా సహకరిస్తుంది. ఒక గొప్ప మాయిశ్చరైజర్‌గా, జుట్టు పొరల్లో తేమను నింపడానికి సహాయపడుతుంది. తద్వారా అది పొడిబారకుండా ఉంటుంది. బాదంనూనె మాత్రమే కాకుండా అలోవెరా (కలబంద) కూడా జుట్టుకు తేమను అందించి దానిని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.

జుట్టు మెరుపును పెంచుతుంది:

బాదం నూనె జుట్టుకు సహజమైన మెరుపును అందిస్తుంది. ఇది జుట్టును నునుపుగా చేస్తుంది. కాంతిని ప్రతిబింబించి మెరుపును అందిస్తుంది. అదే విధంగా అలోవెరా కూడా జుట్టుకు ఆరోగ్యకరమైన మెరుపును ఇవ్వడంలో సహాయపడుతుంది.

జుట్టును మృదువుగా చేస్తుంది:

వేసవిలో జుట్టు గరుకుగా మారే అవకాశం ఉంది. బాదం నూనె జుట్టు కుదుళ్లను మృదువుగా చేసి, చిక్కులు పడకుండా చేస్తుంది. అలోవెరా కూడా జుట్టును మెత్తగా, సున్నితంగా ఉంచడానికి సహాయపడుతుంది.

జిడ్డును నియంత్రిస్తుంది:

వేసవిలో చాలా మందికి స్కాల్ప్ జిడ్డుగా ఉంటుంది. అలోవెరా జుట్టు నుండి అదనపు నూనెను తొలగించడంలో సహాయపడుతుంది. జుట్టును తాజాగా ఉంచుతుంది. బాదం నూనె తేలికగా ఉండటం వల్ల జిడ్డుగా అనిపించదు. వీటితో పాటుగా జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తుంది.

చుండ్రు నివారణ:

వేసవిలో చెమట, జిడ్డు కారణంగా చుండ్రు సమస్య ఎక్కువగా రావొచ్చు. అలోవెరాలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రును నివారించడానికి , స్కాల్ప్‌ను శుభ్రంగా ఉంచడానికి సహాయపడతాయి. బాదం నూనె స్కాల్ప్‌కు పోషణను అందించి పొడిబారడాన్ని తగ్గిస్తుంది. తద్వారా చుండ్రు సమస్యను తగ్గిస్తుంది.

జుట్టు చిట్లడాన్ని తగ్గిస్తుంది:

వేసవిలో జుట్టు పొడిబారడం వల్ల చిట్లే అవకాశం ఉంది. బాదం నూనె జుట్టు చివర్లను తేమగా ఉంచి చిట్లడాన్ని తగ్గిస్తుంది.

సూర్యరశ్మి నుండి రక్షణ:

బాదం నూనెలో విటమిన్ E , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సూర్యరశ్మి నుంచి విడుదలయ్యే హానికరమైన UV కిరణాల నుండి జుట్టును రక్షిస్తాయి. అలోవెరా కూడా జుట్టు మీద ఒక రక్షణ పొరను ఏర్పరుస్తుంది. ఇది ఎండ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024