Best Web Hosting Provider In India 2024

మిస్ వరల్డ్ 2025 పోటీల్లో రైతు బిడ్డ నందిని గుప్తా… మిస్ వరల్డ్ పోటీల్లో ఈమె ఎలా పాల్గొంటోంది?
మిస్ వరల్డ్ 2025 కాంటెస్ట్ త్వరలో హైదరాబాదులో జరగనుంది. ప్రపంచ సుందరీమణులంతా హైదరాబాదులో అడుగుపెడుతున్నారు. మన దేశం తరఫున ఫెమీనా మిస్ ఇండియా నందిని గుప్తా పోటీ పడబోతోంది. ఇంతకీ ఎవరు ఈమె?
నందిని గుప్తా… మిస్ వరల్డ్ 2025 పోటీలలో ఇండియా తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న అందాల దేవత. మిస్ ఇండియా 2023 కిరీటం గెలుచుకొని మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనే అర్హతను దక్కించుకుంది. అందానికి కేరాఫ్ అడ్రస్‌లా కనిపించే నందిని గుప్తా మిస్ వరల్డ్ కిరీటాన్ని మళ్లీ మన దేశానికి తీసుకొస్తుందో లేదో చూడాలి.
నందిని గుప్తాది రాజస్థాన్‌లోని కోటా. ఈమె వయసు 21. అందంతో పాటు ఆత్మవిశ్వాసం, అంకిత భావం నిండిన పరిపూర్ణ యువతిలా కనిపిస్తుంది. నందిని మిస్ వరల్డ్ 2025 పోటీలలో వందకి పైగా దేశాల నుండి సుందరీమణులు రాబోతున్నారు. వారందరినీ ఓడించి నందిని మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంటుందో లేదో వేచి చూడాలి.
నందిని గుప్తా రైతు బిడ్డ
నందిని గుప్తా కోటా పట్టణంలో చాలా నిరాడంబరమైన ఫ్యామిలీలో పుట్టింది. ఆమె పుట్టినప్పుడు అది ఒక చిన్న గ్రామం. ఆమె తండ్రి రైతు. తల్లి గృహిణి. నందిని కి ఒక చెల్లెలు కూడా ఉంది. ఆవాలు, చిరుధాన్యాలు, నల్ల శెనగపప్పు వంటివి నందిని గుప్తా తండ్రి పండించేవారు. ఆ పొలాలలోనే ఆడుతూ పెరిగింది ఈమె.
తన వ్యవసాయ నేపథ్యం పర్యావరణం కోసం ఆమెను వాదించేలా చేసింది. భూమి తల్లిని రక్షించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా ఆమె అవకాశం వచ్చినప్పుడల్లా అందరికీ చెబుతూనే ఉంటుంది. రైతు బిడ్డగా భూమి తల్లికి హాని కలిగించే ఏ పనిని కూడా తాను సమర్ధించనని చెబుతోంది నందిని గుప్తా.
నా తల్లి మిస్ మధ్యప్రదేశ్
మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనడం అనేది తన కల కాదని అది తన తల్లి కాంక్ష అని చెప్పింది. తనకు 19 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే మిస్ ఇండియాగా గెలిచిందని వివరించింది. తన తల్లి కూడా మిస్ మధ్యప్రదేశ్ గా గెలిచిందని, కానీ మిస్ ఇండియా పోటీల వరకు చేరలేకపోయిందని చెప్పింది. ఆమె కలను నిజం చేసుకునేందుకే తనను ప్రోత్సహించిందని చెప్పింది నందిని గుప్తా.
ఫెమినీ మిస్ ఇండియా పోటీలో 2023లో జరిగాయి. అప్పుడు ఫైనల్ పోటీల్లో నందిని గుప్తాకు ఒక ప్రశ్న ఎదురయింది. ‘ప్రపంచాన్ని మార్చుతావా లేక నువ్వు మారుతావా’ అని న్యాయ నిర్ణేతలు ప్రశ్నించారు. ఆ సమయంలో నందిని ‘మార్పు ఎప్పుడైనా ముందు మన నుంచే మొదలవ్వాలని… అప్పుడే ప్రపంచాన్ని మార్చే శక్తి మనకు వస్తుంది’ అని వివరించింది. ఆ సమాధానం జడ్జిలను ఆకట్టుకుని, ఆమెకు కిరీటాన్ని వచ్చేలా చేసింది.
ప్రాజెక్ట్ ఏక్తా
ప్రాజెక్ట్ ఏక్తా అనే సంస్థ ద్వారా నందిని గుప్తా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దానికి కారణం ఆమె జీవితంలో ఉన్న మేనమామే. అతను మానసికంగా ఎదగని వ్యక్తి. కానీ బయట ఎవరూ ఆయన్ని మనిషిగా చూసేవారు కాదు. పిచ్చివాడిగా పిలిచేవారు. అది విని నందినికి చాలా బాధనిపించింది. ‘అతడిని చూసుకునేందుకు తాము ఉన్నామని.. కానీ ఇలాంటి వాళ్ళ పరిస్థితి మిగతా చోట్ల ఎలా ఉంటుందో అనిపించేది… అందుకే ప్రాజెక్ట్ ఏక్ా అనే సంస్థ ద్వారా అలాంటి దివ్యాంగులకు, మానసికంగా ఎదగని వాళ్లకి సహాయ సహకారాలు అందిస్తున్నా’ అని వివరించింది.
అందమైన రూపమే కాదు, సుందరమైన మనసు కూడా ఉన్న నందిని గుప్తా.. మిస్ వరల్డ్ 2025 పోటీలలో విజేతగా నిలిచి కిరీటాన్ని మన దేశానికి అంకితం ఇవ్వాలని కోరుకుందాం.