





Best Web Hosting Provider In India 2024

ఉపాధి హామీపై తెలుగు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు-ఏపీలో పరిహారం పెంపు, తెలంగాణలో వేతనాలు విడుదల
ఉపాధి హామీ పథకంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఉపాధి హామీ శ్రామికులకు పరిహారం పెంచింది ఏపీ ప్రభుత్వం. ఉపాధి హామీ సిబ్బంది పెండింగ్ వేతనాలు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం.
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకం శ్రామికుల పరిహారం, సిబ్బంది వేతనాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఏపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న శ్రామికులు పనిప్రదేశాల్లో చనిపోతే వారికి చెల్లించే ఎక్స్ గ్రేషియాను రూ.50 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచింది. ఈ మేరకు ఏపీ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
పరిహారం పెంపు
పని ప్రదేశాల్లో గాయపడి శాశ్వత వైకల్యం చెందితే పరిహారాన్ని రూ.1 లక్షకు పెంచారు. గాయపడటం ద్వారా పూర్తిగా మంచానపడితే రూ.2 లక్షల పరిహారం అందిస్తారు. పని ప్రదేశాల్లో ‘ఆరేళ్ల లోపు పిల్లలు గాయపడి వికలాంగులైతే పరిహారం రూ. లక్షకు పెంచుతూ సవరణ జీవో జారీ చేశారు.
తెలంగాణ ఉపాధి హామీ సిబ్బంది వేతనాలు విడుదల
తెలంగాణలో ఉపాధి హామీ పథకం సిబ్బందికి పెండింగ్ లో ఉన్న వేతనాలపై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీవోలతో సహా మొత్తం 3,200 మందికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
రూ.62 కోట్లు విడుదల
తెలంగాణ ప్రభుత్వం ఉపాధి హామీ సిబ్బంది వేతనాలు రూ.62 కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల ద్వారా పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల వేతనాలను చెల్లించనున్నారు.
నాలుగు నెలలకు ఇబ్బందులు పడుతున్న సిబ్బందికి వేతనాలు చెల్లింపు ఊరటనిచ్చింది. ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా అమలు చేయాలంటే సిబ్బందికి సకాలంలో వేతనాల చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని గత కొద్ది రోజులుగా ఉపాధి హామీ సిబ్బంది నిరసనకు దిగారు. దీనిపై స్పందించిన తెలంగాణ సర్కార్ ఇవాళ నాలుగు నెలల పెండింగ్ బకాయిలను విడుదల చేసింది.
గ్రామస్థాయిలో విజిలెన్స్ కమిటీలు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలుచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ స్థాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రస్థాయిలోనే విజిలెన్స్ కమిటీలు ఉన్నాయి. తొలిసారి గ్రామస్థాయిలో ఈ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇటీవల కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు కలెక్టర్లు ఉత్తర్వులు జారీచేశారు.
పనిదినాల సంఖ్య తగ్గింపు
ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ నివేదికలపై సమీక్ష జరిపి అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. ఉపాధి పనుల్లో పలుచోట్ల నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, ఈ ఆర్థిక సంవత్సరం పనిదినాల సంఖ్యను 6.5 కోట్లకు తగ్గించింది. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలుచేసేందుకు గ్రామస్థాయి నిఘా కమిటీల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
5గురు సభ్యులతో
ఒక్కో గ్రామస్థాయి కమిటీలో 5గురు చొప్పున ప్రభుత్వ సిబ్బంది సభ్యులుగా ఉంటారు. పొరుగు గ్రామాల్లోని వారినే ఈ కమిటీలో సభ్యులుగా నియమిస్తారు. ఈ కమిటీలు వారానికి ఒకసారి ఉపాధి హామీ పనులను పరిశీలించి, పనుల మంజూరు, కూలీల హాజరు, చెల్లింపులపై ఆరా తీస్తారు. ఈ వివరాలను మండల పరిషత్ అధికారులకు పంపిస్తారు. మండల అధికారులు జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపుతారు. అవకతవకలు జరిగితే కలెక్టర్లు చర్యలు తీసుకుంటారు.
సంబంధిత కథనం
టాపిక్