




Best Web Hosting Provider In India 2024

ఆరు నెలల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలి.. సౌత్ సినిమాను చూసి నేర్చుకోవాలి: బాలీవుడ్ స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సినిమాలను థియేటర్లలో రిలీజైన ఆరు నెలల తర్వాతే ఓటీటీలోకి తీసుకురావాలని అన్నాడు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్. అంతేకాదు సౌత్ ఇండస్ట్రీ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని స్పష్టం చేశాడు.
కొన్నేళ్లుగా బాలీవుడ్ వెనుకబడిపోతోంది. తెలుగుతోపాటు మిగిలిన సౌత్ ఇండియా ఇండస్ట్రీల నుంచి బ్లాక్బస్టర్ హిట్స్ వస్తుండగా.. హిందీ సినిమా మాత్రం ఫ్లాపవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి స్టార్ హీరో ఆమిర్ ఖాన్ దీనిపై స్పందించాడు. ప్రేక్షకులు ఎందుకు థియేటర్లకు రావడం లేదో అతడు చెప్పాడు. సౌత్ ఇండస్ట్రీ నుంచి నేర్చుకోవాల్సింది కూడా చాలానే ఉందని అన్నాడు.
వెంటనే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు
ఆమిర్ ఖాన్ తాజాగా ఏబీపీ న్యూస్ తో మాట్లాడాడు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలు ఎలా హిందీ సినిమాను వెనక్కి నెడుతున్నాయో ఈ సందర్భంగా అతడు చెప్పాడు. దీని వెనుక కారణమేంటో అతడు వివరించాడు. “ముందుగా మనం మంచి సినిమాలు తీయాలి.
హిందీ సినిమా డైరెక్టర్లు, రైటర్లు, ప్రొడ్యూసర్లు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అంతేకాదు ప్రస్తుతం మన బిజినెస్ మోడల్ కూడా వింతగా ఉంది. థియేటర్లకు రావాలని ప్రేక్షకులను పిలుస్తాం. ఒకవేళ వాళ్లు రాకపోతే వెంటనే ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నాం. ఇది మన సినిమాలను చాలా ప్రభావితం చేసింది” అని ఆమిర్ ఖాన్ అన్నాడు. కొవిడ్ 19 కూడా సినిమాను చూసే తీరుపై ప్రభావం చూపిందని అతడు అభిప్రాయపడ్డాడు.
చాలా మంది ప్రొడ్యూసర్లు తమ సినిమాలను నేరుగా ఓటీటీలోకి తీసుకెళ్లారని, దీంతో ప్రేక్షకులు కూడా వాటికి అలవాటు పడిపోయారని అన్నాడు. అందుకే ఒక సినిమా థియేటర్లో రిలీజైన తర్వాత ఓటీటీలోకి రావడానికి కనీసం ఆరు నెలల గ్యాప్ ఉండాలని ఆమిర్ ఖాన్ స్పష్టం చేశాడు.
తాను ఓటీటీకి వ్యతిరేకం కాదని కూడా ఈ సందర్భంగా అతడు తేల్చి చెప్పాడు. నిజానికి ఓటీటీ వల్లే ఎంతో మంది కొత్త ఆర్టిస్టులు తమ ప్రతిభను చూపించే అవకాశం సంపాదించుకున్నారని ఆమిర్ అన్నాడు.
ఆమిర్ ఖాన్ రాబోయే సినిమాలు
ఆమిర్ ఖాన్ చివరికిగా లాల్ సింగ్ చద్దా మూవీలో నటించాడు. అయితే ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. తర్వాత కొన్నాళ్లపాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నాడు. ప్రస్తుతం 2007లో వచ్చిన తారే జమీన్ పర్ మూవీకి సీక్వెల్ అయిన సితారే జమీన్ పర్ మూవీలో బిజీగా ఉన్నాడు.
ఈ మధ్యే ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఈ మూవీ ద్వారా పది మంది కొత్త నటీనటులు పరిచయమవుతున్నారు. ఈ మూవీని ఆర్ఎస్ ప్రసన్న డైరెక్ట్ చేస్తుండగా.. జెనీలియా కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. శంకర్ ఎహెసాన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ జూన్ 20న థియేటర్లలో రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం