ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ కు టర్కీ, అజర్ బైజాన్ మద్దతు; సంయమనం పాటించాలన్న ఖతార్

Best Web Hosting Provider In India 2024


ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ కు టర్కీ, అజర్ బైజాన్ మద్దతు; సంయమనం పాటించాలన్న ఖతార్

Sudarshan V HT Telugu

పాకిస్తాన్ లోని ఉగ్రమూకల ఏరివేతకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ కు మద్ధతుగా టర్కీ, అజర్ బైజాన్ దేశాలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. మరోవైపు, భారత్, పాకిస్తాన్ లు సంయమనం పాటించాలని ఖతార్ కోరింది.

ఆపరేషన్ సిందూర్ (Arvind Yadav/Hindustan Times)

పొరుగుదేశంలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ నిర్వహించిన తర్వాత రిపబ్లిక్ ఆఫ్ తుర్కియే, అజర్ బైజాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు బుధవారం పాకిస్తాన్ కు మద్దతుగా వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి.

పాక్ కు టర్కీ మద్ధతు

తుర్కియే (టర్కీ) విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్ లో ఒక ప్రకటనను పోస్ట్ చేసింది. “మేము పాకిస్తాన్, భారతదేశం మధ్య పరిణామాలను ఆందోళనతో గమనిస్తున్నాము. గత రాత్రి (మే 6) భారత్ చేసిన ఈ దాడి ఇరుదేశాల మధ్య యుద్ధ ప్రమాదాన్ని పెంచింది. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలతో పాటు పౌరులను, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాం’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని, ఏకపక్ష చర్యలకు దూరంగా ఉండాలని టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఏప్రిల్ 22న పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిపై దర్యాప్తు జరపాలన్న పాక్ పిలుపునకు తాము మద్దతిస్తున్నామని చెప్పారు. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ కు మద్దతు పలికిన అతికొద్ది దేశాల్లో తుర్కియే ఒకటి.

అజర్ బైజాన్ ప్రకటన

ఆపరేషన్ సిందూర్ జరిగిన వెంటనే అజర్ బైజాన్ కూడా పాకిస్తాన్ కు మద్ధతుగా ఒక ప్రకటన విడుదల చేసింది. “రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత మరింత పెరగడంపై రిపబ్లిక్ ఆఫ్ అజర్ బైజాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది” అని వారు తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్ పై సైనిక దాడులను ఖండిస్తున్నామని, ఈ దాడుల్లో పలువురు పౌరులు మృతి చెందారని అజర్ బైజాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. పాక్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ అమాయకుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఆపరేషన్ సింధూర్ పై ఖతార్ స్పందన

ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. “రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతను ఖతార్ తీవ్ర ఆందోళనతో గమనిస్తోంది. రెండు దేశాలు గరిష్ట సంయమనం పాటించాలని, వివేకానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతోంది. మంచి పొరుగుదేశాల సూత్రాలను గౌరవించండి. దౌత్య మార్గాల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించండి” అని ఖతార్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రాంతంలో సుస్థిరత, శాంతి నెలకొనేలా నిర్మాణాత్మక చర్చల ద్వారా ఇరు దేశాలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link