కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కోట్ల ఆస్తికి వార‌సురాలు దీప‌నే -కార్తీక్‌కు నిజం చెప్పిన దాసు -జ్యోత్స్న ప్లాన్ స‌క్సెస్‌

Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కోట్ల ఆస్తికి వార‌సురాలు దీప‌నే -కార్తీక్‌కు నిజం చెప్పిన దాసు -జ్యోత్స్న ప్లాన్ స‌క్సెస్‌

Nelki Naresh HT Telugu

కార్తీక దీపం మే 9 ఎపిసోడ్‌లో హాస్పిట‌ల్‌లో ఉన్న కార్తీక్‌ను క‌లుస్తాడు దాసు. ద‌శ‌ర‌థ్‌, సుమిత్ర‌ల కూతురు దీప అనే నిజాన్ని బ‌య‌ట‌పెడ‌తాడు. పారిజాతం స్వార్థం, ప‌గ కార‌ణంగా ఐశ్వ‌ర్యంలో పెర‌గాల్సిన దీప‌…పేదింటి బిడ్డ‌గా పెరిగింద‌నే అంటాడు.

కార్తీక దీపం మే 9 ఎపిసోడ్‌

దీప ప‌ల్స్ డౌన్ అవుతుంద‌ని, బ్ల‌డ్ ఎక్కించ‌క‌పోతే ఆమె ప్రాణాల‌కు ప్ర‌మాద‌మ‌ని డాక్ట‌ర్లు చెబుతారు. కానీ డోన‌ర్స్ ఎవ‌రు రాకుండా జ్యోత్స్న అడ్డుకుంటుంది. ఖాళీ బాండ్ పేప‌ర్స్‌పై సంత‌కం పెడితేనే డోన‌ర్స్‌ను ర‌ప్పిస్తాన‌ని, ఆప‌రేష‌న్‌కు అవ‌స‌ర‌మైన డ‌బ్బు ఇస్తాన‌ని కార్తీక్‌కు కండీష‌న్ పెడుతుంది జ్యోత్స్న. కార్తీక్ ఆలోచ‌న‌లో ప‌డ‌తాడు. ఆలోచించ‌డానికి నాకు టైమ్ ఉంది, కానీ దీప‌కు టైమ్ లేద‌ని జ్యోత్స్న అంటుంది.

దీప అంటే నాకు ప్రాణ‌మ‌ని అన్నావు దీప కోస‌మే బ‌తుకుతున్నాన‌ని అన్నావుగా…మ‌రి దీప ప్రాణాలు పోతుంటే ఏం ఆలోచిస్తున్నావ‌ని కార్తీక్‌ను రెచ్చ‌గొడుతుంది జ్యోత్స్న‌.

దీప బ‌త‌క‌దు…

అప్పుడే డాక్ట‌ర్ ఫోన్ చేసి దీప ప‌ల్స్ ప‌డిపోతుంద‌ని, బ‌తుకుతుందో లేదో తెలియ‌డం లేద‌ని అంటుంది. మ‌రో ఐదు నిమిషాల్లో ఆప‌రేష‌న్ స్టార్ట్ చేయ‌క‌పోతే దీప ప్రాణాలు పోతాయ‌ని. ఆ త‌ర్వాత డోన‌ర్‌ను తీసుకొచ్చిన ఉప‌యోగం ఉండ‌ద‌ని చెబుతుంది. డాక్ట‌ర్ మాట‌ల‌తో కార్తీక్ క‌న్నీళ్లు పెట్టుకుంటాడు.

ఏంటి దీప చ‌చ్చిపోయిందా జ్యోత్స్న అంటుంది. ఆమెకు కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. పాపం శౌర్య త‌ల్లిలేని అనాథ అవుతుంద‌ని, దీప‌కు త‌ల్లిని దేవుడు దూరం చేస్తే…శౌర్య‌కు త‌ల్లిని నువ్వు దూరం చేస్తున్నావ‌ని సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టి కార్తీక్ మ‌న‌సు మార్చేస్తుంది.

పేప‌ర్స్‌పై సంత‌కం…

నేను ఏమైనా ప‌ర్వాలేదు దీప‌ను కాపాడుకోవాల‌ని కార్తీక్ నిర్ణ‌యించుకుంటాడు. దీప కోసం జ్యోత్స్న ఇచ్చిన ఖాళీ బాండ్ పేప‌ర్స్‌పై సంత‌కం పెడ‌తాడు. దీప అంటే నీకు ఎంత ప్రేమో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌ని జ్యోత్స్న అంటుంది. తాను దాచిన డోన‌ర్స్‌ను కార్తీక్‌తో పంపిస్తుంది జ్యోత్స్న‌.

కార్తీక్ వెళ్లిపోగానే ఇది సంత‌కం కాదు…నీ త‌ల‌రాత అని బాండ్ పేప‌ర్స్ చూస్తూ జ్యోత్స్న అంటుంది. ఈ అగ్రిమెంట్ మీద నేను రాసే ఒక్కొక్క రాత నీ జీవితాన్ని ఎలా మ‌లుపు తిప్పుతుందో నువ్వే చూస్తావ‌ని అంటుంది. అన్ని త్వ‌ర‌లోనే తెలుస్తాయ‌ని, మ‌నం మ‌ళ్లీ క‌లుద్దామ‌ని అక్క‌డి నుంచి హాస్పిట‌ల్ నుంచి వెళ్లిపోతుంది.

కాంచ‌న ప్ర‌శ్న‌లు…

డోన‌ర్‌ను తీసుకురావ‌డానికి ఇంత టైమ్ ఎందుకు ప‌ట్టింద‌ని కార్తీక్‌ను అడుగుతుంది కాంచ‌న‌. కానీ కార్తీక్ స‌మాధానం చెప్ప‌లేక‌పోతాడు. బ‌య‌ట ఏం జ‌రిగిందో నేను నీతో చెప్ప‌లేన‌ని అంటాడు. ఆప‌రేష‌న్ స‌క్సెస్ అవుతుంది. దీప ప్రాణాల‌కు ఎలాంటి ప్ర‌మాదం డాక్ట‌ర్ చెబుతుంది.

సొంత మేన‌కోడ‌లు కాదు…

దీప‌ది గ‌ట్టి పిండ‌మ‌ని…పుట్ట‌గానే రోడ్డుపై విసిరేస్తే బ‌తికి బ‌ట్ట క‌ట్టిన మ‌నిషి అని అన‌సూయ నోరు జారుతుంది. రోడ్డు మీద విసిరేయ‌డం ఏంటి అని కాంచ‌న అడుగుతుంది. దీప త‌న సొంత మేన‌కోడ‌లు కాద‌నే విష‌యం బ‌య‌ట‌ప‌డ‌టంతో త‌డ‌బ‌డిపోతుంది అన‌సూయ‌. పుట్టిన‌ప్పుడు చేతులో నుంచి జారి కింద‌ప‌డిపోయింద‌ని అబ‌ద్ధం ఆడుతుంది. దీప ఎవ‌రి బిడ్డో…త‌ల్లి ఎవ‌రో దాసుకు త‌ప్ప ఇంకెవ‌రికి తెలియ‌ద‌ని మ‌న‌సులో అన‌సూయ అనుకుంటుంది.

మీరే కాపాడుకున్నారు…

మీరే మీ భార్య‌ను కాపాడుకున్నార‌ని, డోన‌ర్స్ రావ‌డం ఐదు నిమిషాలు ఆల‌స్య‌మైనా దీప బ‌తికేది కాద‌ని కార్తీక్‌తో అంటుంది డాక్ట‌ర్‌. మీలాంటి మంచివాళ్ల‌ను దేవుడు బాధ‌పెట్ట‌డ‌ని అంటుంది. దీప‌కు పెద్ద ప్ర‌మాదం త‌ప్ప‌డంతో అన‌సూయ‌, కాంచ‌న సంబ‌ర‌డ‌ప‌తారు. దీప‌కు జ‌రిగిన ప్ర‌మాదం గురించి శౌర్య‌కు చెప్పొద్ద‌ని కాంచ‌న‌, అన‌సూయ‌ల‌తో అంటాడు కార్తీక్‌.

జ్యోత్స్న‌కే అవ‌స‌రం…

హాస్పిట‌ల్‌లో ఉన్న కార్తీక్‌ను క‌లుస్తాడు దాసు. హాస్పిట‌ల్‌కు దాసు ఒక్క‌డే వ‌చ్చాడ‌ని తెలిసి కార్తీక్ షాక‌వుతాడు. నేను ఇప్పుడు నేను కోలుకున్నాన‌ని, అంత బాగుంద‌ని దాసు అంటాడు. దీప‌ను పొడిచింది ఎవ‌రో తెలుసా అని కార్తీక్‌ను అడుగుతాడు దాసు. ఇంకా తెలియ‌లేద‌ని కార్తీక్ బ‌దులిస్తాడు.

జ్యోత్స్న‌కు త‌ప్ప దీప‌ను చంపాల్సిన అవ‌స‌రం ఎవ‌రికి లేద‌ని కార్తీక్‌తో అంటాడు దాసు. దీప‌ను జ్యోత్స్న చంపాల‌ని ఎందుకు అనుకుంటుంద‌ని కార్తీక్ అన‌గానే..ఆస్తి కోసం అని దాసు స‌మాధాన‌మిస్తాడు. దీప‌ను చంపితే ఆస్తి మొత్తం జ్యోత్స్న‌దే అవుతుంద‌ని దాసు అంటాడు.

సుమిత్ర కూతురు దీప‌నే…

దాసు ఏం చెబుతున్నాడో అర్థం కాక కార్తీక్ క‌న్ఫ్యూజ్ అవుతాడు. దీపనే శివ‌న్నారాయ‌ణ ఇంటి అస‌లైన వార‌సురాలు అనే నిజం బ‌య‌ట‌పెడ‌తాడు దాసు. సుమిత్ర‌, ద‌శ‌ర‌థ్‌ల అస‌లైన కూతురు దీప‌నే అనే నిజం బ‌య‌ట‌పెడ‌తాడు. జ్యోత్స్న త‌న కూతురు అని చెబుతాడు.

దాసు క‌ట్టుక‌థ చెబుతున్నాడ‌ని కార్తీక్ పొర‌ప‌డ‌తాడు. ఇవ‌న్నీ త‌న క‌ళ్ల ముందే జ‌రిగాయ‌ని, వాటికి ప్ర‌త్య‌క్ష సాక్షిని నేనే అని చెబుతాడు. దీప… కుబేర్ కూతురు అని కార్తీక్ అంటాడు. కుబేర్ క‌న్న కూతురు దీప కాద‌ని, కావాలంటే అన‌సూయ‌ను అడ‌గ‌మ‌ని చెబుతాడు.

ప‌గ‌…స్వార్థం…

ఒక మ‌నిషి ప‌గ‌, స్వార్థం ఎంత‌మంది జీవితాల‌ను అన్యాయం చేసిందో నీకు తెలియాల‌ని జ‌రిగిన క‌థ మొత్తం కార్తీక్‌కు చెబుతాడు దాసు. మా అమ్మకు శివ‌న్నారాయ‌ణ అంటే కోపం. పెళ్లైనా త‌ర్వాత శివ‌న్నారాయ‌ణ మా అమ్మ‌కు భార్య స్థానం ఇవ్వ‌లేదు. ఇంటి పెత్త‌నం అప్ప‌గించ‌లేద‌ని మా అమ్మ కుమిలిపోయేది. శివన్నారాయ‌ణ త‌న మొద‌టిభార్య‌ను మ‌ర్చిపోలేక‌పోవ‌డం కూడా మా అమ్మ ప‌గ పెరగ‌డానికి కార‌ణ‌మైంది. అదే టైమ్ ఇంట్లో ప‌ని చేసే అమ్మాయిని ప్రేమించాన‌ని న‌న్నుశివ‌న్నారాయ‌ణ ఇంట్లో నుంచి గెంటేయ‌డం మా అమ్మ త‌ట్టుకోలేక‌పోయింది.

అమ్మ కార‌ణంగా…

సుమిత్ర వ‌దిన‌, నా భార్య ఒకేసారి గ‌ర్భ‌వ‌తులు అయ్యారు. ఒకే సారి, ఒకే హాస్పిట‌ల్‌లో వారికి ఆడ‌పిల్ల‌లు పుట్టారు. శివ‌న్నారాయ‌ణ ఇంటి వార‌సురాలిగా నా కూతురు పెర‌గాల‌ని సుమిత్ర వ‌దినకు పుట్టిన బిడ్డ‌ను మార్చేసింది. దీప‌ను రోడ్డుపై ప‌డేస్తే ఆ చిన్నారి కుబేర్‌కు దొరికింద‌ని అంటాడు. మా అమ్మ కార‌ణంగా ఐశ్వ‌ర్యంలో పెర‌గాల్సిన దీప కుబేర్ ద‌గ్గ‌ర పేదింటి అమ్మాయిగా పెరిగింద‌ని కార్తీక్‌తో అంటాడు దాసు. నా కూతురిగా పెర‌గాల్సిన జ్యోత్స్న శివ‌న్నారాయ‌ణ ఇంటి వార‌సురాలిగా పెరుగుతుంద‌ని అంటాడు.

కుబేర్ ఫొటో చూసి…

కుబేర్ ఫొటో చూసి అత‌డి ద‌గ్గ‌రే దీప పెరుగుతుంద‌ని నిజం తెలిసింద‌ని, ఈ విష‌యం అన్న‌య్య‌కు చెప్పాల‌ని ఆయ‌న ఇంటికి వెళ్లాన‌ని అంటాడు దాసు. ఎప్ప‌టికైనా నేను బ‌తికుంటే ప్ర‌మాద‌మ‌ని జ్యోత్స్న‌నే త‌న త‌ల‌పై కొట్టింద‌ని దాసు చెబుతాడు. దాసు మాట‌ల‌తో కార్తీక్ షాక‌వుతాడు. అక్క‌డితో నేటి కార్తీక దీప 2 సీరియ‌ల్ ముగిసింది.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024