



Best Web Hosting Provider In India 2024

జూలై 10న హంద్రీనీవా నీరు విడుదల – సీఎం చంద్రబాబు ప్రకటన
జూలై 10న హంద్రీనీవా నీరు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పనుల పూర్తికి రూ. 3,873 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక శరవేగంగా పనులు జరుగుతున్నాయన్నారు.
హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ఫేజ్ – 1, 2 కింద 554 కి.మీ. మేర కాలువ లైనింగ్, వెడల్పు పనులకు రూ.3,873 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఐదేళ్లు హంద్రీనీవా పనులు ఆగిపోయాయని… కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులను శరవేగంగా పూర్తి చేస్తోందని అన్నారు.
పోలవరం-బనకచర్ల పూర్తయితే సీమలో కరువు అనే మాట వినబడదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందుతుందని చెప్పారు. శుక్రవారం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం చాయాపురంలో హంద్రీనీవా సుజల స్రవంతి పనులను క్షేత్రస్థాయిలో సీఎం పరిశీలించారు. అనంతరం చాయాపురంలో నిర్వహించిన ప్రజావేదికలో పాల్గొన్నారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు.
సీఎం చంద్రబాబు ప్రసంగం – ముఖ్యమైన అంశాలు:
- “1996, మార్చి 11వ తేదీన నేను ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రినీవాకు శంకుస్థాపన చేశాను. ఎన్టీఆర్ కల హంద్రినీవా. ఆనాడు రాయలసీమకు నీరు లేదు. ఎడారిగా మారిపోతుందని అందరూ చేతులెత్తేశారు. అలాంటి పరిస్థితుల్లో నమ్మకం కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్.
- రాయలసీమ రాళ్ల సీమ అని చాలామంది అన్నారు. రతనాలసీమ చేస్తానని ఆరోజు చెప్పాను. మొన్నటి ఎన్నికల్లో కూటమికి జిల్లా వాసులు పట్టం కట్టారు.
- నీరు ఉంటేనే ఏదైనా సాధ్యం . నీటి వనరుల కోసం హంద్రినీవాను వెడల్పు చేస్తానని చెప్పిన గంటలో జీవో ఇచ్చాను. అదే సమయంలో 37 శాతం పనులు పూర్తి చేశాను.
- 2014లో మేం గెలిచాక సీమ ప్రాజెకక్టులపై దృష్టి పెట్టాం. కియా పరిశ్రమను ఏపీకి రమ్మంటే నీళ్లు ఎక్కడున్నాయో చెప్పమన్నారు. ఆరు నెలల సమయం తీసుకుని గొల్లపల్లి ప్రాజెక్టు పూర్తిచేసి ఐదేళ్లలోనే కరువు జిల్లాకు కియా వచ్చేలా చేశాం.
- 2014-19 మధ్యకాలంలో ఇక్కడ ఇరిగేషన్ కోసమే రూ. 70 వేల కోట్లు ఖర్చు చేశాం. ఒక్క రాయలసీమలోనే రూ. 12, 441 కోట్లు ఖర్చు చేశాం. హంద్రినీవాలో రూ. 4,200 కోట్లు ఖర్చు చేశాం.
- గొల్లపల్లి, మడకశిర బ్రాంచ్ కెనాల్ పూర్తిచేశాం. చెర్లోపల్లి , జీడిపల్లి ప్రాజాక్టులు పూర్తిచేశాం. హంద్రీనీవా ప్రాజెక్టు కోసం 512 ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. మొత్తంగా 1040 మిషన్లు పనిచేస్తున్నాయి. మొన్నటి వరకూ పుట్టపర్తి చుట్టుపక్కల నీరు కనిపించేది కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా నీరు కనిపిస్తుంటే ఆనందంగా ఉంది.
- ఒకప్పుడు ఇక్కడి జనం దిగాలుగా ఉండేవారు. ఇప్పడు హషారుగా ఉన్నారు. నీరు అందడంతోనే మీలో ధైర్యం వచ్చింది. అందుకు హంద్రినీవానే కారణం. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కుప్పం వరకూ హంద్రినీవా 770 కిలోమీటర్లు పొడవుంది. ఇది ఆసియాలోనే పొడవైనది.
- ప్రాజెక్టు పూర్తయితే ఫేజ్-1 కింద కర్నూలు జిల్లాలో 77,094, నంద్యాల జిల్లాలో 2,906, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాలు… మొత్తం 1,98,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది.
- ఫేజ్-2 కింద అనంతపురం జిల్లాలో 33,617, సత్యసాయి జిల్లాలో 1,93,383, కడప జిల్లాలో 37,500, చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాలు కలిపి మొత్తం 4,04,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది.
- పోలవరం – బనకచర్ల పూర్తయితే రాష్ట్ర ముఖచిత్రం మారిపోతుంది. 2 వేల టీఎంసీల నీరు గోదావరి నుంచి సముద్రంలోకి పోతోంది. అందులో 300 టీఎంసీ నీరు మనం తెచ్చుకోగలిగితే రాష్ట్రమంతా సస్యశ్యామలం అవుతుంది.
- ప్రాజెక్టు కోసం రూ. 81 వేల కోట్లు కావాలి. సంకల్పం ఉంటే అదే దారి చూపుతుంది. పోలవరం నుంచి బనకచర్ల వరకూ నీరు తెస్తే నా జీవితం సార్ధకమవుతుంది.
- ఉరవకొండకు టెక్స్ టైల్ పార్క్ మజూరు చేస్తున్నాం. కొట్టాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేస్తున్నాం. జీడిపల్లి నిర్వాసితులకు వెంటనే పరిహారం అందిస్తాం.
- 2029 నాటికి పేదరికం లేని సమాజాన్ని తయారుచేయడం నా లక్ష్యంగా పెట్టుకున్నాను. ఉగాది రోజున పీ4కు శ్రీకారం చుట్టాం. ఆగస్టు 15 నాటికి 20 లక్షల కుటుంబాల బాధ్యత తీసుకునే మార్గదర్శులను రెడీ చేస్తాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
సంబంధిత కథనం
టాపిక్