




Best Web Hosting Provider In India 2024

తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర- సారె సమర్పించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
తిరుపతి తాతయ్య గుంట గంగమ్మకు టీటీడీ తరఫున ఛైర్మన్, ఈవో సారె సమర్పించారు. మే 6న ప్రారంభమైన జాతర, మే 13 వరకు జరగనుంది. గంగమ్మ తల్లి సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సోదరి అని ప్రతీతి, భక్తుల కోరికలు తీర్చే దైవంగా అమ్మవారు పూజలందుకుంటారు.
తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మకు శనివారం టీటీడీ తరఫున ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామల రావు సారె సమర్పించారు. మే 06 తేదీన చాటింపుతో మొదలైన గంగమ్మ జాతర మే 13వ తేదీ వరకు జరుగనున్న విషయం విదితమే. ముందుగా సారెకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని పుండరీకవల్లి అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
ఊరేగింపుగా వచ్చి సారె సమర్పణ
అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కళాబృందాల ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా సారెను తీసుకెళ్లారు. అంతకుముందు శేషవస్త్రాలు, పసుపు కుంకుమ తదితర మంగళద్రవ్యాలతో సారెను తిరుపతి ఎమ్మెల్యే ఎ. శ్రీనివాసులుకు టీటీడీ ఛైర్మన్, ఈవో అందజేశారు.
వేంకటేశ్వరస్వామి సోదరి గంగమ్మ
ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ… గంగమ్మ తల్లి సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సోదరి అని ప్రతీతి అని, భక్తుల కోరికలు తీర్చే దైవంగా అమ్మవారు పూజలందుకుంటున్నారని తెలిపారు. తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలను, వారి జీవన విధానాలను ప్రతిబింబించేలా అపురూపంగా జాతర జరుగుతుందని చెప్పారు.
టీటీడీ నిధులతో తాతయ్య గుంట గంగమ్మ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, ఇదే సహకారాన్ని భవిష్యత్తులో అందిస్తామన్నారు.
చైత్ర మాసంలో జాతర
ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ… ప్రతి ఏటా చైత్ర మాసంలో జాతర సందర్భంగా నాలుగో రోజున అమ్మవారికి టీటీడీ సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. రూ. 60 లక్షలతో గంగమ్మ జాతరకు ఏర్పాట్లు చేశామని, రూ.3.50 కోట్లతో పలు అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు.
తిరుపతి పరిసర ప్రాంతాలతో పాటు తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు గంగమ్మ తల్లిని దర్శించుకుంటున్నారని తెలిపారు.
అనంతరం గోవిందరాజస్వామి, పార్థసారధిస్వామి, గోదాదేవి, కల్యాణ వేంకటేశ్వరస్వామివారిని టీటీడీ ఈవో దర్శించుకున్నారు.
ముందుగా తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు, ఈవో జె. శ్యామల రావు దంపతులు చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలను అందించారు.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 295వ జయంతి ఉత్సవాలు
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 295వ జయంతి ఉత్సవాలను మే 10, 11వ తేదీల్లో తిరుపతి, తరిగొండలో వైభవంగా నిర్వహించనున్నారు.
తిరుపతిలో
మే 10, 11వ తేదీల్లో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటలకు సాహితి సదస్సు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.
మే 11వ తేది ఉదయం 9 గంటలకు తిరుపతి ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తారు.
తరిగొండలో
మే 11వ తేది తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, ఆలయ ప్రాంగణంలో శ్రీ తరిగొండ వెంగమాంబకు పుష్పాంజలి, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో గోష్టి గానం, హరికథ నిర్వహిస్తారు.
సంబంధిత కథనం
టాపిక్