



Best Web Hosting Provider In India 2024
హార్వర్డ్ యూనివర్శిటీపై ట్రంప్ ప్రభుత్వం కక్ష సాధింపు; కీలక హక్కుల రద్దు; భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏంటి?
తన ఆదేశాలను ధిక్కరించిన హార్వర్డ్ యూనివర్సిటీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కక్ష సాధింపునకు దిగారు. అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునే హార్వర్డ్ విశ్వవిద్యాలయం హక్కును ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. ఇది భారతదేశ విద్యార్థులతో సహా వేలాది మంది విదేశీ విద్యార్థులను ప్రభావితం చేసింది.
అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై కక్ష సాధింపును మరింత తీవ్రతరం చేసింది. అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునే హార్వర్డ్ యూనివర్సిటీ హక్కును తొలగించింది. ఈ నిర్ణయంతో వర్సిటీలోని వేలాది మంది విదేశీ విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. వారిలో భారతదేశానికి చెందిన వందలాది మంది విద్యార్థులు ఉన్నారు. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధమని, పాఠశాల పరిశోధన మిషన్ ను బలహీనపరుస్తుందని హార్వర్డ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
అగమ్య గోచరంగా విద్యార్థుల పరిస్థితి
హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్న అంతర్జాతీయ విద్యార్థులు వేరే విద్యాసంస్థకు బదిలీ కావాలని లేదంటే అమెరికాలో వారి చట్టపరమైన నివాస హోదాను కోల్పోయే ప్రమాదం ఉందని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది. హార్వర్డ్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ప్రతి సంవత్సరం 500 నుండి 800 మంది భారతీయ విద్యార్థులు మరియు స్కాలర్స్ ఈ విశ్వవిద్యాలయంలో చేరుతున్నారు. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయంలో భారత్ నుంచి 788 మంది విద్యార్థులు చదువుతున్నారు.
సుమారు 7 వేల మంది విద్యార్థులు
ఈ చర్య హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఇందులో ప్రతీ సంవత్సరం దాదాపు 6,800 మంది అంతర్జాతీయ విద్యార్థులు వివిధ కోర్సుల్లో చేరుతారు. వారిలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లలో ఉన్నారు. ఆ విద్యార్థులు ఇప్పుడు ఏం చేయాలో తెలియని గందరగోళంలో ఉన్నారు.
ట్రంప్ ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?
యూనివర్సిటీలో చదువుతున్న విదేశీ విద్యార్థుల రికార్డులను సమర్పించాలన్న ట్రంప్ ప్రభుత్వ ఆదేశాలను హార్వర్డ్ విశ్వవిద్యాలయం ధిక్కరించింది. దాంతో డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఈ తాజా చర్య తీసుకుందని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోమ్ ఒక లేఖలో తెలిపారు. హార్వర్డ్ “యూదు విద్యార్థులకు వ్యతిరేకంగా, హమాస్ అనుకూల సానుభూతిని ప్రోత్సహించే అసురక్షిత ప్రాంగణ వాతావరణాన్ని సృష్టిస్తోంది” అని నోమ్ ఆరోపించారు.
ప్రైవేటు కాలేజీల్లో ప్రవేశాలపై ప్రభుత్వానికి అధికారం ఉందా?
దేశంలోకి ఎవరు రావాలనే దానిపై అమెరికా ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ అండ్ విజిటర్ ప్రోగ్రామ్ లో భాగంగా ఏయే కాలేజీలు ఉన్నాయో డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ పర్యవేక్షిస్తుంది. ఈ జాబితా నుంచి హార్వర్డ్ యూనివర్సిటీని తొలగిస్తామని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ కార్యక్రమం తమ వర్సిటీ కాలేజీల్లో చేరిన విదేశీ విద్యార్థులకు డాక్యుమెంటేషన్ జారీ చేసే సామర్థ్యాన్ని కళాశాలలకు ఇస్తుంది. ఆ తర్వాత విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటారు.
హార్వర్డ్ లోని ప్రస్తుత అంతర్జాతీయ విద్యార్థుల పరిస్థితి
అయితే, ఈ సెమిస్టర్ తో డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులను గ్రాడ్యుయేట్ చేయడానికి అనుమతిస్తారు. ఈ మార్పులు 2025-2026 విద్యా సంవత్సరానికి అమల్లోకి వస్తాయని నోమ్ లేఖలో పేర్కొన్నారు. హార్వర్డ్ లో ఇంకా డిగ్రీ పూర్తి చేయని విద్యార్థులు మరో విశ్వవిద్యాలయానికి బదిలీ కావాలని, లేకపోతే వారు అమెరికాలో ఉండటానికి చట్టపరమైన అనుమతిని కోల్పోతారని నోమ్ చెప్పారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link