




Best Web Hosting Provider In India 2024

వివాహ రిజిస్ట్రేషన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. ఉపయోగాలు ఏంటి.. ముఖ్యమైన అంశాలు
ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎక్కడ చూసినా కల్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. వచ్చేనెల వరకు ముహూర్తాలు ఉన్నాయి. దీంతో పెళ్లిళ్ల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ నిబంధనల ప్రకారం.. వివాహ రిజిస్ట్రేషన్ చేసుకునే విషయంలో మాత్రం చాలా మంది శ్రద్ధ చూపట్లేదు. కానీ దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
చాలామంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ.. వివాహ రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకోవడం లేదు. అవసరమైనప్పుడు చూసుకుందామనే భావనతో వదిలేస్తున్నారు. అలా కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది. సమయం, డబ్బు వృథా కాకుండా చూసుకోవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
దరఖాస్తు ఇలా..
హిందూ వివాహ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తుతో పాటు.. వరుడు, వధువు పదో తరగతి మెమో జిరాక్స్, ఆధార్ కార్డులు, పెళ్లి ఫొటోతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఇద్దరేసి సాక్షులు, వారి ఆధార్ కార్డులు, పెళ్లి శుభలేఖ జత చేయాలి. పెళ్లి జరిగిన నెలలోపు దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇస్తే.. వారు పరిశీలించి పురపాలక లేదా పంచాయతీ కార్యాలయానికి పంపుతారు. ఆ తర్వాత రూ.500 ఫీజు చెల్లించి మూడు, నాలుగు రోజుల్లో వివాహ రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం పొందొచ్చు. అలా కాకుండా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనూ స్లాట్ బుక్ చేసుకుని ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంది.
రూ.500 చాలు..
కల్యాణ వేడుకలు ముగియగానే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. చాలా వివాహాలు కల్యాణ మండపాలు, ఇంటి దగ్గర, ప్రార్థన మందిరాల్లో జరుగుతుంటాయి. వాటిలో సగానికిపైగా రిజిస్ట్రేషన్‌కు ముందుకు రావట్లేదు. చాలా మందికి అవగాహన లేక నమోదు చేసుకోలేకపోతున్నారని అధికారులు అంటున్నారు. అవసరమైనప్పుడు పరుగులు పెట్టి.. రూ.500తో అయిపోయే పనికి.. మధ్యవర్తుల ప్రమేయంతో రూ.వేలల్లో ఖర్చు పెడుతున్నారు.
ఉపయోగాలు ఏంటి..
ఉద్యోగులు తమ జీవిత భాగస్వామిని నామినీగా నమోదు చేయాలనుకున్నా.. ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలన్నా వివాహ రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం కచ్చితంగా ఉండాలి. విదేశాలకు వెళ్లే సమయంలోనూ దంపతుల వీసా, వర్క్ పర్మిట్‌కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. కోర్టు, పోలీసు కేసులు, ప్రభుత్వ వ్యవహారాల్లోనూ వీటికి ప్రాధాన్యముంటుంది. ఆధార్, రేషన్ కార్డు, ఇతర పత్రాల్లో వధువు ఇంటి పేరు మార్చుకునేందుకు ఇది అవసరమవుతుంది. కొన్ని గంటల సమయం కేటాయిస్తే.. ఇన్ని ఉపయోగాలు పొందవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్