




Best Web Hosting Provider In India 2024

తెలంగాణలో మరో 4 రోజులు భారీ వర్షాలు…! ఈ జిల్లాలకు హెచ్చరికలు
తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. మరోవైపు మంగళవారం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.ఈ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఏపీ, తెలంగాణలో భిన్నమైన వాతావరణమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత కొద్దిరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగైదు రోజుల పాటు కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. ఇదిలా ఉంటే వచ్చే వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది.
తెలంగాణకు భారీ వర్ష సూచన…
తెలంగాణలో ఈ నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు లేదా ఈదురుగాలులతో కూడిన వానలు పడొచ్చని పేర్కొంది.
ఇవాళ(మే 24) నిర్మల్, నిజామాబాజ్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది 40- 50 కి,మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. వీటితో పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ వర్షాలు కురవనున్నాయి. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
రేపు (మే 25) నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చు. మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జగనాం, సిద్ధిపేట జిల్లాలకు కూడా ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
తెలంగాణలోని పలు జిల్లాల్లో మే 27వ తేదీ వరకు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆ తర్వాత కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని పేర్కొంది. భారీ వర్షాల సూచనతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. అయితే మే 27 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో…. మళ్లీ కూడా భారీ వర్షాలు పడొచ్చు.
ఏపీకి వర్ష సూచన:
మంగళవారం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ రోజున భారీ వర్షాలకు ఆస్కారం ఉందని హెచ్చరించింది.ఉద్యానవన రైతులు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఇవాళ అల్లూరి, మన్యం,తూర్పుగోదావరి, కోనసీమ,కాకినాడ,ఏలూరు జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనకాపల్లి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా అరకబద్రలో 43.7మిమీ,శ్రీసత్యసాయి జిల్లా కల్లుకుంటలో 30.7మిమీ వర్షపాతం నమోదైంది.
సంబంధిత కథనం
టాపిక్