





Best Web Hosting Provider In India 2024

సినిమా థియేటర్ల బంద్ పై మంత్రి సీరియస్, విచారణకు ఆదేశం- క్లారిటీ ఇచ్చిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్
ఏపీలో జూన్ 1 నుంచి సినిమా థియేటర్ల బంద్ అంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయంపై మంత్రి కందుల దుర్గేష్ విచారణ కోరారు. దీనిపై తెలుగు ఫిల్మ ఛాంబర్ క్లారిటీ ఇచ్చింది. థియేటర్ల బంద్ లేదని స్పష్టం చేసింది.
ఏపీలో సినిమా హాళ్ల బంద్ కలకలం రేపుతోంది. సరిగ్గా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ కు ముందే సినిమా హాళ్ల బంద్ అంశం తెరపైకి తీసుకొచ్చారు. ఈ విషయంపై ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు.
జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారనే విషయంపై విచారణ చేపట్టాలని మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. ఎగ్జిబిటర్ల నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి మంత్రి దుర్గేష్ దిశానిర్దేశం చేశారు.
“హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసి వేయాలని ఆ నలుగురు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ స్పందించి హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ తో మాట్లాడారు.
రెవెన్యూ విఘాతంపై ఆరా
ఈ పరిణామంతోపాటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్టెల్ గా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడం గురించీ విచారణ చేయాలని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.
సినిమా హాల్స్ మూసివేత మూలంగా ఎన్ని సినిమాలు ప్రభావితం అవుతాయి, ఎంత ట్యాక్స్ రెవెన్యూకి విఘాతం కలుగుతుందనే కోణంలోనూ వివరాలు సేకరించబోతున్నారు” అని జనసేన ఎక్స్ లో పోస్టు పెట్టింది.
కారకులు ఎవ్వరైనా సరే వదిలిపెట్టం- మంత్రి దుర్గేష్
“సినిమా పరిశ్రమ మన రాష్ట్రంలో సాంస్కృతిక విలువల ప్రతిబింబంగా, వేలాది మందికి జీవనాధారంగా కొనసాగుతోంది. ఈ రంగాన్ని అడ్డుపెట్టుకుని అనవసర వివాదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదు. ప్రజల అభిరుచి, కళాకారుల హక్కులు, పరిశ్రమలో ఉన్న శ్రమజీవుల హితాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతాం. కారకులు ఎవ్వరైనా సరే వదిలిపెట్టం”- మంత్రి కందుల దుర్గేష్
పవన్ కల్యాణ్ సినిమా విడుదల సమయంలో
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అవుతున్న తొలిసినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా జూన్ 12న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే ఇంతలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు… తమ సమస్యలు పరిష్కరించాలని లేకుండా సినిమా హాళ్లు బంద్ చేస్తామంటూ ప్రకటించారు. అయితే సినిమా హాళ్ల బంద్ వెనుక కుట్ర కోణం ఉందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
బడా నిర్మాతల చేతుల్లోనే థియేటర్లు
తెలుగు రాష్ట్రాల్లో బడా నిర్మాతలైన దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఏషియన్ సునీల్ చేతిలోనే థియేటర్లు ఉన్నాయి. ఈ నలుగురు నిర్మాతలు థియేటర్లు తమ గుత్తాధిపత్యంలో పెట్టుకుని చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వడంలేదని గతంలో నట్టి కుమార్ వంటి నిర్మాతలు ఆరోపణలు చేశారు.
తాజాగా పవన్ కల్యాణ్ వీరమల్లు సినిమా రిలీజ్ సమయానికి థియేటర్ల బంద్ అంటున్నారంటే? అనే కుట్రకోణం ఉందా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పుడు ఆ నలుగురు ఎవరూ అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
థియేటర్ల బంద్ అవాస్తవం
ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ స్పందించారు. జూన్ 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్ ఉండదని స్పష్టం చేశారు. థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలన్న డిమాండ్ పై శనివారం ఫిల్మ్ ఛాంబర్లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో నిర్మాతలు సమావేశం అయ్యారు.
థియేటర్ల బంద్ పై తప్పుగా ప్రచారం
థియేటర్ల బంద్ ను తప్పుగా చిత్రీకరించారని దామోదర్ ప్రసాద్ అన్నారు. చర్చలు జరగకపోతే జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందనే చెప్పారన్నారు. కానీ థియేటర్లు మూసి వేస్తారన్న సమాచారాన్నే ప్రచారం చేశారని, అలాంటి పరిస్థితులు లేవన్నారు. కేవలం ఒక్క సినిమాను దృష్టిలో పెట్టుకుని థియేటర్లను బంద్ చేస్తున్నామనడం సరికాదన్నారు.
పర్సంటేజీపై చర్చ
థియేటర్ల పర్సంటేజీ కొన్నేళ్లుగా ఎలాంటి చర్చ జరగలేదని, ప్రస్తుతం దానిపై చర్చలు జరుగుతున్నాయన్నారు. దీనిపై మూడు సెక్టార్ల నుంచి కమిటీ వేస్తున్నామన్నారు. ఈనెల 30న జరిగే సమావేశంలో కమిటీ సభ్యులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
మంత్రిని కలుస్తాం
వీలైనన్ని సమస్యలను తామే పరిష్కరించుకుంటామని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ అన్నారు. మిగిలిన వాటి విషయంలో ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసి ఇండస్ట్రీలో సమస్యలను వివరిస్తామని అన్నారు.