రుచికి తిరుగులేని కొబ్బరి గోరుచిక్కుడు కాయ కర్రీ తిన్నారంటే నాన్‌వెజ్ వంటల్ని మర్చిపోతారు!

Best Web Hosting Provider In India 2024

రుచికి తిరుగులేని కొబ్బరి గోరుచిక్కుడు కాయ కర్రీ తిన్నారంటే నాన్‌వెజ్ వంటల్ని మర్చిపోతారు!

Ramya Sri Marka HT Telugu

రుచికరమైన కొబ్బరి గోరుచిక్కుడు కూరను అరగంటలో సులభంగా తయారు చేసుకోండి. గోరుచిక్కుడు, కొబ్బరి కలయికతో చేసే ఈ కూర అన్నం, చపాతీ వంటి వాటిలోకి అద్భుతమైన రుచిని అందిస్తుంది.

గోరు చిక్కుళ్లు (Pexel)

గోరుచిక్కుడు ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలుసు. మరి దానికి కొబ్బరి రుచి తోడైతే? ఇంకేముంది. వావ్ అనాల్సిందే కదా! అటువంటి రుచికరమైన రెసిపీనే మీ ముందుకుతెచ్చాం. ఈ కొబ్బరి గోరుచిక్కుడు కూర అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి దేనితో పాటు తీసుకున్నా కూడా అదిరిపోతుంది. కేవలం అరగంటలో రెడీ అయిపోయే ఈ రుచికరమైన కూరను ఎలా చేయాలో చూసేయండి.

కొబ్బరి గోరుచిక్కుడు కర్రీకి కావాల్సిన పదార్థాలు:

  • గోరుచిక్కుడు కాయలు – 250 గ్రాములు
  • పచ్చి కొబ్బరి తురుము – 1/2 కప్పు
  • వెల్లుల్లి రెబ్బలు – 5-6 (కచ్చా పచ్చాగా దంచినవి)
  • నూనె – 2 టేబుల్ స్పూన్లు
  • ఆవాలు – 1/2 టీస్పూన్
  • జీలకర్ర – 1/2 టీస్పూన్
  • పచ్చి శనగపప్పు – 1 టీస్పూన్
  • ఎండు మిరప కాయ – 1 (తుంచి పెట్టుకోండి)
  • కరివేపాకు – కొద్దిగా
  • పసుపు – 1/2 టీస్పూన్
  • కారం – 1 టేబుల్ స్పూన్ (లేదా మీ రుచికి తగినంత)
  • ఉప్పు – రుచికి తగినంత
వంట చేస్తున్న నమూనా చిత్రం
వంట చేస్తున్న నమూనా చిత్రం

కొబ్బరి గోరుచిక్కుడు కాయ కర్రీ తయారీ విధానం:

  1. ముందుగా, గోరుచిక్కుడు కాయలను శుభ్రంగా కడిగి, ఒక గిన్నెలో వేయండి.
  2. అవి మునిగే వరకు నీళ్లు పోసి, చిటికెడు ఉప్పు వేసి, మెత్తగా ఉడకబెట్టండి. (కుక్కర్‌లో అయితే ఒక విజిల్ సరిపోతుంది).
  3. ఉడికిన తర్వాత నీటిని తీసేసి, గోరుచిక్కుళ్లను చల్లారనివ్వండి. ఇప్పుడు వాటికి రెండు వైపులా ఉండే పీచును జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకోండి.
  4. ఒక మందపాటి గిన్నె లేదా కడాయిని పొయ్యి మీద పెట్టి, నూనె వేసి వేడి చేయండి.
  5. నూనె వేడయ్యాక, అందులో దంచుకున్న వెల్లుల్లిని వేసి బంగారు రంగులోకి మారే వరకు వేయించండి.
  6. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు వేసి, ఆవాలు చిటపటలాడే వరకు వేయించాలి.
  7. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఒక్కసారి కలపండి.వెంటనే పసుపు కూడా వేసి కదిలించండి.
  8. ఇప్పుడు ఇంతకుముందే సిద్ధం చేసి ఉంచుకున్న గోరుచిక్కుళ్లను కడాయిలో వేయండి.
  9. మంటను మీడియంలో పెట్టి, గోరుచిక్కుళ్లు కొద్దిగా రంగు మారే వరకు, నూనెలో బాగా వేయించుకోండి.
  10. గోరుచిక్కుళ్లు చక్కగా వేగిన తర్వాత, పచ్చి కొబ్బరి తురుమును వేయండి. కొబ్బరి పచ్చి వాసన పోయే వరకు కొద్దిసేపు వేయించాలి.
  11. ఇప్పుడు కారం, రుచికి తగినంత ఉప్పు వేసి, కూర అంతా బాగా కలిసేలా గరిటెతో తిప్పండి.
  12. మంటను తగ్గించి, ఉప్పు, కారం గోరుచిక్కుళ్లకు బాగా పట్టే వరకు 2-3 నిమిషాలు వేయించి, స్టవ్ ఆపేయండి.
  13. అంతే.. నోరూరించే కొబ్బరి గోరుచిక్కుడు కూర రెడీ అయిపోయినట్లే. దీనిని వేడి అన్నంతో లేదా చపాతీలతో కలుపుకుని తినేయొచ్చు.

ఆరోగ్య ప్రయోజనాలు:

ఈ కొబ్బరి గోరుచిక్కుడు కూర కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. గోరుచిక్కుడులో ఉండే పీచు పదార్థం (ఫైబర్) జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే విటమిన్లు A, C, K వంటి ముఖ్యమైన పోషకాలను అందించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పచ్చి కొబ్బరిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా, మెదడు పనితీరుకు తోడ్పడతాయి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024