




Best Web Hosting Provider In India 2024

విశాఖలో పెరుగుతున్న మహిళల అదృశ్యం కేసులు.. 42 మంది మిస్సింగ్ మిస్టరీనే! కారణాలు ఏంటి?
విశాఖలో మహిళల మిస్సింగ్ కేసులు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. కేవలం 4 నెలల్లో 175 మంది మాయమయ్యారు. ఇప్పటి వరకు 133 మంది ఆచూకీ మాత్రమే లభ్యమైంది. 42 మంది మహిళల అదృశ్యం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. ప్రేమ, వివాహేతర సంబంధాలు, కుటుంబ కలహాలే మిస్సింగ్‍లకు కారణమని తెలుస్తోంది.
విశాఖలో వరుసగా మహిళల అదృశ్య ఘటనలు కలవరం రేపుతున్నాయి. దాదాపుగా ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట మహిళలు మాయమవుతూనే ఉన్నారు. బాలికల నుంచి వివాహితుల వరకు చాలామంది కనిపించకుండా పోతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు.. తిరిగి ఇంటికి చేరకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వీరి కోసం కుటుంబ సభ్యులు.. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో.. చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
నాలుగు నెలల్లో 175 మంది..
ఇటీవల విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మిస్సింగ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా.. కేవలం నాలుగు నెలల్లోనే 175 మంది మహిళలు అదృశ్యమైనట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. మహిళల అదృశ్యానికి ప్రధానంగా ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలే కారణమని పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతోంది. కనిపించకుండా పోయిన యువతుల్లో ఎక్కువ మంది.. ప్రేమించుకోవడం, ప్రేమికుడిని దక్కించుకోవడం కోసమే ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు సమాచారం.
వివాహేతర సంబంధాలతో..
మధ్య వయస్కులైన మహిళలు కూడా.. వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబాన్ని వదిలి వెళ్తున్నారు. మిస్సింగ్ కేసుల్లో సుమారు 75 శాతం వరకు ఈ రెండు కారణాలే ఉన్నాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. గత ఐదేళ్లలో ప్రతి ఏటా 50 నుంచి 186 కేసులు వరకు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది నాలుగు నెలల్లోనే 175 కేసులు నమోదవడం.. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
42 మంది మిస్సింగ్ మిస్టరీనే..
జనవరి నెలలో 37, ఫిబ్రవరిలో 49, మార్చిలో 43, ఏప్రిల్‌లో 46 మంది అదృశ్యమయ్యారు. వీరిలో 133 మంది ఆచూకీని పోలీసులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంకా 42 మంది ఆచూకీ లభ్యం కాలేదు. వారి కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. మిస్సింగ్ కేసుల పరిష్కారం కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
ఆచూకీ గుర్తించినా సమస్యలే..
మిస్సింగ్ అయిన మహిళలు, బాలికలను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారుతోంది. కొంతమంది ఆచూకీ తెలుసుకున్నప్పటికీ.. మేజర్లు, చట్టాలు, హక్కులు పేరుతో చుక్కులు చూపించిన సంఘటనలు ఉన్నాయి. ఇటువంటి కేసుల్లో అదృశ్యమైన వారి ఆచూకీని పోలీసులు గుర్తించడం మినహా.. వారిని కుటుంబ సభ్యులకు అప్పగించడం పెద్ద సమస్యగా మారుతోంది. దీంతో కేసులు త్వరగా పరిష్కారం కావడం లేదు.
సంబంధిత కథనం
టాపిక్