



Best Web Hosting Provider In India 2024

పల్నాడులో ప్రాణాలు తీస్తున్న ఆధిపత్య పోరు.. ఇద్దరు టీడీపీ నాయకులు హతం.. సినిమాను మించిన క్రైమ్ ఇది!
పల్నాడు జిల్లా.. సున్నితమైన ప్రాంతం. అందులోనూ మాచర్ల నియోజకవర్గం అత్యంత సున్నితమైనది. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఫ్యాక్షన్ గొడవలు నిత్యం జరుగుతాయి. తాజాగా ఆధిపత్య పోరు కారణంగా.. ఇద్దరు టీడీపీ నాయకులను దారుణంగా చంపేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పల్నాడు ప్రాంతం మరోసారి ఉలిక్కిపడింది. వెల్దుర్తి మండలంలో ఆధిపత్య పోరు ఇద్దర్ని బలి తీసుకుంది. బోదిలవీడులో జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అనే అన్నదమ్ముల్దిద్దరిని కారుతో ఢీకొట్టి హతమార్చారు. అత్యంత సమస్యాత్మక గ్రామం గుండ్లపాడుపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతోనే హత్యలు జరిగాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రెండు హత్యలు ముందస్తు వ్యూహంలో భాగంగానే జరిగినట్టు తెలుస్తోంది.
ఏం జరిగింది..
గుండ్లపాడు గ్రామానికి చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు.. తెలంగాణలోని నక్కలగూడెంకు ఓ శుభకార్యానికి వెళ్లారు. మొత్తం నాలుగు ద్విచక్ర వాహనాలపై 8 మంది వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని అందరూ గుండ్లపాడుకు బయలుదేరారు. అయితే.. మాచర్ల నుంచి గ్రామానికి వెళ్లే క్రమంలో రెండు బైక్లు కొంత ముందుగా వెళ్లాయి. ఆ తర్వాత జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు బయలుదేరారు. వీరి వెనకాల జవిశెట్టి వెంకటేశ్వర్లు అల్లుడు, మరొకరు వస్తున్నారు.
ముందే వెళ్తూ.. నిందితులకు సమచారం..
వీరందరికంటే ముందు గుండ్లపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్పై వెళుతూ.. వీరి సమాచారాన్ని ఎప్పటికప్పుడు హంతకులకు తెలియజేశారు. ఈ సమాచారం ఆధారంగా.. తొలుత రెండు ద్విచక్ర వాహనాలు వెళ్లిన తర్వాత.. మూడో బైక్పై వస్తున్న అన్నదమ్ములిద్దరిని కారుతో గుద్ది చంపేశారు. కోటేశ్వరరావు కొనఊపిరితో ఉన్నాడని గుర్తించి.. రాయితోమోది చంపేశారు. వెనుకగా వస్తున్న వారిని చూసి హంతకులు పరారయ్యారు. హంతకులకు సమాచారం ఇచ్చిన వ్యక్తి కూడా తన వాహనాన్ని అక్కడే పడేసి పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.
ఎస్పీ పల్లె నిద్ర..
గుండ్లపాడు.. సున్నితమైన గ్రామం. ఇక్కడ గొడవలు జరగకుండా పోలీసులు అనేక చర్యలు చేపట్టారు. స్వయంగా జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పల్లె నిద్ర చేశారు. ప్రశాంత వాతావరణంలో జీవించాలని హితబోధ చేశారు. అయినా ఫలితం లేదు. వర్గపోరు ఆగలేదు. టీడీపీ కార్యకర్త చంద్రయ్య హత్య జరిగిన నాటి నుంచి గ్రామంలో పోలీసుల పికెట్ కొనసాగుతోంది. అయినా గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
ఫ్లెక్సీ వివాదం ముదిరి..
ఈ గ్రామంలో ఏప్రిల్లో ఫ్లెక్సీ వివాదం రాజుకుంది. అప్పటినుంచీ శాంతిభద్రతలు అదుపులో లేవనే టాక్ వినిపిస్తోంది. వర్గపోరు నివురుగప్పిన నిప్పులా ఉంది. పోలీసులు ముందే ఈ విషయాన్ని గ్రహిస్తే.. ప్రాణాలు పోయేవి కావని అంటున్నారు. ఈ హత్యలపై స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీలోనే ఉంటూ కొందరు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, అందుకే వారిని దూరం పెట్టానని, వీరికి పిన్నెల్లి సోదరులు వత్తాసు పలకడంతో జంట హత్యలు చేసినట్లుగా ఆయన ఆరోపించారు.
సంబంధిత కథనం
టాపిక్