




Best Web Hosting Provider In India 2024

కెమికల్స్ లేకుండానే దోమలకు చెక్ పెట్టాలంటే ఇంట్లోనే ఈ 9 మొక్కలలో ఏవైనా పెంచుకోండి!
వేసవిలో దోమల బెడద నుంచి తప్పించుకోవడానికి రసాయన స్ప్రేల బదులు, మీ ఇంట్లో కొన్ని ప్రత్యేక మొక్కలను పెంచుకోవడం మంచిది. అవి తమ సహజ సువాసనలతో దోమలను దరిదాపుల్లోకి రానివ్వవు. మరి, ఆ మొక్కలేంటో చూసేద్దామా!
వేసవి కాలం వచ్చిందంటే చాలు… ఆరుబయట, చల్లటి వాతావరణంలో ఎక్కువ సమయం గడపాలనిపిస్తుంది. ముఖ్యంగా సాయంకాలం బయటకు వచ్చినప్పుడు చెవి దగ్గర గుయ్ గుయ్ మంటూ, రాత్రుళ్ళు పడుకుంటే నిద్ర పట్టనివ్వకుండా దోమలు చాలా ఇబ్బంది పెడతాయి. అంతటితో ఆగకుండా, కొన్నిసార్లు డెంగ్యూ వంటి జ్వరాల బారిన పడేలా చేస్తాయి. ఈ సమస్య రాకుండా ఉండాలని కెమికల్స్ (రసాయనాలు) వాడదామనుకుంటే, అవి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయేమోనని ఒక రకమైన భయం.
మరి, ఇలాంటి సమస్యకు సహజంగానే, ఎటువంటి ప్రమాదం లేకుండా పరిష్కారం దొరికితే ఎలా ఉంటుంది? అదేనండి! మీ ఇంట్లో కొన్ని మొక్కలు పెంచుకోవడం వల్ల ఇల్లు అందంగా ఉండటంతో పాటు, వాటి సువాసనలకు దోమలు దరిదాపుల్లోకి కూడా రాకుండా చేస్తాయి. దోమల బెడద లేకుండా హాయిగా గడపడానికి ఆ మొక్కలు ఏమిటో తెలుసుకుందామా?
దోమలను దరిదాపుల్లోకి రానివ్వకుండా చేసే మొక్కలు:
దోమలను తరిమికొట్టడానికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన మొక్కలు ఇక్కడ ఉన్నాయి.
సిట్రోనెల్లా గడ్డి :
దోమలను తరిమికొట్టే మొక్కలలో ఇది చాలా ప్రసిద్ధి చెందింది. దీన్ని కొవ్వొత్తులు, స్ప్రేలలో కూడా వాడతారు. దీనికి ఉండే బలమైన నిమ్మ వాసన దోమలను ఆకర్షించే వాసనలను కప్పివేస్తుంది. ఈ మొక్కను మీ పెరట్లో లేదా కిటికీల దగ్గర కుండీలలో పెంచడం వల్ల దోమలు రాకుండా ఉంటాయి.
లావెండర్:
లావెండర్ సువాసన మనకు చాలా నచ్చినప్పటికీ, దోమలకు అస్సలు నచ్చదు. లావెండర్ ఆకులు, పువ్వులలో ఉండే నూనెలు దోమలు వాసన పసిగట్టే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని నమ్ముతారు. మీరు దీన్ని మీ తోటలో పెంచవచ్చు లేదా కుండీలలో పెట్టి కిటికీలు, తలుపుల దగ్గర ఉంచవచ్చు.
తులసి:
ఆచారాల్లో, ఆయుర్వేద వైద్యాల్లోనే కాకుండా, తులసి దోమలను తరిమికొట్టడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దాని ఘాటైన వాసన దోమలను దూరంగా ఉంచుతుందని చెబుతారు. కొన్ని అధ్యయనాల ప్రకారం, తులసి దోమల లార్వాలకు విషపూరితం కాబట్టి, నీరు నిలిచే ప్రదేశాల దగ్గర ఉంచితే మంచిది.
బంతిపూలు:
ఈ అందమైన, రంగుల పువ్వులు మీ తోటకి అందాన్ని మాత్రమే కాదు, దోమలను కూడా తరిమికొడతాయి. వీటిలో పైరెత్రమ్ అనే రసాయనం ఉంటుంది. ఇది చాలా కమర్షియల్గా ఎన్నో కీటక నివారణ మందులలో వాడతారు. తలుపులు, కిటికీలు, కూరగాయల తోటల దగ్గర బంతి మొక్కలను పెంచడం వల్ల దోమలే కాకుండా ఇతర కీటకాలు కూడా రాకుండా ఉంటాయి.
పుదీనా:
పుదీనా బలమైన వాసన సహజ కీటక సంహారిణిగా పనిచేస్తుంది. కొన్ని ఆకులను నలిపి చర్మంపై రుద్దడం వల్ల దానిలోని నూనెలు విడుదలై దోమలను తరిమికొడతాయి. అయితే, పుదీనా నేరుగా భూమిలో పెంచితే వేగంగా విస్తరిస్తుంది కాబట్టి, కుండీలలో పెంచడం మంచిది.
లెమన్ బామ్:
పుదీనా కుటుంబానికి చెందిన ఈ మొక్కకు బలమైన నిమ్మ వాసన ఉంటుంది. ఇది దోమలకు నచ్చదు. పుదీనాలాగే ఇది కూడా వేగంగా విస్తరించగలదు. కాబట్టి కుండీలలో పెంచడం మంచిది.
క్యాట్నిప్:
ఈ మొక్క దోమలను తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, దీనిలోని నెపెటాలక్టోన్ అనే రసాయనం డీఈఈటీ (DEET) కంటే కూడా శక్తివంతమైనది.
రోజ్మేరీ:
వంటల్లో ఎక్కువగా ఉపయోగించే ఈ మొక్కకు దోమలను తరిమికొట్టే గుణాలు కూడా ఉన్నాయి. దీని ప్రత్యేకమైన వాసన దోమలు, క్యాబేజీ పురుగులు, క్యారెట్ ఈగలను దూరం చేస్తుంది. రోజ్మేరీ మొక్కలు వేడి, పొడి వాతావరణంలో బాగా పెరుగుతాయి. కుండీలలో కూడా బాగా ఎదుగుతాయి.
సేజ్:
పుదీనా కుటుంబానికి చెందిన సేజ్ మొక్కకు శక్తివంతమైన వాసన ఉంటుంది. ఇది దోమలను దూరం చేస్తుంది. సేజ్ కట్టలను నిప్పులో వేసి కాల్చడం వల్ల వచ్చే పొగ కీటకాలను తరిమికొడుతుంది.
ఈ మొక్కలు ఎలా పనిచేస్తాయి?
దోమలు తమ వాసన ద్వారానే తమ ఆహారాన్ని గుర్తిస్తాయి. ఈ మొక్కలలో ఉండే సుగంధ నూనెలు, రసాయనాలు బలమైన వాసనలకు అవి ఆహారం వాసనలను గుర్తించలేవు. మనం విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్, ఇతర రసాయనాలను దోమలు పసిగట్టకుండా చేస్తాయి. ఈ మొక్కల వాసన దోమలకు చికాకు కలిగించవచ్చు లేదా వాటిని గందరగోళానికి గురిచేసి, ఆ ప్రాంతానికి రాకుండా చేస్తాయి. కాకపోతే, ఈ మొక్కలకు సరైన కేరింగ్ లేకపోతే అక్కడే గడ్డి పెరిగి దోమలు గుడ్లు పెట్టే ప్రదేశాలుగా మారిపోవచ్చు.