





Best Web Hosting Provider In India 2024

ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేట్.. నేడు లబ్దిదారుల ఖాతాలకు నగదు.. జూన్ 2న సామూహిక గృహ ప్రవేశాలు..
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేట్ ఇచ్చింది. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీలైనన్ని ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని భావిస్తోంది. ఈ క్రమంలో నేడు లబ్దిదారుల ఖాతాలకు నగదు జమ చేయనున్నారు.
తెలంగాణలో జూన్ 2వ తేదీన సామూహిక గృహ ప్రవేశాలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతోంది. ఈ క్రమంలో జూన్2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లను అప్పగించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు జూన్ 2న వాటిని అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. జూన్ 2న నిర్మాణం పూర్తైన ఇళ్లను లబ్దిదారులకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. జూన్2 వ తేదీకి మరో వారం రోజులే ఉండటంతో శ్లాబ్ పూర్తై, గోడలు పూర్తి చేసుకుని, ఫ్లోరింగ్, ప్లాస్టింగ్ పూర్తై తుది దశలో ఉన్న గృహాలను ప్రారంభిం చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నారు. మొదటి విడతలో మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం 47,377 మంది లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం అనుమతి పత్రాలు మంజూరు చేశారు.
పథకానికి ఎంపికైన లబ్దిదారుల్లో 23,847 మంది ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారిలో తుది దశకు వచ్చిన ఇళ్లను జూన్ 2 నాటికి పూర్తి చేసేలా చూడాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. కనీసం వెయ్యి ఇళ్లనైనా పూర్తిచేసి లబ్దిదారులకు అందించాలని భావిస్తున్నారు.
ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్ ధర కంటే ఇంటి నిర్మాణ ఖర్చు ఎక్కువగా అవుతుండడం, ప్లంబింగ్, వైరింగ్ వంటి పనులకు మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో సాధ్యమైనన్ని ఎక్కువ ఇళ్లను జూన్ 2వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు ఇంటి నిర్మాణం చివరి దశలో ఉన్న వారికి నిధుల కొరత లేకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంటి నిర్మాణానికి విడతల వారీగా నిదులు మంజూరు చేస్తున్నారు. ఈ క్రమంలో చివరి దశ పనులు జరుగుతున్న ఇంటి లబ్దిదారులకు మిగతా పనులను చేయడానికి సోమవారం రూ.13 కోట్లు విడుదల చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1300 మంది లబ్దిదారుల ఖాతాల్లో ఈ నగదును నేరుగా జమ చేస్తారు.
ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అటవీ శాఖ అడ్డంకులు
ఆటవీ ప్రాంతాల్లో జీవిస్తున్న ఆదివాసీలకు కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇటీవల నాగర్ కర్నూలు జిల్లాలో ఇందిర సౌర జలవికాసం పథకం ప్రారంభోత్సవంలో ఆదివాసీల ఇళ్ల సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ క్రమంలో అటవీ శాఖ నుంచి అనుమతులు వస్తే అటవీ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు.
తెలంగాణలోని 4 ఐటీడీఏల పరిధిలో ఆదివాసీల కోసం 9350 ఇళ్లు, ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఎస్టీలకు 8,750 ఇళ్లు.. మొత్తం 18,100 నిర్మించాలని భావిస్తోంది. మొదటి, రెండు విడతల్లో ప్రకటించిన ఇళ్లకు అదనంగా ఈ గృహాలను మంజూరు చేయాలని నిర్ణయించింది. అటవీ శాఖ అధికారులు ఇళ్ల నిర్మాణానికి ఒప్పుకోవడం లేదని ఆదివాసీలు సీఎంకు ఫిర్యాదు చేయడంతో సమస్య పరిష్కరించాలని ముఖ్యమంత్రి సంబంధిత శాఖల మంత్రుల్ని ఆదేశించడంతో సమస్య కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్