




Best Web Hosting Provider In India 2024

నవ్వులే నవ్వులు.. కడుపుబ్బా నవ్విస్తున్న హౌజ్‌ఫుల్ 5 ట్రైలర్.. ముగ్గురు టాప్ హీరోల ఫన్ రైడ్
హౌజ్‌ఫుల్ 5 మూవీ ట్రైలర్ వచ్చేసింది. నవ్వులు కురిపిస్తున్న ఈ మూవీ ట్రైలర్లో ముగ్గురు బాలీవుడ్ టాప్ హీరోలు అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్ తెగ నవ్వించేశారు. జూన్ 6న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.
హౌజ్‌ఫుల్ 5 ట్రైలర్: బాలీవుడ్ హిట్ ఫ్రాంఛైజీల్లో ఒకటైన హౌజ్‌ఫుల్ నుంచి మరో మూవీ రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ మంగళవారం (మే 27) రిలీజైంది. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా ట్రైలర్ తోనే కడుపుబ్బా నవ్వించింది.
హౌజ్‌ఫుల్ 5 ట్రైలర్
హౌజ్‌ఫుల్ 5 మూవీ జూన్ 6న థియేటర్లో రిలీజ్ కానుండగా.. పది రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ నానా పాటేకర్ వాయిస్ ఓవర్ తో ప్రారంభమవుతుంది. ఓ లగ్జరీ బోటులో ఓ బిలియనీర్ తన 100వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటాడు. ఈ సందర్భంగా తన ఆస్తి మొత్తం తన జాలీకే దక్కుతుందని వీలునామాలో రాస్తాడు. అయితే ఆ జాలీ ఎవరన్నదే ఇక్కడ అసలు గందరగోళం.
తానంటే తానే జాలీనంటూ ముగ్గురు రంగంలోకి దిగుతారు. ఈ ముగ్గురూ మరెవరో కాదు.. మన హీరోలు అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్. వీళ్లలో అసలు జాలీ ఎవరన్న అయోమయం నెలకొంటుంది. మరోవైపు అదే బిలియనీర్ హత్యకు గురవుతాడు. ఇందులో ముగ్గురు అనుమానితులుగా ఉంటారు. ఈ హత్య కేసును ఛేదించడానికి ఇద్దరు పోలీసులు రంగంలోకి దిగుతారు. ఆ పోలీసులు మరెవరో కాదు.. సంజయ్ దత్, జాకీ ష్రాఫ్ కావడం విశేషం. వాళ్ల రాకతో ట్రైలర్ మరింత ఫన్నీగా మారుతుంది.
ఈ హౌజ్‌ఫుల్ 5 మూవీలో ఈ ఐదుగురు బాలీవుడ్ హీరోలతోపాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నర్గిస్ ఫక్రీ, చిత్రాంగదా సింగ్, సోనమ్ బజ్వా, సౌందర్య శర్మ లాంటి వాళ్లు కూడా నటించారు.
ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా..
హౌజ్‌ఫుల్ 5 ట్రైలర్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది. చాలా నవ్వించిందంటూ కొందరు కామెంట్స్ చేశారు. ఈ సినిమాను తరుణ్ మన్సుఖానీ డైరెక్ట్ చేశాడు. సాజిద్ నదియావాలా నిర్మించాడు. హౌజ్‌ఫుల్ 3 తర్వాత మరోసారి అభిషేక్, అక్షయ్, రితేష్ త్రయం ఈ మూవీ కోసం మళ్లీ కలిశారు. అక్షయ్, రితేష్ ఈ ఫ్రాంఛైజీలోని మొదటి సినిమా నుంచీ కొనసాగుతున్నారు. అభిషేక్ మాత్రం మూడు, ఐదు భాగాల్లో నటించాడు. తొలి హౌజ్‌ఫుల్ మూవీ 2010లో రిలీజైంది. ఇక ఈ హౌజ్‌ఫుల్ 5 ఈ ఏడాది జూన్ 6న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.
సంబంధిత కథనం