



Best Web Hosting Provider In India 2024

మీ నోటి పరిశుభ్రతను పట్టించుకోవడం లేదా? అది మీ పొట్ట ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసుకోండి
మీరు నోటిని శుభ్రంగా ఉంచుకోకపోతే పళ్ళు పుచ్చిపోవడం, నోరు దుర్వాసన రావడం తప్ప ఇంకేం కాదనుకుంటే పప్పులో కాలేసినట్లే. దీనివల్ల పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి.
రాత్రిపూట బ్రష్ చేయకపోవడం, ఎప్పుడో మనసు పుట్టినప్పుడు ఫ్లాస్ చేయడం, లేదా సాధారణంగా నోటి శుభ్రతను నిర్లక్ష్యం చేయడం లాంటివి చేస్తుంటే, ఇది మీకు ఒక హెచ్చరిక. దీని పరిణామాలు కేవలం చిన్నపాటి దుర్వాసన లేదా పంటి సమస్యలకే పరిమితం కావు. నిజానికి, ఇది మీ పొట్ట ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తుంది. దానివల్ల మీ మొత్తం ఆరోగ్యం కూడా దెబ్బతినొచ్చు.
ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్లో డెంటల్ సర్జరీ కన్సల్టెంట్ డాక్టర్ భావనా చోరారియా HT లైఫ్‌స్టైల్‌తో మాట్లాడుతూ నోరు, పొట్ట ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధం గురించి వివరించారు. నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల శరీరంలోని ఇతర భాగాలకు సమస్యలు ఎలా వస్తాయో చెప్పి, క్రమం తప్పకుండా బ్రష్ చేయడం, ఫ్లాస్ చేయడం ఎంత ముఖ్యమో ఆమె నొక్కి చెప్పారు.
నోరు, పొట్ట ఆరోగ్యాల మధ్య సంబంధాన్ని వివరిస్తూ, “నోరు, జీర్ణవ్యవస్థ రెండూ దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి. వాటి మధ్య ఉండే సూక్ష్మజీవుల వల్ల ఈ సంబంధం ఏర్పడుతుంది. ఈ రెండు సూక్ష్మజీవుల వ్యవస్థలు వాటి పనితీరులో వేరుగా ఉన్నా, వాటి మధ్య చాలా ముఖ్యమైన సంబంధం ఉందని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. దీని ప్రభావాలు నోరు, కడుపుకు మించి ఉంటాయి.” అని వివరించారు.
నోరు, పొట్ట ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉంది కాబట్టి, నోటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దాంతో పాటు, చక్కెర తినకుండా ఉండటం వంటి మంచి ఆహారపు అలవాట్లు కూడా మంచి దంత ఆరోగ్యానికి అవసరం. ముఖ్యమైన విషయాల గురించి డాక్టర్ చోరారియా చెబుతూ, “నోటిని శుభ్రంగా ఉంచుకోవడం అంటే రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం, క్రమం తప్పకుండా ఫ్లాస్ చేయడం, అప్పుడప్పుడు దంత పరీక్షలకు వెళ్లడం. ఇది కేవలం పళ్ళు పుచ్చిపోకుండా లేదా నోరు తాజాగా ఉండటానికి మాత్రమే కాదు. ఇది పొట్ట ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే, సమతుల్య ఆహారం, రోజూ వ్యాయామం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి పాటించడం వల్ల ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ ఉంటుంది. ఇది జీర్ణ, నోటి ఆరోగ్యం రెండింటికీ సహాయపడుతుంది.” అని వివరించారు.
నోరు పొట్టను, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానమిస్తూ డాక్టర్ చోరారియా ఒక వివరణాత్మక గైడ్‌ను పంచుకున్నారు.
నోరు పొట్ట ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
నోటిలోని సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతింటే, ముఖ్యంగా చిగుళ్ల వ్యాధి వంటి పరిస్థితుల్లో, అది పొట్ట ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది.
- పోర్ఫిరోమోనాస్ జింగివాలిస్, ఫ్యూసోబాక్టీరియం న్యూక్లియాటం వంటి హానికరమైన నోటి బ్యాక్టీరియా (ఇవి సాధారణంగా చిగుళ్ల వ్యాధులతో ముడిపడి ఉంటాయి) కడుపులోని ఆమ్ల వాతావరణాన్ని తట్టుకొని తర్వాత పొట్టలో స్థిరపడగలవు.
- ఒకసారి పొట్టలోకి చేరిన తర్వాత, ఈ బ్యాక్టీరియా పొట్టలోని సహజ సూక్ష్మజీవుల సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీర్ఘకాలిక వాపును పెంచుతుంది. ఇంకా పొట్ట గోడల బలాన్ని తగ్గిస్తుంది.
- ఈ అంతరాయం జీర్ణ సంబంధిత సమస్యలను ప్రేరేపించవచ్చు లేదా తీవ్రతరం చేయవచ్చు, ఇంకా శరీరంలో వాపుకు దారితీస్తుంది. ఇది అనేక దీర్ఘకాలిక వ్యాధులకు మార్గం సుగమం చేస్తుంది.
పొట్ట ఆరోగ్యం సరిగా లేకపోతే పళ్ళు, చిగుళ్ళను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందా?
అవును, ఈ సంబంధం ఇంకో విధంగా కూడా పనిచేస్తుంది.
- ఆరోగ్యకరమైన పొట్ట లేకపోవడం వల్ల నోటిలో రకరకాల ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి, వీటిలో పుండ్లు, పదేపదే వచ్చే అంటువ్యాధులు, చిగుళ్ల వ్యాధికి ఎక్కువ అవకాశం ఉంటాయి.
- యాసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణ సమస్యలు అన్నవాహికను మాత్రమే కాకుండా, పంటి ఎనామెల్‌ను కూడా దెబ్బతీస్తాయి, నోటిలోని సూక్ష్మజీవులను మారుస్తాయి. దీనివల్ల నోటి ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రమవుతాయి.
దంత ఆరోగ్యం మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందా?
అవును, క్లినికల్ అధ్యయనాలు, గణాంకాలు పేలవమైన నోటి ఆరోగ్యం, కొన్ని దీర్ఘకాలిక సమస్యల మధ్య సంబంధాన్ని గుర్తించాయి, అవి:
- గుండె జబ్బులు
- మధుమేహం
- శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు
- మెదడు సంబంధిత వ్యాధులు
- కీళ్ల నొప్పులు
- గర్భధారణలో సమస్యలు
(పాఠకులకు గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. వృత్తిపరమైన వైద్య సలహాకు ఇది ప్రత్యామ్నాయం కాదు. వైద్యపరమైన సమస్యల గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే ఎల్లప్పుడూ మీ డాక్టర్‌ను సంప్రదించండి.)