





Best Web Hosting Provider In India 2024

అనుష్క శెట్టి ఘాటి వచ్చేది ఈ ఓటీటీలోకే.. రికార్డు ధరకు డిజిటల్ హక్కులు అమ్మకం
అనుష్క శెట్టి నటిస్తున్న ఘాటి మూవీ ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా జులై 11న థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే వచ్చిన టీజర్ ఆకట్టుకునేలా సాగింది.
అనుష్క శెట్టి నటిస్తున్న కొత్త మూవీ ‘ఘాటి’ వచ్చే నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే వచ్చిన సినిమా టీజర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రైలర్ త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడయ్యాయని, అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ హక్కులను సొంతం చేసుకుందని వార్తలు వస్తున్నాయి.
ఘాటి వచ్చేది ఈ ఓటీటీలోకే..
అనుష్క శెట్టి ఘాటి మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా రూ.36 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది. సౌత్ ఇండియాలో ఏ వుమెన్ సెంట్రిక్ సినిమాకు గతంలో ఇంత రేటు లభించకపోవడం గమనార్హం.
చాలా కాలంగా పెద్దగా సినిమాలు చేయకపోయినా అనుష్క శెట్టికి ఎలాంటి క్రేజ్ ఉందో ఈ ఘాటికి దక్కిన ఓటీటీ ధర చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఘాటి మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీకి వస్తుందని కూడా ఆ రిపోర్టు తెలిపింది.
ఘాటి మూవీ గురించి..
‘ఘాటి’లో తమిళ నటుడు విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ‘వేదం’, ‘హరి హర వీర మల్లు’ చిత్రాల దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించాడు. ఈ సినిమాను ఏకంగా రూ.45 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించినట్లు మూవీ వర్గాలు వెల్లడించాయి.
అయితే ఇప్పుడు డిజిటల్ హక్కుల ద్వారా రూ.36 కోట్లు తిరిగి రావడంతో బడ్జెట్ లో పెద్ద మొత్తం రికవర్ అయినట్లే. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ రూ.12 కోట్లుగా ఉంది. మూవీకి ఏమాత్రం పాజిటివ్ రివ్యూలు వచ్చినా.. ఈ మొత్తాన్ని సులువుగా వసూలు చేస్తుంది.
‘ఘాటి’లో అనుష్క శెట్టి పాత్ర
చాలా కాలం తర్వాత అనుష్క శెట్టి సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుంది. ఆమె చివరి మూవీ ‘మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి’ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయ్యింది. ఆ చిత్రంలో అనుష్క 40 ఏళ్ల మహిళగా, సరోగసీని ఎంచుకుని పెద్ద సమస్యల్లో చిక్కుకునే బోల్డ్ పాత్రను పోషించింది.
‘ఘాటి’లో ఆమె గ్రామీణ యువతిగా కనిపిస్తోంది. అంతేకాదు ఆమె కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లలో నటించినట్లు తెలుస్తోంది. క్రిష్ ఇప్పటికే ‘వేదం’లో అనుష్కను డైరెక్ట్ చేశాడు. పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు మూవీని కూడా క్రిష్ డైరెక్ట్ చేశాడు. అయితే కొంతభాగం పూర్తయిన తర్వాత అతను తప్పుకున్నాడు. ఆ వెంటనే అనుష్కతో ఘాటి మొదలుపెట్టాడు.
సంబంధిత కథనం