





Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు ప్రేమకు మురిసిపోయిన మీనా – రోహిణి వ్యవహారం తేల్చేసిన ప్రభావతి
గుండె నిండా గుడి గంటలు జూన్ 18 ఎపిసోడ్లో మలేషియా వ్యవహారం ఏదో ఈ రోజు తేలిపోవాలని రోహిణితో అంటుంది ప్రభావతి. మీ నాన్న, మావయ్యలతో ఇప్పుడే ఫోన్లో మాట్లాడాల్సిందేనని పట్టుపడుతుంది. ప్రభావతి మాటలతో రోహిణి వణికిపోతుంది.
మీనా తనకు కొనిచ్చిన కారును కుటుంబసభ్యులకు చూపిస్తాడు బాలు. కారు వెనుక బీఎమ్ అంటూ బాలు, మీనా పేర్లు రాసి ఉండటంపై ప్రభావతి సెటైర్లు వేస్తుంది. అందరూ అమ్మదీవెన అని రాయించుకుంటే బాలు మాత్రం పెళ్లాం పేరు రాయించుకున్నాడని బాలుపై విరుచుకుపడుతుంది. పాత కారు కొని ఏదో విమానం కొన్నట్లు బిల్డప్పులు ఇస్తున్నారని కుళ్లుకుంటుంది.
శాపనార్థాలు తప్ప…
నీ దీవెనలు ఎక్కడున్నాయి శాపనార్థాలు తప్ప అని ప్రభావతిని సత్యం నిలదీస్తాడు. బాలు కారు అమ్మేశాడని తెలిసి నా ఇళ్లు, నా పత్రాలు అని గొడవ చేసి ఇప్పుడు కారు వెనుక నీ పేరు రాయలేదని లా అడుగుతున్నావని సత్యం అంటాడు. పేరు వేయడానికి అర్హత ఉండాలని శృతి అంటుంది. బాలు, మీనాలకు కంగ్రాట్స్ చెబుతారు శృతి, రవి. తాను కారు కొనడం ప్రభావతి ఓర్వలేకపోతుందని బాలు బాధపడతాడు.
బాలు అదృష్టం…
నేను చేయలేని పని నువ్వు చేశావని మీనాతో అంటాడు సత్యం. బాలు కోపాన్నే అందరూ చూస్తారు తప్ప వాడిలోని మంచితనం ఎవరికి కనిపించదని, ఈ ఇంట్లో నేను తప్ప బాలును మనిషిలా చూసిన వాళ్లు లేరని ఆవేదనకు లోనవుతాడు. నాకు ఏదైనా అయితే బాలు ఎలా బతుకుతాడో అనే భయం, బాధ ఉండేవి…నీ వల్ల ఆ రెండు పోయానని, నీ లాంటి భార్య దొరకడం బాలు అదృష్టమని మీనాను పొగడుతాడు.
సంజు ప్రేమ…
సంజు దీవెనలు తీసుకొని ఉపవాసం విడవాలని ఎదురుచూస్తుంటుంది మౌనిక. ఆలస్యంగా ఇంటికొచ్చిన సంజు…మౌనిక కోరినట్లే ఆశీర్వదిస్తాడు. భోజనం చేశావా అని ప్రేమగా మాట్లాడుతాడు. ఆలస్యంగా తింటే నీ ఆరోగ్యం ఏమైపోవాలి అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరకు ఆమెకు తీసుకెళతాడు. మౌనికకు తానే స్వయంగా వడ్డిస్తాడు. ప్లేట్లోని బిర్యానీ చూసి మౌనిక షాకవుతుంది.
నా కోసం ఏమైనా చేస్తాను అన్నావుగా…
నన్ను ప్రేమిస్తున్నానని, ..నా కోసం ఏమైనా చేస్తాను అన్నావుగా అయితే ఈ బిర్యానీ తినమని మౌనికను టార్చర్ పెడతాడు సంజు. మౌనిక బతిమిలాడిన వినకుండా తినాల్సిందేనని పట్టుపడతాడు. నేనే తినిపిస్తానని బిర్యానీ ఆమె నోటిలో పెట్టబోతాడు. సువర్ణ వచ్చి సంజును ఆపుతుంది.
కొడుకుకు క్లాస్ ఇస్తుంది. మౌనిక నాటకాలకు తాను పడిపోనాని, నంగనాచి వేశాలు తన దగ్గర వేయద్దని, తాను నీలకంఠం కొడుకునని బిల్డప్‌లు ఇస్తాడు సంజు. కొడుకు మాటలతో అతడు మారుతాడనే నమ్మకం తనలో కనిపించడం లేదని సువర్ణ అంటుంది. అత్త మాటలతో మౌనిక కన్నీళ్లు పెట్టుకుంటుంది.
రోహిణిపై ఫైర్…
రోహిణి రూమ్‌లోకి సీరియస్‌గా వస్తుంది ప్రభావతి. మళ్లీ తన గురించి ఏం నిజం బయటపడిందోనని రోహిణి కంగారు పడుతుంది. ఈ రోజు మలేషియా వ్యవహారం ఏదో తేలిపోవాలని ప్రభావతి అంటుంది. మీనా ఎంతో పేదింటి నుంచి వచ్చింది. పూలు అమ్ముకొని భర్తకు కారు కొనిచ్చింది. పెళ్లాం అంటే అది. ఏం చదువుకోకుండానే భర్తను పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది.పూలు అమ్మే దానికి మొగుడి మీద ఉన్న ప్రేమ నీకు లేదా అని రోహిణిపై విరుచుకుపడుతుంది.
మనోజ్ చేత బిజినెస్…
మనోజ్‌ను తానుబాగానే చూసుకుంటున్నానని రోహిణి అంటుంది. మనోజ్ ఒక్క ఉద్యోగంలో కుదురుగా ఉండటం లేదని, నెల రోజుల్లోనే ఉద్యోగాలు మానేస్తే నేనేం చేయగలను అని రోహిణి అంటుంది. మనోజ్ ఖాళీగా ఉండటం చూసి కూడా మీ నాన్నకు చెప్పి ఓ బిజినెస్ ఎందుకు పెట్టించలేకపోతున్నావని నిలదీస్తుంది. ఇప్పుడే మీ నాన్నతో నేను మాట్లాడుతానని, ఫోన్ చేయమని రోహిణితో అంటుంది ప్రభావతి. నాన్న ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదని రోహిణి అంటుంది.
కాపురం గురించి ఆలోచించుకో…
రోహిణి మాటలు నమ్మదు ప్రభావతి. మీ నాన్న దొరక్కపోతే మీ మావయ్యతో మాట్లాడుతానని పట్టుపడుతుంది ప్రభావతి. మావయ్య మీటింగ్‌లో ఉండి ఉంటాడని రోహిణి అంటుంది. ఈ రోజు ఎలాగైనా వారిని ఫోన్లో పట్టుకొని మాట్లాడుతానని ప్రభావతికి నచ్చచెబుతుంది రోహిణి.
నా కొడుకు భవిష్యత్తు తో పాటు నీ కాపురం గురించి ఆలోచించి మీ నాన్నతో మాట్లాడమని రోహిణికి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది ప్రభావతి. అబద్ధాలు మొత్తం తన మెడకు చుట్టూ మునిగిపోవడంతో రోహిణి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
మీనా సర్ప్రైజ్…
బాలు కారును కడుతుంటాడు. ఎక్కువగా కడిగితే సబ్బులా అరిగిపోతుందని మీనా సెటైర్లు వేస్తుంది. ఇది మా ఆవిడ కొనిచ్చిన కారు మీనాను పొగడ్తల్లో ముంచుతాడు బాలు. నాతోనే కారు సెలెక్ట్ చేసి పూజ అయ్యే వరకు తెలియకుండా నన్ను సర్ప్రైజ్ చేసింది అని బాలు అంటాడు.
మా ఆయన కూడా నాకు చెప్పకుండా పూల కొట్టు పెట్టించాడని మీనా బదులిస్తుంది. ఒకరిపై మరొకరు పొగడ్తలు కురిపించుకుంటారు. బాలును భోజనానికి పిలుస్తుంది మీనా. ఈ రోజు నీతో గోరు ముద్దలు తినాలని ఉందని బాలు అంటాడు.
ఓర్పు ఉంటే…
తనకు మీనా కారు కొనిచ్చిన విషయం మౌనికకు ఫోన్ చేసి చెబుతాడు బాలు. నేను ఎన్ని మాటలు అన్నా..వాళ్ల తమ్ముడిని కొట్టిన నన్ను పరాయి వాడిలా చూడలేదని తనను మీనా వదిలిపెట్టి పోలేదని మౌనికతో అంటాడు బాలు. ఓర్పు ఉంటే ఎలాంటివాళ్లు అయినా మారుతారని చెబుతాడు. బాలు మాటలను మీనా వింటుంది. భర్తపై తనకున్న ప్రేమ చూసి ఎమోషనల్ అవుతుంది. నా కష్టాన్ని, ఓర్పును ఇంతలా అర్థం చేసుకున్నారని ఇన్నాళ్లు తెలుసుకోలేకపోయానని భర్త గుండెలపై వాలిపోతుంది.
బంగారం లాంటి మొగుడు…
బంగారం లాంటి మొగుడు దొరికాడు…వేరే బంగారం ఎందుకు అని మీనా అంటుంది.శృతి, రోహిణిలకు తాళిబొట్టు ఫంక్షన్ చేస్తానని ప్రభావతితో అంటుంది. బాలును అడ్డుపెట్టుకొని ఈ ఫంక్షన్లో గొడవ చేసి సత్యం ఫ్యామిలీని ముక్కలు చేయాలని ప్లాన్ చేస్తారు శోభన, సురేంద్ర. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం