ప్రైవేటు విప్లవాలు: చైనా గురించి యువాన్ యాంగ్ కొత్త పుస్తకంలోని ఓ భాగం

Best Web Hosting Provider In India 2024

ప్రైవేటు విప్లవాలు: చైనా గురించి యువాన్ యాంగ్ కొత్త పుస్తకంలోని ఓ భాగం

HT Telugu Desk HT Telugu

చైనీస్ మూలాలున్న బ్రిటీష్ ఎంపీ రాసిన ప్రయివేట్ రివల్యూషన్స్ అనే ఈ పుస్తకం నలుగురు చైనీస్ మహిళల కథల్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. మారుతున్న ఆర్థిక వ్యవస్థలో వాళ్ళ బతుకుపోరాటం ఎలా సాగిందో తెలుసుకుందాం.

ప్రైవేట్ రివల్యూషన్స్ బుక్

చైనీస్ మూలాలున్న బ్రిటీష్ ఎంపీ రాసిన ఈ పుస్తకం, తెర వెనుక దాగివున్న నలుగురు చైనీస్ మహిళల కథల్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. మారుతున్న ఆర్థిక వ్యవస్థలో వాళ్ళ బతుకుపోరాటం ఎలా సాగిందో తెలుసుకుందాం.

జూన్‌ అనే యువతికి వారంలో దొరికే కాస్తంత తీరిక సమయం ఆదివారం మధ్యాహ్నాలు. ఆ సమయంలో ఆమె బట్టలు చేతులతో ఉతుకుతూ, ఈ పనికి తనెంత సమయాన్ని వృథా చేస్తున్నానో అని లోలోపల ఉడుక్కునేది. ఆ బోర్ కొట్టే పనినించి తప్పించుకోవడానికి స్మార్ట్‌ఫోన్‌లో పాడ్‌కాస్ట్‌లు వినేది. ముఖ్యంగా, చైనాలో పెద్ద ప్రైవేటు విద్యా సంస్థ ‘న్యూ ఓరియంటల్’ వ్యవస్థాపకుడు యు మిన్‌హోంగ్ ప్రసంగాలు ఆమెకు బాగా నచ్చేవి.

2013 ప్రాంతంలో జూన్ హైస్కూల్లో చేరినప్పుడు యు జీవితం ఆధారంగా ‘అమెరికన్ డ్రీమ్స్ ఇన్ చైనా’ అనే ఓ సినిమా విడుదలైంది. నవ్వులు పూయించే హాస్యంతో సాగే ఈ కథ, పేద కుటుంబాల నుండి వచ్చిన ముగ్గురు యువకులు అమెరికాలో చదువుకోవాలని ఎలా కలలు కన్నారో చెబుతుంది. యు పాత్రకు పదేపదే వీసా దొరకదు. కానీ చివరికి ఆ ముగ్గురూ కలిసి ఓ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్‌ను పెట్టి కోటీశ్వరులవుతారు.

ఈ సినిమాలో యు ప్రసంగాలకు సంబంధించిన చాలా అద్భుతమైన షాట్లుంటాయి. వాటి వెనుక ఉత్సాహంగా కేరింతలు కొట్టే అభిమానులతో నిండిన స్టేడియం కనిపిస్తుంది. అతను నిజంగా ఓ రాక్‌స్టార్‌లా, ఎంతగానో ఆత్మవిశ్వాసంతో, అనర్గళంగా మాట్లాడేవాడు. సినిమా విడుదలయ్యే సమయానికే యు కోటీశ్వరుడై, చైనాలో ఇంగ్లీష్ బోధనకు గురువుగా పేరుపొందాడు.

యు చాలా చమత్కారంగా, తనను తాను తక్కువ చేసుకుంటూ మాట్లాడేవాడు. వ్యక్తిగత కథలను, స్ఫూర్తినిచ్చే మాటలను కలిపి చెప్పేవాడు. “నిరాశ అనే పర్వతం నుండి ఆశ అనే రాయిని చెక్కండి. అప్పుడు మీ జీవితం అద్భుతంగా వెలిగిపోతుంది. మొదట్లో ప్రపంచంలో రోడ్లు లేవు కదా? మనుషులు ప్రయాణించడం మొదలుపెట్టాకే దారులు ఏర్పడ్డాయి. ప్రజలు అడ్డదిడ్డంగా తిరిగినప్పుడు కాదు.. ఒకే దారిలో సాగినప్పుడే సరైన మార్గాలు ఏర్పడతాయి. ‘న్యూ ఓరియంటల్’ విషయంలోనూ అంతే. ప్రజలు చదువుకోవడానికి ఒకచోట చేరాకనే ఇది రూపుదిద్దుకుంది.” అని ప్రసంగించేవాడు.

జూన్ ఉన్నత చదువుల కలలు

జూన్ తన తరగతిలో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండేది. కానీ ఆమె చదువుతున్న తరగతి అంత గొప్పదేమీ కాదని ఆమెకు తెలుసు. హైస్కూల్ మూడేళ్లు గడిచేకొద్దీ, యూనివర్సిటీ ప్రవేశం దగ్గర పడింది. అది కేవలం ఓ కల కాదు.. తప్పనిసరిగా జరగాల్సిన విషయంలా మారింది. ఎక్కడ చేరుతుందనేదే ఆమెకు తెలియని విషయం.

చైనాలో దాదాపు 1,400 డిగ్రీ కళాశాలలున్నాయి. వీటిలో సుమారు వంద ‘ప్రాజెక్ట్ 211’ అనే పేరున్న, శ్రేష్ఠమైన విశ్వవిద్యాలయాల గుంపుకు చెందినవి. ఇక్కడ ప్రతి సంవత్సరం 5 లక్షల మంది లోపే విద్యార్థులు చేరుతారు.

చైనాలోని టాప్ యూనివర్సిటీల్లో సీటు సాధించడానికి పోటీ ప్రపంచంలో ఎక్కడా లేనంత ఎక్కువ. ‘211’ గ్రూప్ యూనివర్సిటీలు దరఖాస్తు చేసుకున్న ప్రతి వంద మంది విద్యార్థులలో ఐదుగురిని మాత్రమే తీసుకుంటాయి. ఇది హార్వర్డ్ విశ్వవిద్యాలయం రేటుతో సమానం. బీజింగ్‌లోని పీకింగ్ యూనివర్సిటీ వంద మంది అప్లై చేసుకుంటే ఒకరిని మాత్రమే ఎంచుకుంటుంది.

స్థానిక కోటా వల్ల కలిగే లాభం

బీజింగ్ ‘హుకావ్’ (స్థానిక నివాస గుర్తింపు) ఉన్న కుటుంబం నుండి రావడం చాలా ఉపయోగపడుతుంది. యూనివర్సిటీలకు స్థానిక విద్యార్థుల కోసం ఒక కోటా ఉంటుంది. ఒక ఏడాదిలో బీజింగ్‌లోని 2 టాప్ యూనివర్సిటీలు బీజింగ్ నుండి దరఖాస్తు చేసుకున్న ప్రతి 10,000 మందిలో 84 మందిని తీసుకున్నాయి. కానీ జూన్ ప్రావిన్సుతో సహా చైనాలోని కొన్ని పేద ప్రాంతాల నుండి దరఖాస్తు చేసుకున్న ప్రతి 10,000 మందిలో 5 మంది కన్నా తక్కువ మందిని మాత్రమే తీసుకున్నాయి. జూన్ తన మొదటి ఐదు ఎంపికల కోసం పెద్ద లక్ష్యాలను పెట్టుకుంది. ఆరో ఎంపికగా, ఆమె కచ్చితంగా సీటు వస్తుందని నమ్మకమున్న ఒక స్థానిక యూనివర్సిటీని ఎంచుకుంది.

గురువు అప్యాయత

హైస్కూల్ చివరి రోజుల్లో టీచర్ సాంగ్ జూన్ చదువుతున్న పట్టణానికి వచ్చారు. జూన్ తరగతులు, సాయంత్రం స్టడీ సెషన్ మధ్య దొరికిన ఖాళీ సమయాన్ని వాడుకుంటూ టీచర్ సాంగ్ జూన్‌ను కొత్తగా తెరిచిన వెస్ట్రన్ రెస్టారెంట్‌కు డిన్నర్‌కు తీసుకెళ్లారు. వెస్ట్రన్ ఫుడ్ తినడం జూన్‌కు ఓ లగ్జరీగా అనిపించింది. అంతకుముందు వారం ఆమె కేవలం వీధి బండ్ల దగ్గర మాత్రమే తిన్నది.

రెస్టారెంట్‌లో తిన్న తర్వాత వెళ్ళడానికి లేవగానే జూన్ టీచర్ సాంగ్‌ను గట్టిగా పట్టుకొని ఏడ్చింది. స్కూలు పూర్తయ్యాక మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటారో ఆమెకు తెలియదు కదా. యూనివర్సిటీకి వెళ్ళినా లేదా పనికి వెళ్ళినా, ఆమె తన సొంత ఊరిని వదిలి చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది.

“నువ్వు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను” అని టీచర్ సాంగ్ ఆశీర్వదించారు.

(యువాన్ యాంగ్ రచించిన ‘ప్రైవేట్ విప్లవాలు: కమింగ్ ఆఫ్ ఏజ్ ఇన్ ఏ న్యూ చైనా’ పుస్తకం నుండి అనుమతితో సేకరించిన భాగం, బ్లూమ్స్‌బరీ ప్రచురణ; 2024)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.
Source / Credits

Best Web Hosting Provider In India 2024