


Best Web Hosting Provider In India 2024

నిద్రపోవడానికి 3 గంటల ముందే భోజనం ఎందుకు చేయాలి? కార్డియాలజిస్ట్ కీలక సలహా
నిద్రపోవడానికి కనీసం మూడు గంటల ముందు భోజనం ముగించాలని కార్డియాలజిస్ట్ చెబుతున్నారు. అలా ఎందుకు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
చాలామందికి రాత్రి 9-10 గంటలకు లేదా ఇంకా ఆలస్యంగా భోజనం చేసి, వెంటనే నిద్రపోవడం అలవాటు. కానీ ఇది మంచిది కాదని కార్డియాలజిస్ట్ డాక్టర్ అలోక్ చోప్రా చెబుతున్నారు. నిద్రపోవడానికి కనీసం మూడు గంటల ముందు భోజనం ముగించడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. పూర్తి విశ్రాంతి తీసుకుంటుంది. ఇతర శరీర పనులు సక్రమంగా జరుగుతాయి. దీనికి శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి అంటున్నారు ఆయన.
నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందు భోజనం చేయండి
మీరు గమనించే ఉంటారు. మన తాతయ్యలు, నాయనమ్మలు సాయంత్రం 6-7 గంటల లోపే రాత్రి భోజనం ముగించేవాళ్లు. ఆ తర్వాత ఏమీ తినేవాళ్లు కాదు. నిజానికి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటించేవాళ్లు కూడా ఒక నిర్దిష్ట సమయం తర్వాత తినడం మానేస్తారు. ఈ అలవాటు వెనుక చాలా పెద్ద ఆరోగ్య రహస్యమే ఉంది.
మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటించినా, పాటించకపోయినా, నిద్రపోవడానికి కనీసం మూడు గంటల ముందు భోజనం చేయడం చాలా ముఖ్యం అని డాక్టర్ చోప్రా వివరించారు. “నిద్ర అంటే శరీరం తనకు తానుగా మరమ్మత్తు చేసుకోవడానికి, తిరిగి శక్తి పొందడానికి, నూతన శక్తితో నిండటానికి ఇచ్చే సమయం. మీ జీర్ణవ్యవస్థను ఓవర్‌టైమ్ పని చేయించడానికి కాదు. అందువల్ల నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందు భోజనం చేయండి.” అని సూచించారు.
“చాలామంది తమ చివరి భోజనం చేసి నేరుగా నిద్రపోతున్నారు. ఆ అలవాటును వెంటనే మానేయాలి” అని డాక్టర్ అలోక్ హెచ్చరించారు. ‘నిద్రపోవడానికి మూడు గంటల ముందు తిండి ఆపడం చాలా ముఖ్యం. ఎందుకంటే నిద్రకు చాలా తక్కువ శక్తి, ఇంధనం అవసరం. నిద్ర సమయంలో మన శరీరం డిటాక్స్ (విషాలను బయటకు పంపడం), మరమ్మత్తు, విశ్రాంతి, పునరుజ్జీవనం వంటి పనులను చేస్తుంది. నిద్రపోవడానికి కొద్దిసేపటి ముందు భోజనం చేస్తే, శరీరం ఈ ప్రయోజనకరమైన పనులను వదిలేసి, జీర్ణక్రియలో నిమగ్నమవుతుంది. అప్పుడు కీటోన్స్ ఖర్చైపోతాయి. గ్లైకోజెన్ నిల్వలు తగ్గిపోతాయి.” అని వివరించారు.
మీరు నిద్రపోయే సమయానికి, చివరి భోజనానికి మధ్య కనీసం 3 గంటల సమయం ఉండాలని డాక్టర్ అలోక్ సలహా ఇచ్చారు. “మూడు గంటలు సరిపోతుంది. కానీ నిద్రపోవడానికి నాలుగు నుండి ఆరు గంటల ముందు తినడం ఇంకా మంచిది.” అని వివరించారు.
(పాఠకులకు గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసమే, ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా వైద్య సమస్య గురించి ఏవైనా సందేహాలు ఉంటే మీ డాక్టర్‌ను తప్పకుండా సంప్రదించండి.)