




Best Web Hosting Provider In India 2024

టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ – ఆపై బీజేపీ..! ‘రాజాసింగ్’ రాజకీయ ప్రస్థానం తెలుసా
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నూతన అధ్యక్షుడి ఎంపిక వేళ… ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. ఈ మేరకు కిషన్ రెడ్డికి లేఖను రాశారు. టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రాజాసింగ్… ఆ తర్వాత బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
అసలు పేరు ఠాకూర్ రాజాసింగ్ లోథ్ …. సాధారణంగా ‘రాజాసింగ్’ అంటారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఓ వార్నింగ్ ఇస్తే పెద్ద రచ్చ జరగాల్సిందే..! గోరక్ష పేరుతో స్వయంగా అతనే రంగంలోకి దిగుతుంటారు..! హిందూ ధర్మ రక్షణే తన ధ్యేయం అంటూ దూకుడుగా ముందుకెళ్తుంటారు. కట్ చేస్తే తాజాగా సొంత పార్టీ నాయకత్వంపైనే గళాన్ని విప్పారు. అధ్యక్ష పదవికి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఏకంగా బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖను విడుదల చేశారు. దీంతో రాజాసింగ్ వ్యవహారం మరో హాట్ టాపిక్ గా మారింది.
రాజాసింగ్ రాజకీయ ప్రస్థానం – ముఖ్య వివరాలు
హిందూ ధర్మ రక్షణే ధ్యేయంగా పని చేసే రాజాసింగ్… రాజకీయ ప్రవేశం కూడా ఆసక్తికరంగానే ఉంది. గో సంరక్షణ, హిందూ వాహిని సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన… శ్రీరామనవమి, హనుమాన్ శోభాయాత్రల నిర్వహణతో వెలుగులోకి వచ్చారు.
- రాజాసింగ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది మాత్రం తెలుగుదేశం పార్టీ(TDP)తో కావటం ఆసక్తికరం.
- గతంలో టీడీపీ(తెలుగుదేశం) అభ్యర్థిగా మంగళహాట్ నుంచి పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచారు.
- ఆ తర్వాత భారతీయ జనాతా పార్టీలో చేరారు. 2014, 2018లో మంగళ్‌హాట్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
- 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. దీంతో తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిగానూ పని చేశారు.
- ఇక 2023 ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి మరోసారి గోషామహల్ నుంచే పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోనూ ఆయన 21,457 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
- 2023లో విజయం సాధించటంతో గోషామహల్ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలిచినట్లు అయింది.
- 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గోషామహల్ ఏర్పాటైంది. తొలిసారిగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ముఖేశ్ గౌడ్ గెలిచారు. ఆ తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ రాజాసింగ్ విజయం సాధించారు.
ఎన్నో వివాదాలు…
2015లో ఓ పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేశారు రాజాసింగ్. అర్ధరాత్రి డీజే నిర్వహణను పోలీసులు ఆపివేసిన క్రమంలో ఈ ఘటన జరిగింది. దీనిపై రాజాసింగ్ పై కేసు నమోదైంది. ఇక 2015లో మరో వివాదానికి తెరలేపారు రాజాసింగ్. ఓయూలో బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. దీనికి వ్యతిరేకంగా పిగ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తామంటూ ప్రకటన ఇవ్వటం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది.
గతంలో మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయగా… ఆయన చుట్టు పెద్ద రాజకీయ దుమారమే చెలరేగింది. ఆయనపై తెలంగాణలోని పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. రాజాసింగ్ వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణించిన బీజేపీ అధిష్టానం.. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత మళ్లీ ఆయన్ను పార్టీలోకి తీసుకుంది. దీంతో ఆయన 2023లోనూ బీజేపీ సింబల్ పైనే పోటీ చేశారు.
టాపిక్