




Best Web Hosting Provider In India 2024

ఏపీ లిక్కర్ కేసు : ‘ఆధారాలు ఉంటే చూపించండి.. నోటి మాటలతో కేసు నడుపుతారా..?’ ఎంపీ మిథున్ రెడ్డి
ఇవాళ మరోసారి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. లిక్కర్ కేసులో తన పాత్ర పై ఆధారాలు ఉంటే చూపించాలన్నారు.
ఏపీలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు కానీ ఎలాంటి సీజర్లు లేవన్నారు. ఈ కేసులో సాక్ష్యాలు కూా లేవన్న ఆయన… ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
ఆధారాలు ఉంటే చూపండి – మిథున్ రెడ్డి
“ఈ అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటా. ఈ కేసుల నుంచి బయటపడతాను. నా పాత్ర పై ఆధారాలు ఉంటే చూపించండి. నా ఫోన్ లు మీకు ఇస్తా. దర్యాప్తుకు సహకరిస్తా. సిట్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. రాజకీయ ఒత్తిడితోనే నాపై కేసు పెట్టారు ముందుగానే ఒక వ్యక్తిని జైల్లో వేయాలని నిర్ణయించుకుని. ఆ తర్వాత దాని చుట్టూ కథ అల్లుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వారిని నయానో… భయానో ఒప్పించి స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు. ఈ కేసులో ఎలాంటి సీజర్లు లేవు, సాక్ష్యాలు లేవు. నోటి మాటలతో ఇచ్చిన స్టేట్మెంట్లు ఇప్పించి కేసు నడుపుతున్నారు” అని మిథున్ రెడ్డి చెప్పారు.
“ముఖ్యమైన నాయకులను జైల్లో పెట్టడమే టార్గెట్ గా కేసులు పెడుతున్నారు. మద్యం కేసు వారి టార్గెట్ కాదు. తమకు నచ్చని వారిని వేధించేందుకు రకరకాల కథలు అల్లుతున్నారు..ఇదేమి కొత్తది కాదు. 2014-19 లోను నాపై తప్పుడు కేసులు పెట్టారు. నేనేదో దాడి చేశానని నాడు టీడీపీ హయాంలో కేసు పెట్టారు.నేను తప్పు చేయలేదని ఎంత చెప్పినా వినకుండా జైల్లో పెట్టారు. అప్పుడు తప్పుడు సాక్షాలు చెప్పిన వారంతా మళ్లీ కోర్టుకు వచ్చి అదంతా తప్పుడు సాక్ష్యం అని చెప్పారు దాంతో కోర్టు ఆ కేసును కొట్టివేసింది. మళ్లీ అదే తరహాలో ఇప్పుడు అరెస్టు చేస్తున్నారు. వీటన్నిటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను” అని స్పష్టం చేశారు.
“మాస్టర్ మైండ్ అని కట్టుకథలు అల్లుతున్నారు. గతంలో కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి, కసిరెడ్డి మాస్టర్ మైండ్ అన్నారు. ఇప్పుడు నన్ను మాస్టర్ మైండ్ అంటున్నారు.. రేపు ఇంకొకరిని పట్టుకొచ్చి అతన్ని మాస్టర్ మైండ్ అంటారు. ఏదో రకంగా మాపై బురద జల్లాలని చూస్తున్నారు. కొద్దిమంది అధికారులను తీసుకొచ్చి భయపెట్టి ఒప్పుకోకపోతే జైల్లో పెడతామని స్టేట్మెంట్లు తీసుకున్నారు. మేము ఎక్కడ కలిశామో ఆధారాలు చూపండి. నోటి మాటతో కేసు పెడతారా?” అని మిథున్ రెడ్డి ప్రశ్నించారు.
“మద్యం కేసులో మొదట్లో 50 వేల కోట్లు అన్నారు, ఆ తర్వాత 30,000 కోట్లు, ఆ తర్వాత 3,000 కోట్లు అని అంటున్నారు. 3,000 కోట్లు ఎక్కడ అంటే ఎలక్షన్లో ఖర్చు పెట్టారని చెబుతున్నారు. సిట్ చెప్పే కట్టు కథలు నమ్మదగినవి కాదు..ఎక్కడైనా డబ్బును సీజ్ చేశారా ? పెట్టుబడులు పెట్టారా? ఇవన్నీ లేకుండా కేవలం నోటి మాటతో కథలు చెబుతున్నారు. ఏదేదో బయట పెడతామని ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. అరెస్టు చేసి ఇబ్బంది పెట్టాలని లక్ష్యంతోనే ఈ కేసులు పెట్టారు ఈ కేసు ముందుకు వెళ్లే పరిస్థితి లేదు” అని మిథున్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఇవాళ సిట్ ముందుకు మిథన్ రెడ్డి:
ఏపీ లిక్కర్ కేసులో ఏ4 గా మిథున్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే ఓసారి సిట్ విచారణకు హాజరైన ఆయన… ఇవాళ కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి బయల్దేరిన ఆయన…. విజయవాడలోని సిట్ కార్యాలయానికి చేరుకుంటారు.
విచారణ తరువాత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విచారణ తర్వాత… ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఉత్కంఠంగా మారింది.
టాపిక్