డేటింగ్‌కి కొత్త దారి: పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్లతో పార్ట్‌నర్లను వెతుకుతున్న న్యూయార్క్ యువత

Best Web Hosting Provider In India 2024

డేటింగ్‌కి కొత్త దారి: పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్లతో పార్ట్‌నర్లను వెతుకుతున్న న్యూయార్క్ యువత

HT Telugu Desk HT Telugu

సింగిల్స్ ప్రేమ కోసం ఒక అసాధారణ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. డిజిటల్ ప్రపంచాన్ని పక్కనపెట్టి, మరింత సహజమైన, ప్రొఫెషనల్ పద్ధతిని ఆశ్రయిస్తున్నారు.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా పార్ట్‌నర్ల వెతుకులాట (Shutterstock)

ఈ రోజుల్లో డేటింగ్ యాప్‌ల గురించి చెప్పాలంటే… అవి ఒక పెద్ద చిక్కుముడిలా తయారయ్యాయి. ఒకవైపు మిక్స్‌డ్ సిగ్నల్స్, మరోవైపు పొరపాటున చేసే స్వైప్‌లు, ఘోస్టింగ్ (మాట్లాడుతూనే మాయమైపోవడం), ఇక అంతులేని చాటింగ్‌లు.. ఇవన్నీ సింగిల్స్‌కి తలనొప్పిగా మారాయి. అందుకేనేమో, న్యూయార్క్ యువత ప్రేమను వెతుక్కోవడానికి సరికొత్త, కాస్త ప్రొఫెషనల్ దారిని ఎంచుకున్నారు. డిజిటల్ ప్రపంచాన్ని పక్కనపెట్టి, మరింత సహజమైన పద్ధతిలో తమ భాగస్వామిని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.

న్యూయార్క్ పోస్ట్ జూలై 22న ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, న్యూయార్క్‌లో ‘పిచ్ అండ్ పెయిర్’ (Pitch and Pair) అనే ఓ సరికొత్త మ్యాచ్ మేకింగ్ ఈవెంట్ బాగా పాపులర్ అవుతోంది. ఇందులో స్నేహితులు తమ ఒంటరి స్నేహితులకు ప్రేమను వెతుక్కోవడంలో సహాయం చేస్తున్నారు. ఈ ఈవెంట్ నెలకు రెండుసార్లు న్యూయార్క్ నగరంలోని రకరకాల చోట్ల జరుగుతుంది.

ఈవెంట్ ఎలా జరుగుతుంది?

స్టేజ్‌పై తమ స్నేహితుడి గురించి పిచ్ చేయాలనుకునేవాళ్ళు $40 నుండి $60 వరకు చెల్లించాలి. ప్రేక్షకులుగా వెళ్లి ఈ ప్రెజెంటేషన్లు చూడాలనుకునేవాళ్ళు $15 నుండి $25 చెల్లించి టికెట్ కొనుక్కోవచ్చు. ఈ ఈవెంట్‌లో, తమ ఒంటరి స్నేహితుల బలాలు, అలాగే డేటింగ్‌కి వాళ్లకున్న విచిత్రమైన, ఆకర్షణీయమైన ‘సెల్లింగ్ పాయింట్ల’ గురించి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. దీనివల్ల వాళ్లకు సరిపోయే వ్యక్తులు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది.

ఇక్కడ ‘మన్మథుడు’ డేటింగ్ యాప్‌లలో ఎడమ, కుడి స్వైప్‌లంటూ హడావిడి పడట్లేదు. బదులుగా, ఒక బ్లేజర్ వేసుకుని, లైవ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఒక పక్కా క్లయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినట్టుగా ప్రశాంతంగా, పద్ధతిగా పని చేస్తున్నాడు.

ఈ సరికొత్త ట్రెండ్ వెనుక కారణం ఏంటి?

ఈ ఈవెంట్ వ్యవస్థాపకుడు జో టెబ్లమ్ దీని వెనుక ఉన్న కారణాన్ని వివరించారు. డేటింగ్ యాప్‌ల వేగం వల్ల, నిజంగా మంచి స్వభావం కలిగిన, కానీ కొంచెం నిశ్శబ్దంగా, రిజర్వ్‌గా ఉండే వ్యక్తులు తరచుగా పక్కకు వెళ్ళిపోతుంటారని ఆయన అన్నారు.

“నాకు చాలా మంది బిడియంగా ఉండే సింగిల్స్ స్నేహితులుగా ఉన్నారు. వాళ్ళు నిజంగా చాలా మంచివాళ్లు. కానీ వాళ్ళు అంతర్ముఖులు కావడం వల్ల సాధారణ డేటింగ్ యాప్‌లలో లేదా స్పీడ్ డేటింగ్‌లో అంతగా రాణించలేరు” అని జో చెప్పారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఒంటరిగా ఉన్న తర్వాత, సింగిల్స్ డేటింగ్ యాప్‌ల కంటే నేరుగా మనుషులను కలవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని ఆయన అన్నారు. “కోవిడ్ తర్వాత ప్రజలు వ్యక్తిగతంగా కలవాలని కోరుకుంటున్న ఒక ట్రెండ్‌ను నేను గమనించాను” అని ఆయన వివరించారు.

పిచ్‌లు ఎలా ఉంటాయి?

ప్రెజెంటేషన్ స్లైడ్‌లలో వీడియో మాంటేజ్‌లు, బుల్లెట్ పాయింట్లు, గ్రాఫ్‌లు వంటివి ఉంటాయి. ఈ సమాచారం కొంచెం విచిత్రంగా, లైవ్ ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. సాధారణంగా ఈ డెక్‌లలో వ్యక్తిత్వం, అభిరుచులు, డేటింగ్ విధానం, చివరికి కొన్ని సరదా లోపాలు కూడా ఉంటాయి. రిపోర్టులో కొన్ని డెక్‌ల నుండి ఉటంకించిన వ్యాఖ్యలు చాలా చమత్కారంగా, హాస్యభరితంగా ఉన్నాయి. అవి ఇక్కడ చదవొచ్చు.

“అతను మీకు నిద్ర పట్టకుండా విషయాలను వివరించగలడు.”

“అతడిది పదునైన మనస్సు, పదునైన సూట్, జీరో ఈగో.”

“అతను మీకు ఆరోగ్యకరమైన ఆహారం వండిపెడతాడు, అయితే నేను అతన్ని ఒకేసారి $50 విలువైన టాకో బెల్ తినడం చూశాను. కాబట్టి అతను చాలా ఆరోగ్యంగా ఉంటాడని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” వంటి వ్యాఖ్యలు డెక్ నుంచి వినిపించినట్టు రిపోర్ట్ ప్రస్తావించింది.

డేటింగ్ యాప్‌లకు బదులు అధునాతన ట్రెండ్
డేటింగ్ యాప్‌లకు బదులు అధునాతన ట్రెండ్ (Shutterstock)

ప్రెజెంటేషన్ల తర్వాత, పిచ్ చేసిన వ్యక్తి ప్రేక్షకుల ముందు ఆ సింగిల్ ఫ్రెండ్ సోషల్ మీడియా వివరాలను చెబుతారు. ఆసక్తి ఉన్న ప్రేక్షకులు వెంటనే వారిని ఫాలో అవుతారు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.
Source / Credits

Best Web Hosting Provider In India 2024