అందుకే బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ.. యూరియా కొరతపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు!

Best Web Hosting Provider In India 2024

అందుకే బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ.. యూరియా కొరతపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు!

Anand Sai HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Anand Sai HT Telugu

ఆంధ్రప్రదేశ్‌లో ఎరువుల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైసీపీ అధినేత పలు ప్రశ్నలు సంధించారు. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు ఎరువుల కష్టాలేనని ఆరోపిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు

ఎరువుల కష్టాలపై చంద్రబాబును వైఎస్ జగన్ ప్రశ్నించారు. మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కానీ రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? అని ప్రశ్నించారు. మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలేనని, బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? అని అడిగారు. మరోవైపు తాజాగా ఉల్లి, చీనీ, మినుము ధరలు కూడా పతనమై రైతులు లబోదిబో మంటున్నారన్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీసం చలనం లేదు చంద్రబాబుగారూ? అని ప్రశ్నించారు.

‘ఏటా ఏ సీజన్‌లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి, ఎరువులు ఎంత పంపిణీ చేయాలన్నదానిపై ప్రతిఏటా ప్రభుత్వంలో జరిగే కసరత్తే కదా. మరి యూరియా సమస్య ఎందుకు వచ్చింది? ఐదేళ్ల మా పాలనలో ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదన్నది వాస్తవం కాదా? ఇవాళ మీరు వైఫల్యం చెందారంటే ప్రభుత్వం అనేది సరిగ్గా పనిచేయడంలేదనే కదా అర్థం. ప్రభుత్వం నుంచి కిందకు వెళ్లిన ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులు నల్లబజారుకు తరలించి, వాటిని బ్లాక్‌ చేసి బస్తా యూరియా రేటు రూ.267లు అయితే, దీనికి మరో రూ.200లు అధికంగా అమ్ముకుంటున్నారు.’ అని జగన్ ఆరోపించారు.

అక్రమ నిల్వలపై తనిఖీల్లేవని, ఎవ్వరిమీదా చర్యల్లేవని పేర్కొన్నారు. PACSలకు, RBKలకు సరైన కేటాయింపులు లేవు. దీనికి కారకులు మీరేకదా చంద్రబాబు అని అడిగారు. తమ హయాంలో ఆర్బీకేల ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులను రైతుల వద్దకే సప్లైచేశామన్నారు. PACSల ద్వారా మార్కెట్‌ రేటు కన్నా రూ.50ల తక్కువ రేటుకు రైతుకు అందించగలిగామని చెప్పారు. మీరెందుకు ఆపని చేయలేకపోతున్నారు? అని ప్రశ్నించారు. ఎందుకంటే బ్లాక్‌ మార్కెట్‌ల నుంచి మీ కొచ్చే కమీషన్లకోసం కాదా? అని ఎద్దేవా చేశారు.

జగన్ ఇంకా ఏం అన్నారంటే..

మరోవైపు పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు లబోదిబోమంటున్నారు. వరుసగా పంటల ధరలు పతనమవుతున్నా, ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, చిత్తశుద్ధితో ఏరోజూ రైతును ఆదుకోలేదు. క్వింటా ఉల్లి సగటున క్వింటాలుకు రూ.400-500లకు క్షీణించినా పట్టించుకునే నాథుడే లేడు. మరోవైపు ఇదే ఉల్లిని బహిరంగ మార్కెట్లో కిలో రూ.35లకు పైగా అమ్ముతున్నారు. మా ప్రభుత్వ హయాంలో ఉల్లి క్వింటా రూ.4వేల నుంచి రూ.12వేలు అమ్ముడయ్యేది. అంటే కేజీ రూ.40 నుంచి, రూ.120 దాకా రైతులు అమ్ముకున్నారు.

ధరలు పతనమైనప్పుడు మా హయాంలో ప్రభుత్వమే జోక్యంచేసుకుని గిట్టుబాటు ధరలు కల్పించింది. మా ఐదేళ్ల కాలంలో, రైతులకు ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు, 9,025 టన్నులను ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు తోడుగా నిలబడ్డాం. చీనీ ధర కూడా ఇప్పుడు మీ హయాంలో పడిపోయి టన్ను రూ.6వేల నుంచి రూ.12వేలు మాత్రమే పలుకుతోంది. మా హయాంలో టన్నుకు కనిష్టంగా రూ.౩౦ వేలు, గరిష్టంగా రూ.1లక్ష ధర రైతులకు లభించింది. కోవిడ్‌లాంటి మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన సమయంలో రైతుల వద్ద చీనీ పంట ఉండిపోతే, ప్రభుత్వమే కొనుగోలు చేసి, ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టి ఒక ప్రభుత్వంగా రైతులను ఆదుకోవడానికి అన్నిరకాలుగా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ఇంత సంక్షోభం వచ్చినా చంద్రబాబుగారూ మీరు పట్టించుకోవడంలేదు. నిద్ర నటించేవాళ్లని ఎవరైనా లేపగలరా?

మేం ఏర్పాటు చేసిన ధరలస్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. దీనికింద రూ.7,802 కోట్లు ఖర్చుచేసి మేం రైతులకు తోడుగా నిలబడితే మీరు ఆ విధానానికి మంగళంపాడారు. పంటలు, వాటికి లభిస్తున్న ధరలపై రియల్‌టైం డేటా CMAPP (Comprehensive Monitoring of Agriculture, Price, and Procurement)ను మూలనపడేశారు. రైతులకు చేదోడుగా నిలిచే ఆర్బీకేల వ్యవస్థను నాశనం శారు. ఉచిత పంటలబీమాకు పాతరవేశారు. ఏ సీజన్‌లో పంట నష్టం వస్తే, అదే సీజన్‌ ముగిసేలోపు ఇచ్చే ఇన్‌పుట్‌ సబ్సిడీ, మరుసటి సీజన్‌లోగా ఇచ్చే క్రాప్‌ ఇన్సూరెన్స్‌(పంట నష్టపరిహారం)ను అందించే పద్ధతినీ ధ్వంసంచేశారు. రైతులకు సున్నా వడ్డీ పథకాన్నీ ఎత్తివేశారు. మేం క్రమం తప్పకుండా ఇస్తున్న రైతు

భరోసాను ఎత్తివేసి, పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా, రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏడాదికి రూ.20వేలు, అన్నదాత సుఖీభవ పేరుతో ఇస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చి, వెన్నుపోటు పొడిచారు. మొదటి ఏడాది ఎగ్గొట్టారు. రెండేళ్లకు కలిపి రూ.40వేలు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది రూ.5వేలు మాత్రమే. అదికూడా సుమారు 7 లక్షల మంది రైతు కుటుంబాలకు ఎగ్గొట్టారు.

Anand Sai

eMail
ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్

Ys JaganChandrababu NaiduFarmersAgricultureAndhra Pradesh News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024