Best Web Hosting Provider In India 2024

Gobi 65: కాలీఫ్లవర్ తో చేసే వంటకాలు అంటే మీకు ఇష్టమా? ఒకసారి గోబీ65 చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు. దీన్ని చేయడం చాలా సులువు. అరగంటలో రెడీ అయిపోతుంది. కాలీఫ్లవర్ త్వరగా ఉడికిపోతుంది, కాబట్టి ఎక్కువ సమయం పట్టదు. గోబీ 65 రెసిపి ఎలాగో ఇక్కడ ఇచ్చాము. ఒకసారి ప్రయత్నించి చూడండి.
గోబీ65 రెసిపీకి కావలసిన పదార్థాలు
కాలీఫ్లవర్ ముక్కలు – రెండు కప్పులు
మైదా – మూడు స్పూన్లు
కొత్తిమీర తరుగు – ఒక స్పూను
కార్న్ ఫ్లోర్ – నాలుగు స్పూన్లు
కరివేపాకులు – గుప్పెడు
ఎర్ర మిరపకాయల పేస్ట్ – ఒక స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్
గరం మసాలా – అర స్పూను
మిరియాల పొడి – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
అల్లం తరుగు – అర స్పూను
వెల్లుల్లి తరుగు – అర స్పూను
ఉల్లిపాయ – ఒకటి
సోయాసాస్ – ఒక స్పూను
పెరుగు – ఒక స్పూను
నిమ్మరసం – ఒక స్పూను
కారం – అర స్పూను
పచ్చిమిర్చి – రెండు
నూనె – తగినంత
నీరు – సరిపడా
కాలీఫ్లవర్ 65 రెసిపీ
1. కాలీఫ్లవర్ ను ఒక పెద్ద గిన్నెలో నీళ్లు వేసి ఆ ఫ్లవర్ ను అందులో ఉంచండి. ఎలాంటి పురుగులు ఉన్నా నీళ్లలో తేలిపోతాయి.
2. ఆ తరువాత కాలీఫ్లవర్ ను ముక్కలుగా విడదీసుకోండి.
3. వేడి నీటిలో ఆ ముక్కలను ఒక నిమిషం పాటు ఉంచండి.
4. తర్వాత తీసి పక్కన పెట్టుకోండి.
5. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ కాలీఫ్లవర్ ముక్కలను వేసి అందులో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, ఎండుమిర్చి పేస్టు, మిరియాల పొడి, మైదా, కార్న్ ఫ్లోర్, నీరు వేసి బాగా కలపండి.
6. ఇది పకోడీ పిండిలా మందంగా కలుపుకోవాలి.
7. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయండి.
8. ఆ నూనెలో ఈ కాలీఫ్లవర్ ముక్కలను వేయించండి.
9. వాటిని తీసి పక్కన పెట్టండి.
10. ఇప్పుడు స్టవ్ మీద మరొక కళాయి పెట్టి ఒక స్పూన్ నూనె వేసి వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు వేసి వేయించండి.
11. ఆ తర్వాత కరివేపాకులు, సన్నగా కోసిన ఉల్లిపాయ తరుగు వేసి వేయించండి.
12. అందులోని ఎండుమిర్చి, పచ్చిమిర్చి తరుగును కూడా వేయండి.
13. పెరుగు, సోయాసాస్ కూడా వేసి కలపండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేయండి.
14. ఆ మిశ్రమం చిక్కటి ఇగురులాగా అయ్యాక ముందుగా వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను అందులో వేసి టాస్ చేయండి. తర్వాత స్టవ్ కట్టేయండి. పైన కొత్తిమీర జల్లుకోండి. కాస్త చల్లారాక నిమ్మరసం కూడా చల్లండి. అంతే టేస్టీ గోబీ65 రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వండుతున్నప్పుడే మంచి సువాసన వస్తుంది. దీన్ని చేయడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. ఒక్కసారి చేశారంటే మీ ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు.
కాలీఫ్లవర్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. దీనిలో ఉండే సమ్మేళనాలు రక్తపోటును తగ్గిస్తాయి. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ముఖ్యంగా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో ఇన్ఫ్లమేషన్ రాకుండా అడ్డుకుంటాయి. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ప్రతి రోజు కాలీఫ్లవర్ ని తింటే మంచిది. ఎన్నో రకాల వ్యాధులు రాకుండా అడ్డుకోవడంలో ఇది ముందుంటుంది. మన జీర్ణాశయంలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాకు ఈ కాలీఫ్లవర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో ఫైబర్ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను కాపాడుతుంది. చర్మ సంరక్షణకు ఇది సహాయపడుతుంది. సూర్యుడు నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంలో ముందుంటుంది. దీని వల్ల చర్మకాన్సర్ రాకుండా అడ్డుకునే శక్తి కాలిఫ్లవర్ కు ఉంది.
టాపిక్