Best Web Hosting Provider In India 2024

అమరావతి: వేసవిలో విద్యుత్ కొరత ఉండకూడదని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. విద్యుత్ కొరత కారణంగా కరెంటు కోతలనే సమస్య ఉత్పన్నం కాకూడదన్నారు. ఆ మేరకు అధికారులు అన్నిరకాలుగా సిద్ధం కావాలని ఆదేశించారు. బొగ్గు నిల్వల విషయంలో కూడా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరతరాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో విద్యుత్ డిమాండ్, రైతులకు విద్యుత్ కనెక్షన్లు, నాణ్యమైన విద్యుత్ సరఫరా తదితర అంశాలపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 2వ వారం నుంచే విద్యుత్ డిమాండ్ పెరిగిందని అధికారులు సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. మార్చి, ఏప్రిల్ నెలలో సగటున రోజుకు 240 మిలియన్ యూనిట్లు, ఏప్రిల్‌లో 250 మిలియన్ యూనిట్లు ఉంటుందని అంచనా వేశామని చెప్పారు. ఇప్పటికే పవర్ ఎక్స్‌ఛేంజ్‌లో ముందస్తుగా విద్యుత్‌ను బుక్ చేసుకున్నామని అధికారులు సీఎం వైయస్ జగన్‌కు వివరించారు.