Hanamkonda : పిడుగుపడి చెలరేగిన మంటలు.. కరిగిపోయిన బంగారం.. రూ.50 లక్షల ఆస్తి నష్టం!

Best Web Hosting Provider In India 2024


హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామంలో సోమవారం అర్ధ రాత్రి పిడుగుల మోత మోగింది. పిడుగులు పడి ఓ ఇల్లు మొత్తం కాలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ.. రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం రాత్రి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురవగా.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామంలో అర్ధరాత్రి.. ఎర్రబొజ్జు రాధికకు చెందిన ఇంట్లో పిడుగులు పడ్డాయి. ఒక్కసారిగా భారీ శబ్ధంతో పిడుగులు పడగా.. ఇంట్లో ఉన్న సామగ్రికి మంటలు అంటుకున్నాయి.

తప్పిన ప్రమాదం..

రాధిక భర్త దాదాపు ఐదేళ్ల కిందటే చనిపోయారు. ఆమె, కొడుకుతో పాటు అదే ఇంట్లో ఉంటోంది. రాధిక కొడుకు అరుణ్ కుమార్ సీసీ కెమెరాలకు సంబంధించిన బిజినెస్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఆర్డర్ నిమిత్తం రూ.13 లక్షల విలువ చేసే 45 సీసీ కెమెరాలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. వ్యక్తిగత పని నిమిత్తం రెండు రోజుల కిందట నెల్లూరుకు వెళ్లాడు. రాధిక తమ సమీప బంధువు దశ దిన కర్మ నిమిత్తం మంచిర్యాల జిల్లాకు వెళ్లింది. ఇద్దరూ వేరే ఊళ్లకు వెళ్లిపోగా.. సోమవారం అర్ధరాత్రి పిడుగుపడి

ఈ ప్రమాదంలో సీసీ కెమెరాలు, జిరాక్స్ మెషీన్లు, వాటితో పాటు రూ.3 లక్షల నగదు, ఐదు తులాల వరకు బంగారు ఆభరణాలు అన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇల్లు కూడా దెబ్బ తిని గోడలన్నీ నెర్రలు బారాయి. పిడుగు పాటు వల్ల దాదాపు రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. అనూహ్య ఘటనతో తీవ్రంగా నష్టపోయామని.. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. ఇల్లు మొత్తం కాలిపోవడంతో.. బాధితురాలు రోధించిన తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది.

పిడుగు పడి వృద్ధుడు మృతి..

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం బత్తులపల్లి గ్రామానికి చెందిన దుర్గం లక్ష్మయ్య(65) అనే వృద్ధుడు.. సోమవారం రాత్రి గ్రామ శివారులోని మొక్కజొన్న పంట చేనుకు కాపలా వెళ్లాడు. ఈ క్రమంలో పిడుగు పాటుకు గురై రోడ్డు పక్కనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బత్తులపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

టాపిక్

Ts RainsWarangalTelangana NewsRain AlertImd AlertsImd Hyderabad

Source / Credits

Best Web Hosting Provider In India 2024