Best Web Hosting Provider In India 2024

న్యూఢిల్లీ, ఆగస్టు 7: ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి స్వానిధి పథకం కింద ఇప్పటి వరకు 2,62,811 మంది వీధి వర్తకులకు రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైయస్ఆర్సీపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2022-23లో 49,534 మందికి, 2023-24లో ఆగస్టు 2 నాటికి 12,097 మంది వీధి వర్తకులకు రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు.
కోవిడ్ మహమ్మారి ప్రభావంతో దెబ్బతిన్న వ్యాపారాలను పునఃప్రాంరభించుకునేందుకు వీలుగా వీధి వర్తకులకు కొలేటరల్ ఫ్రీ వర్కంగ్ కేపిటల్ రుణాలను అందించే లక్ష్యంతో కేంద్రం 2020 జూన్ 1న ప్రధానమంత్రి వీధి వర్తకుల అత్మనిర్బార్ నిధి (పీఎం స్వానిధి) పథకం ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం కింద ఒక్కో వర్తకుడికి మొదటి ఏడాది రూ.10,000 రుణం అందించి, అది సకాలంలో తిరిగి చెల్లించిన పిదప రెండవ విడతలో రూ.20,000, మూడవ విడతలో 50,000 రుణం రూపంలో ఆర్ధక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే రుణ బకాయిలను సకాలంలో తిరిగి చెల్లించిన వారికి వడ్డీలో సంవత్సరానికి 7 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ లావాదేవీలు జరిపిన వారికి సంవత్సరానికి రూ.1200 క్యాష్ బ్యాక్ ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు తెలిపారు.
పీఎం స్వానిధి కింద వీధి వర్తకులకు మొదట్లో వర్కింగ్ క్యాపిటల్ రుణం కింద రూ.10,000 అందించినట్లు మంత్రి తెలిపారు. వ్యాపార అవసరాల పరిగణలోకి తీసుకొని 2021 ఏప్రిల్ 9 నుండి రెండవ విడత లోన్ కింద రూ.20,000 అలాగే 2022 జూన్ 1 నుంచి మూడవ విడత కింద రూ.50,000 లోన్ అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు క్యాష్ బ్యాక్ స్కీంను 2023 ఫిబ్రవరి 1 నుంచి సవరించినట్లు మంత్రి తెలిపారు. వీధి వర్తకులు జరిపిన ప్రతి డిజిటల్ లావాదేవీకి రూ.1 చొప్పున నెలకు అత్యధికంగా రూ.100, సంవత్సరానికి రూ.1200 క్యాష్ బ్యాక్ రూపంలో అందిస్తున్నట్ల తెలిపారు. డిజిటల్ లావాదేవీలు కింద అందిస్తున్న క్యాష్ బ్యాక్ ప్రోత్సాహాన్ని పెంచాలన్న ప్రతిపాదనేదీ తమకు అందలేదని అన్నారు.
పీఎం స్వానిధి స్కీం కింద అర్హులైన లబ్దిదారులను గుర్తించే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలదేనని మంత్రి పేర్కొన్నారు. ఈ పథకం కింద లబ్ధిదారుల సంఖ్యను పెంచేందుకు కేంద్రం అనేక చర్యలు చేపడుతోందని అన్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అర్బన్ లోకల్ బాడీలు, ఫైనాన్షియల్ సంస్థలతో తరచూ సమావేశాలు నిర్వహించడం, సమయానుసారం రేడియో, టెలివిజన్, వార్తా పత్రికలు మొదలగు ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు జారీ చేయడం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాంతీయ భాషల్లో ఐఈసీ (ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్) మెటీరియల్ అందించి, ప్రచారం విస్తృతం చేయడం ద్వారా అధిక సంఖ్యలో లబ్దిదారులను గుర్తించే విధంగా ప్రోత్సహిస్తున్నట్ల మంత్రి తెలిపారు.