



Best Web Hosting Provider In India 2024

Hanamkonda Crime : హనుమకొండ జిల్లాలో దారుణం, తాగొచ్చి గొడవ చేస్తున్నాడని తండ్రిని చంపిన కొడుకు
Hanamkonda Crime : హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. రోజు తాగొచ్చి ఇంట్లో గొడవపడుతున్నాడని తండ్రిపై కొడుకు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తండ్రి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Hanamkonda Crime : హనుమకొండ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తాగొచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నాడనే కారణంతో ఓ యువకుడు తన తండ్రిని కత్తితో పొడిచి చంపేశాడు. కత్తితో ఛాతి భాగంలో పొడవడంతో తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటన ఐనవోలు మండలంలోని పున్నేలు గ్రామంలో చోటు చేసుకోగా.. అనూహ్య ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పున్నేలు గ్రామానికి చెందిన మామునూరి భాస్కర్(52)– జయమ్మ దంపతులకు దాదాపు 35 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వారికి అన్వేష్, అరుణ్(28) అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు.
భాస్కర్ కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుతుండగా.. కొద్దిరోజుల కిందటి వరకు వారి జీవితం సాఫీగానే సాగింది. ఆ తరువాత భాస్కర్ మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో తరచూ తాగి వచ్చి ఇంట్లో జయమ్మతో గొడవ పడేవాడు. దీంతో అన్వేష్, అరుణ్ ఎంత వారించినా వినకుండా వారినీ కొట్టేవాడు. ఫలితంగా భాస్కర్ తీరుతో కుటుంబ సభ్యులంతా తీవ్ర ఇబ్బందులు పడేవారని స్థానికులు చెబుతున్నారు.
కత్తితో పొడిచి హతం
రోజువారీలాగే ఈ నెల 24న సోమవారం రాత్రి 9 గంటల సమయంలో కూడా మామునూరి భాస్కర్ మళ్లీ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆ తరువాత జయమ్మతో అకారణంగా మళ్లీ గొడవకు దిగగా.. అక్కడే ఉన్న అన్వేష్, అరుణ్ తండ్రిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తండ్రి భాస్కర్ తో చిన్న కొడుకైన అరుణ్ కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం భాస్కర్ ఆవేశంతో అరుణ్ మీద దాడి చేసేందుకు వెళ్లగా.. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో అరుణ్ ఆవేశానికి గురై పక్కనే ఉన్న కత్తితో భాస్కర్ ఛాతిలో పొడిచాడు. ఈ ఘటనతో ఛాతిలో తీవ్ర గాయమై భాస్కర్ అక్కడికక్కడే కుప్పకూలగా, తీవ్ర రక్త స్రావం జరిగింది.
విషయం గమనించిన అన్వేష్ తన కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించాడు. అనంతరం 108 అంబులెన్స్ కు సమాచారం అందించి తన తండ్రి భాస్కర్ ను హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించాడు. రాత్రి దాదాపు 10.30 గంటల ప్రాంతంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడున్న వైద్య సిబ్బంది భాస్కర్ ను ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేశారు.
అక్కడ డాక్టర్లు చికిత్స అందిస్తుండగా.. భాస్కర్ పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. కాగా భాస్కర్ పెద్ద కొడుకు అన్వేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఐనవోలు పోలీసులు వివరించారు. అనూహ్య ఘటనతో మామునూరి భాస్కర్ ప్రాణాలు కోల్పోగా.. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం
టాపిక్