



Best Web Hosting Provider In India 2024

TDP Office Attack Case :టీడీపీ ఆఫీస్, చంద్రబాబు నివాసంపై దాడి కేసు-24 మంది వైసీపీ నేతలకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్
TDP Office Attack Case : టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, జోగి రమేష్ సహా 24 మందికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని వైసీపీ నేతలకు ఆదేశించింది.
TDP Office Attack Case : టీడీపీ కార్యాలయం, చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, జోగి రమేష్, లేళ్లఅప్పిరెడ్డి, తలశిల రఘురాం, గవాస్కర్‌లతో సహా 24 మందికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. 2024 సెప్టెంబర్ 4న దేవినేని అవినాష్, జోగి రమేష్‌తో పాటు వైసీపీ నేతలందరికీ రాష్ట్ర హైకోర్టు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. దీంతో వైసీపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుధాన్షు దులియా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
వైసీపీ నేతలకు సుప్రీం కోర్టు పెట్టిన షరతులివే
వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతులను విధించింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని వైసీపీ నేతలకు ఆదేశించింది. దర్యాప్తు సహకరించకపోతే బెయిల్ ఆదేశాలు రద్దు అవుతుందని హెచ్చరించింది. పిటిషనర్లు తమ పాస్‌పోర్టులను అప్పగించాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారికి తెలియజేయకుండా విదేశాలకు వెళ్ల కూడదని ధర్మాసనం స్పష్టం చేసింది.
దేవినేని అవినాష్ తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ 88 మందిపై దాడి జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడేళ్ల తరువాత, పాలక పక్షం మారిన తరువాత కొత్తగా దర్యాప్తు ప్రారంభించిందని తెలిపారు. ఎఫ్ఐఆర్‌లోనూ, ఫిర్యాదులోనూ పేర్కొన్నదానికి విరుద్ధంగా స్వల్ప గాయాలు అయ్యాయని పేర్కొన్నారు. సాక్ష్యంగా నమోదు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లో నిందితుడు అవినాష్‌ను గుర్తించలేదని తెలిపారు. ముందస్తు బెయిల్‌ను ఇవ్వాలని కోరారు.
ఇది రాజకీయపరమైన కేసు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపిస్తూ వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకించారు. కోర్టు మధ్యంతర రక్షణ ఇచ్చిన తరువాత, వారు సహకరించలేదని, వారి ఫోన్‌ల వివరాలను అందించలేదని అన్నారు. నిందితుడు అవినాష్ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు.
దీంతో కపిల్ సిబల్ జోక్యం చేసుకుని ఇది రాజకీయపరమైన కేసు అని, పాస్‌పోర్టును ఇప్పటికే సరెండర్ చేశామని తెలిపారు. దాడికి పాల్పడిన 30 మందికి ఏపీ హైకోర్టు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ ఇచ్చిందని అన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు దేవినేని అవినాష్ అక్కడ లేరని, వీళ్ల ప్రమేయానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు.
జోగి రమేష్ తరపున సీనియర్ న్యాయవాది సిద్దార్థ దవే వాదనలు వినిపించారు. 2021లో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో అక్కడ వైసీపీ నేతలు ఎవరూ లేరని, అయితే ప్రభుత్వం మారగానే టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. మూడేళ్ల తరువాత ఈ కేసులో లేనివారిని కొత్తగా నిందితులుగా చేర్చారని తెలిపారు. 307 లాంటి హత్యయత్నం కేసులు పెట్టారని, కక్ష సాధింపు చర్యల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. దీంతో సుప్రీం కోర్టు ధర్మాసనం షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.
ప్రతి కార్యకర్త, నాయకుడిని వైఎస్ జగన్ కాపాడుకుంటారు
వైసీపీ తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలను, నాయకులను కాపాడుకుంటున్నారని, టీడీపీ గెలిచినప్పటి నుంచి వైసీపీ చెందిన నేతలను వెంటాడి వేటాడి హింసిస్తున్నారని విమర్శించారు. మూడేళ్ల క్రితం జరిగిన దాడి, ఇప్పుడు కొత్త కేసులు పెట్టి 128 మందిని ముద్దాయిలను చేసి హింసిస్తున్నారని అన్నారు.
సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందని, ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని, ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకుల కోసం పోరాడాలని వైఎస్ జగన్ ఆదేశించారని, ప్రతి వైసీపీ కార్యకర్త, నాయకుడు గర్వించాలని అన్నారు. ఎవరికీ బెయిల్ రాకుండా ప్రభుత్వం తరపున న్యాయవాదులు చివరి వరకు ప్రయత్నం చేశారన్నారు. అయినప్పటికీ న్యాయం తమవైపు ఉన్నందున ముందస్తు బెయిల్ వచ్చిందన్నారు.
దేవినేని అవినాష్, జోగి రమేష్ ఏఏ సెక్షన్లలో కేసులు
2021 అక్టోబర్‌లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం (ఎన్‌టీఆర్ భవన్)పై దాడి కేసులో దేవినేని అవినాష్ గతేడాది సెప్టెంబర్ నుండి మధ్యంతర రక్షణలోనే ఉన్నారు. ఆయనపై 147, 148, 452, 427, 323, 506, 324, 149, 326, 307, 450, 380, 109, 120 బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే జోగి రమేష్‌పై ఐపీసీ 143, 324, 506, 188, 269, 270, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్