Best Web Hosting Provider In India 2024

Konaseema Crime: పదో తరగతి బాలికకు మోనాలిసా పేరుతో ఇన్‌స్టా వేధింపులు, కోనసీమలో యువకుడిపై కేసు నమోద
Konaseema Crime: కోనసీమ మోనాలిసా’ అంటూ పదో తరగతి బాలిక వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన యువకుడిపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడంతో యువకుడిపై కేసు నమోదు చేసిన ఘటన కోనసీమ జిల్లాలో వెలుగు చూసింది.
ఈ ఘటన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉండటంతో బాలిక అమలాపురంలోని తన పిన్ని వద్ద ఉంటూ చదువుకుంటోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముమ్మిడివరం మండలం సీహెచ్ గున్నేపల్లిలో ఈనెల 23న సత్తెమ్మతల్లి జాతర జరిగింది.
ఈ జాతరలో కుటుంబ జీవనం కోసం అమలాపురానికి చెందిన పదో తరగతి విద్యార్థిని పూసలు అమ్మింది. అయితే ఆమె పూసలు అమ్ముతున్న సమయంలో ఆమెకు తెలియకుండా చింతాడ గడువుకు చెందిన యువకుడు సత్తి దేవిశ్రీ ప్రసాద్ వీడియో తీశాడు.
అంతటితో ఆగకుండా ‘కోనసీమ మోనాలిసా’ అంటూ క్యాప్షన్ ఇచ్చి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. దీంతో ఆ వీడియో బాగా వైరల్ అయింది. ‘కోనసీమ మోనాలిసా’ వీడియో పోస్టింగ్‌కు లక్షల్లో లైకులు, వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోని బాలిక తోటి విద్యార్థులు కూడా చూశారు. దీంతో ఆమెను తోటి విద్యార్థులు ఎగతాళి చేయడం, ఆమెపై విమర్శలు చేయడం ప్రారంభించారు. దీంతో ఆ బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ అమాయక బాలిక తనలో తానే మనోవేదన చెందింది.
విద్యార్థుల ఎగతాళి.. పోలీసులకు ఫిర్యాదు..
దీంతో తన పిన్ని ఎందుకు అలా ఉన్నావని ఆరా తీసింది. దీంతో తనలో బాధను ఆమె తన పిన్ని వద్ద వెలబుచ్చుకుంది. దీంతో వరుసకు కుమార్తె అయ్యే బాలిక మనోవేదనను చూసి ఆమె బుధవారం ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. తన బిడ్డ అనుమతి లేకుండా, ఎవరో వీడియో పెట్టడంతో ఆమె చాలా మనోవేదన చెందుతుందని, తోటి విద్యార్థినుల కూడా ఆమెను ఎగతాళి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన యువకుడు సత్తి దేవిశ్రీ ప్రసాద్‌పై కేసు నమోదు చేశారు.
ముమ్మడివరం పోలీసుల దర్యాప్తు…
ముమ్మిడివరం ఎస్ఐ జ్వాలా సాగర్ మాట్లాడుతూ తమకు బాలిక పిన్ని నుంచి ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేశామని అన్నారు. దర్యాప్తు ప్రారంభించామని, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్టు చేసిన వ్యక్తిని విచారిస్తున్నామని తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అలాగే ఎవరైనా వ్యక్తులు ఇతరుల వీడియోలను వారి అనుమతి లేకుండా పోస్టు చేయకూడదని, అందులోనూ బాలికలు, యువతులు, మహిళల వీడియోలను వారి అనుమతి లేకుండా సోషల్ మీడియా వేదికల్లో అసలు పోస్టు చేయడానికే లేదని అన్నారు.
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలలో పూసలు అమ్మే మహిళను వీడియో తీసి మోనాలిసా అంటూ ప్రచారం చేయడంతో ఆమె పాపులర్ అయింది. తొలిత సోషల్ మీడియాలో ఆమె పూసలు అమ్ముతున్న వీడియో వైరల్ అవ్వడంతో ప్రధాన స్రవంతి మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. దీంతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కూడా స్పందించి ఆఫర్లు కూడా ఇచ్చింది. ఆమె జీవితం వంటి అంశాలతో మీడియాలో కథనాలు వెల్లువెత్తి, రాత్రికి రాత్రే పాపులర్ అయింది. ఆ ప్రభావంతోనే ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం
టాపిక్