




Best Web Hosting Provider In India 2024

డయాబెటిస్ ఉన్నవారు ఏ బియ్యం తినాలి? చక్కెర తక్కువగా ఉండే బియ్యం రకం ఇదిగో
డయాబెటిస్ బారిన పడినవారు బియ్యంతో వండిన ఆహారం తినాలంటే భయపడతారు. ఎందుకంటే అన్నంలో ఉండే చక్కెర రక్తంలో చేరి డయాబెటిస్ వ్యాధిని పెంచేస్తుంది.అయితే డయాబెటిస్ వారి కోసం ఒక ప్రత్యేకమైన బియ్యం ఉన్నాయి. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. అదే రాజముడి బియ్యం.
డయాబెటిస్ ఉన్న వారు అన్నం తినేందుకు ఎంతో భయపడతారు. ఎందుకంటే అన్నంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఒక పూటే అన్నం తిని రెండో పూట టిఫిన్ తో ముగించేవారు. ఎంతోమంది రాత్రిపూట పూర్తిగా అన్నం తినడం మానేసి చపాతీతోనే కడుపు నింపుకునే వారు కూడా ఉన్నారు. కానీ ఎంతో మందికి అన్నం తింటేనే సంతృప్తిగా అనిపిస్తుంది.
కానీ డయాబెటిస్ వ్యాధి వల్ల వారు అన్నాన్ని సంతృప్తిగా తినలేక పోతున్నారు. అలాంటి వారి కోసమే చక్కెర తక్కువగా ఉండే ఒక బియ్యం రకం ఉన్నాయి. వీటిని తింటే త్వరగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కూడా వీటిని తినవచ్చని అధ్యయనం చెబుతోంది. ఈ బియ్యం రకం పేరు రాజముడి. కర్ణాటకలో వీటిని అధికంగా పండిస్తూ ఉంటారు.
రాజముడి బియ్యం ఎలా ఉంటాయి?
రాజముడి బియ్యం చాలా ప్రత్యేకమైన రుచిని, వాసనను కలిగి ఉంటుంది. పోషక లక్షణాలు కూడా ఎక్కువే. దీని గింజలు కూడా పెద్దవిగా ఉంటాయి. చూసేందుకు బ్రౌన్ రైస్ లాగా కనిపిస్తాయి. ఎరుపు, గోధుమ రంగులో కనిపిస్తాయి. ఇతర బియ్యం రకాలతో పోలిస్తే ఇవి చూడటానికి కూడా భిన్నంగానే ఉంటాయి.
సాధారణ తెల్ల బియ్యంతో పోలిస్తే ఈ రాజముడి బియ్యం ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. మధుమేహం ఉన్నవారు రాజముడి బియ్యాన్ని సంతృప్తిగా తినవచ్చు.
రాజముడి బియ్యం ఎలా ప్రత్యేకం?
రాజముడి బియ్యంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. డయాబెటిస్ రోగులు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. ఇది జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడడానికి రాజముడి బియ్యం ఎంతో సహకరిస్తుంది. ముఖ్యంగా దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ.
ఇతర రకాల బియ్యంతో పోలిస్తే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటే రాజముడి బియ్యాన్ని తినవచ్చు. దీన్ని తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగవు. ఇది చాలా నెమ్మదిగా శోషణకు గురవుతుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నెమ్మదిగా పెరుగుతాయి. దీనివల్ల డయాబెటిస్ రోగులకు శక్తి రోజంతా అందుతూ ఉంటుంది.
రాజముడి బియ్యంలో ఇతర పోషకాలు కూడా అధికంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఇనుము, కాల్షియం, భాస్వరం అధికంగా ఉంటాయి. వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు కూడా లభిస్తాయి. ఈ రాజముడి బియ్యం తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలన్నీ పుష్కలంగా అందుతాయి. జీవక్రియ కూడా మెరుగుపడుతుంది.
రాజముడి బియ్యంలో సహజ సహజమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. కాబట్టి ఎన్నో ప్రాణాంతక దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా రాజముడి బియ్యం రక్షణగా నిలుస్తాయి. ఈ బియ్యం రకం తినేవారిలో క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.
సాధారణ బియ్యంలో పోషకాలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటిని ప్రాసెస్ చేసి దాని పోషక లక్షణాలను తగ్గించేస్తారు. కాబట్టి రాజముడి బియ్యాన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు. ఇతర బయట దొరికే ఇతర విషయాలతో పోలిస్తే రాజముడి బియ్యం మంచిది. ఇది కేవలం డయాబెటిక్ రోగులకే కాదు అందరికీ మేలు చేస్తాయి.
ధర ఎంత?
రాజముడి బియ్యం ధర కిలో 80 రూపాయల నుంచి 240 దాకా ఉంటుంది. వాటి నాణ్యతను బట్టి ధర ఆధారపడి ఉంటుంది. అమెజాన్, బిగ్ బాస్కెట్ వంటి వాటిల్లో కూడా రాజముడి బియ్యం దొరుకుతున్నాయి. దీనిలో కూడా రెండు మూడు రకాల బియ్యాలు ఉన్నాయి. వాటి నాణ్యతను బట్టి ధర ఆధారపడి ఉంటుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)