శాంతి మీ లోపల నుండే వస్తుంది, దాని కోసం బయట వెతకకండి.. బుద్ధుడు చెప్పిన ఇలాంటి కోట్స్ మీలో ప్రశాంతతను నింపుతాయి

Best Web Hosting Provider In India 2024

శాంతి మీ లోపల నుండే వస్తుంది, దాని కోసం బయట వెతకకండి.. బుద్ధుడు చెప్పిన ఇలాంటి కోట్స్ మీలో ప్రశాంతతను నింపుతాయి

Haritha Chappa HT Telugu

శాంతికి చిహ్నం బుద్ధుడు. అతడి ముఖారవిందం చూస్తే చాలు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. జీవితంలో మీకు ప్రశాంతత కావాలనిపిస్తే బుద్ధుడు చెప్పిన ఈ మాటలను గుర్తు చేసుకోండి.

మనసుకు శాంతి ఎలా దొరుకుతుంది? (Pixabay)

బుద్ధ భగవానుడి మాటలు ఎంతో లోతుగా హృదయాన్ని తాకుతాయి. ఆయన ముఖాన్ని చూస్తే చాలు ప్రశాంతతకు ప్రతిబింబంలా ఉంటుంది. జీవితంలో అనిశ్చితి వల్ల మీ మార్గం గందరగోళంగా మారినప్పుడు… మీ హృదయానికి శాంతి కావాల్సి వచ్చినప్పుడు బుద్ధ భగవానుడిని గుర్తు చేసుకోండి. ఆయన బోధనలను మనసులో తలుచుకోండి. మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది.

శాంతి మీలోనే ఉంది

ఎంతోమంది శాంతి కోసం బయట వెతుకుతూ ఉంటారు. నిజానికి శాంతి, ఆనందం మీ మనసులోనే ఉద్భవిస్తాయని చెబుతున్నారు బుద్ధుడు. బాహ్య ప్రపంచంలో మీకు శాంతి, ఆనందం అనేది దొరకవు. అవి భౌతిక ఆస్తులు కాదు బయట వెతకగానే దొరకడానికి. భౌతిక వస్తువులు, భౌతిక సుఖాలు అన్ని తాత్కాలిక సంతృప్తినే కలిగిస్తాయి. కానీ శాశ్వతమైన శాంతి కావాలంటే అది మీ మనసులోంచి ఉద్భవించాలి. విజయాలు, అనుబంధాలు మారుతున్న వాతావరణానికి తగ్గట్టు మిమ్మల్ని మీరు మార్చుకుంటూ శాంతితో ఉండేందుకు ప్రయత్నించాలి. ప్రశాంతంగా జీవించే వ్యక్తి ఎంతో ఆనందంగా ఉంటాడు.

మనసే కారణం

మనసు చంచలమైనదిగా ఉండకూడదు. చంచలమైన మనసు వల్ల ప్రశాంతత ఉండదు. ఎప్పటికప్పుడు గందరగోళాలు అయోమయ పరిస్థితిలో ఏర్పడతాయి. అందుకే మీ మనసు దేనికైనా ఒక లక్ష్యానికి అంటిపెట్టుకొని ఉండాలి. నిబద్ధత, క్రమశిక్షణతో ముందుకు సాగాలి. మానసిక నియంత్రణ, భావోద్వేగ శ్రేయస్సు మధ్య ఎంతో సంబంధం ఉందని బుద్ధుడు చెబుతున్నాడు. క్రమశిక్షణ గల మనసులో ఎల్లప్పుడూ స్పష్టంగా ఉంటుంది. మానసికంగా సంతోషంగా ఉంచుతుంది. మీ ఆలోచనలు గందరగోళంగా కాకుండా స్పష్టంగా ఉంటాయి. దీనివల్ల మీరు కూడా ప్రశాంతంగా ఉంటారు.

నొప్పిలేని జీవితం ఉండదు. ఆ నొప్పి శారీరకమైనది కావచ్చు. భావోద్వేగాలపరమైనది కావచ్చు. కానీ జీవితంలో కచ్చితంగా ఏదో ఒక దశలో నొప్పి కలుగుతూనే ఉంటుంది. ఎవరూ కూడా నష్టాలు, అనారోగ్యాలు, కష్టాల నుండి తప్పించుకోలేరు. ఇవన్నీ కూడా జీవితంలో భాగాలు. అది మీరు అర్థం చేసుకుంటేనే ప్రశాంతంగా జీవించగలరు. బాగా నొప్పి కలిగినప్పుడు మీరు ఎలా స్పందిస్తారో అలాగే మీ జీవితం ఉంటుంది. ఆ రెండింటినీ తట్టుకొని ప్రశాంతంగా జీవించే వ్యక్తి ఎప్పుడైనా ఆనందంగానే ఉంటాడు.

ఒక మనిషికి మనసే సర్వస్వం. భావోద్వేగాలు, అవగాహన, సమస్యలు… అన్నిటికీ మనసే మూలం. మీ ఆలోచనలు మీపై చూపే ప్రభావం అన్నీ కూడా మనసు నుంచే పుట్టుకొస్తాయి. మనసు నియంత్రించే విషయాలు సక్రమంగా ఉంటే మనిషి జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. కాబట్టి మనసులోని నియంత్రణలో పెట్టుకోండి. చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా ప్రతిస్పందించకండి.

బాధ కలిగేది అనుబంధాల వల్లే. తీవ్రమైన అనుబంధాలు, విపరీతమైన భావోద్వేగాలు మంచిది కాదు. ఆ భావోద్వేగాలకు కారణం మనసు. ఒక అనుబంధం ఏర్పడినప్పుడు అది మన అంచనాలకు తగ్గట్టు ఉండకపోతే వెంటనే నిరాశ చెందుతాము. అది బాధకు గురిచేస్తుంది. ఆ బాధ నొప్పిని కలిగిస్తుంది. కాబట్టి ఆశించడం మానేయండి. ప్రతి దానికి బాధపడడం దూరం పెట్టండి. కోరికలను వదిలించుకోండి. శాంతి, ఓదార్పు కోసం మాత్రమే ఆలోచించండి.

మీరు ప్రతి ఉదయం కొత్తగా మళ్లీ పుట్టేలా ఉండాలి. పాత విషయాలను తలుచుకొని పాత రోజును గురించి ఆలోచిస్తూ ఉంటే మీరు ముందుకు సాగలేరు. ప్రతి ఉదయం జీవితం మీకు మరొక కొత్త అవకాశాన్ని ఇస్తుంది. తప్పులను సరిదిద్దుకొని మీ జీవితంపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించాలని బుద్ధులు ఏనాడో చెప్పారు. నిన్నటి తప్పులు, పశ్చాత్తాపాల గురించి ఆలోచిస్తూ ఉంటే మీరు గతంలోనే ఉండిపోతారు. వాటిని వదిలించుకుని ముందుకు వెళ్లి జీవితాన్ని సరికొత్తగా మార్చుకోవాలి. మీరు గతాన్ని మార్చలేరు.. కానీ వర్తమానంలో మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

ఇతరులతో స్నేహంగా, దాతృత్వంతో ప్రవర్తించడం కూడా మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. మీరు వేరొకరి కోసం దీపం వెలిగిస్తే… ఆ దీపం మార్గం అందరికీ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీపం మీకోసమే మీరు వెలిగించుకోవాలని అనుకోకండి. అందరికి సాయపడేలా ఉండండి. ఇది ప్రజల్లో సానుకూలతను పెంచుతుంది. మీపై మంచి అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఇవన్నీ కూడా మీ మనసుకు సంతోషాన్ని అందిస్తాయి.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024