



Best Web Hosting Provider In India 2024

వరంగల్ మిల్స్ కాలనీ సీఐపై సస్పెన్షన్ వేటు… నిందితురాలిపై స్టేషన్లోనే లైంగిక వేధింపులు
వరంగల్ కమిషనరేట్ లో కొంతకాలంగా వివిధ ఆరోపణలతో చర్చల్లో నిలిచిన మిల్స్ కాలనీ సీఐ ఆగడాలకు చెక్ పడింది. చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం, ఓ కేసులో నిందితురాలిగా ఉన్న మహిళను లైంగికంగా వేధించడంతో సీఐ వెంకటరత్నంపై వేటు పడింది.
వరంగల్లో ఓ కేసులో నిందితురాలిగా ఉన్న మహిళపై పోలీస్ స్టేషన్ ఆవరణలోనే లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు మరో భూ వివాదంలో చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన సీఐపై వేటు పడింది. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సీఐను సస్పెండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వివిధ కేసుల్లో సీఐ వేధింపులకు బాధితులుగా మారిన జనాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
లైంగిక వేధింపులే ప్రధాన కారణం!
వరంగల్ మిల్స్ కాలనీ సీఐ జె.వెంకటరత్నం సస్పెన్షన్ కు ప్రధానంగా మహిళపై లైంగిక వేధింపులే కారణమని తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట ఓ నేరం జరగగా.. అందులో నిందితురాలిగా ఉన్న మహిళను విచారణ పేరున లైంగిక వేధింపులకు గురి చేసినట్లు తెలిసింది.
నిందితురాలిని శారీరకంగా ఇబ్బందులకు గురి చేయడంతో ఆ మహిళ కొంతమంది పోలీస్ సిబ్బందికి విషయాన్ని తెలిపింది. నిందితురాలిగా ఉన్న మహిళను సీఐ వెంకటరత్నం బలవంతంగా తన వెంట తిప్పుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఓ వైపు మిల్స్ కాలనీ పరిధిలో సీఐ ఆగడాలు ఎక్కువవడం, కేసులో నిందితురాలిగా ఉన్న మహిళనే లొంగదీసుకునే ప్రయత్నం చేయడంతో తగిన సాక్ష్యాధారాలతో వరంగల్ సీపీకి ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ జరిపించిన సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆరోపణలు నిజమని తేలడంతో ఈ మేరకు సీఐ సస్పెన్షన్ వేటు వేశారు.
చనిపోయిన వ్యక్తిపై భూకబ్జా కేసు
సీఐ జె.వెంకటరత్నం సస్పెన్షన్ కు తాజాగా వరంగల్ లో వెలుగు చూసిన మరో ఘటన కూడా కారణమే. కొన్నేళ్ల కిందట చనిపోయిన ఓ వ్యక్తిపై భూకబ్జా కేసు నమోదు చేయడంతో పాటు బాధితులను బెదిరించడం, నిందితులకు సహకరించడం కూడా సీఐ సస్పెన్షన్ కు కారణమైంది.
మిల్స్ కాలనీ స్టేషన్ పరిధి ఉర్సు శివారు సర్వే నెంబర్లు 358, 386, అలాగే 199, 200,201 సర్వే నెంబర్లలో సుమారు 23 ఎకరాల భూమి ఉండగా, దానిపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో బత్తిని చంద్రశేఖర్, బత్తిని సంపత్, బొమ్మగాని శ్రీను, వేణు, నాగరాజు అనే వ్యక్తులు తమ భూమిలోకి వచ్చి వివాదం సృష్టిస్తున్నారని, భూమిలో ఉన్న హద్దురాళ్లను తొలగించడంతో పాటు భూమిని చదును చేసి చంపుతామని బెదిరిస్తున్నారంటూ హంటర్ రోడ్డుకు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఏడాది జనవరి 21న ఆమె మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రాథమిక విచారణ ఏమీ లేకుండానే పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ మేరకు పైన పేర్కొన్న ఐదుగురిపై బీఎన్ఎస్ 324(4), 329(3), 351(2), r/w 3(5) సెక్షన్ల కింద 47/2025 ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
చనిపోయిన వ్యక్తే ఏ1…
మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అందులో ఏ1 గా బత్తిని చంద్రశేఖర్, ఏ2 బత్తిని సంపత్, ఏ3 బొమ్మగాని శ్రీను, ఏ4 వేణు, ఏ5 నాగరాజు పేర్లను చేర్చారు. కానీ ఇందులో ఏ1 గా ఉన్న బత్తిని చంద్రశేఖర్ కొన్నాళ్ల కిందట చనిపోగా, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వివాదాస్పదమైంది.
2016 సెప్టెంబర్ 17న ఆయన హైదరాబాద్ లో చనిపోగా, ఈ మేరకు జీహెచ్ఎంసీ డెత్ సర్టిఫికేట్ కూడా జారీ చేసింది. చనిపోయిన తొమ్మిదేళ్లకు చంద్రశేఖర్ పై కేసు నమోదు కాగా.. విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు పోలీసులను ప్రశ్నిస్తే.. సీఐ వెంకటరత్నం వారిపైనా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బాధితులు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపైనా విచారణ జరుపగా.. వెంకటరత్నం బాగోతం బయటపడింది.
భూ వివాదం కేసులో బాధితులకు న్యాయం చేయకుండా, తప్పుడు కేసును నమోదు చేయడం, మరణించిన వ్యక్తి పేరును కూడా నమోదు చేసి నిందితులకు సహకరించడం, మరో కేసులో మహిళా నిందితురాలిని పోలీస్ స్టేషన్ ఆవరణలో లైంగిక వేధింపులకు గురి చేసిట్లుగా విచారణలో నిర్ధారణ కావడంతో సీఐ వెంకటరత్నంను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం
టాపిక్