





Best Web Hosting Provider In India 2024

నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ మలయాళం కామెడీ మూవీ.. ఐఎండీబీలో 7.6 రేటింగ్
ఓటీటీలోకి ఓ మలయాళం సూపర్ నేచురల్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ సూపర్ హిట్ సినిమాకు ఐఎండీబీలో 7.6 రేటింగ్ నమోదైంది. మరి ఆ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో చూడండి.
మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన మరో సూపర్ హిట్ సూపర్ నేచురల్ ఫ్యాంటసీ కామెడీ మూవీ పదక్కలమ్ (Padakkalam). ఈ మూవీ గత నెల 8న థియేటర్లలో రిలీజ్ కాగా.. మరో వారంలో ఓటీటీలోకి రాబోతోంది. సీనియర్ నటుడు సూరజ్ వెంజరమూడులాంటి వాళ్లు నటించిన ఈ సినిమాకు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
పదక్కలమ్ ఓటీటీ రిలీజ్ డేట్
మలయాళం సూపర్ నేచురల్ ఫ్యాంటసీ కామెడీ మూవీ పదక్కలమ్ జూన్ 10 నుంచి జియోహాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ విషయాన్ని ఆ ఓటీటీ సోమవారం (జూన్ 2) వెల్లడించింది. ఐఎండీబీలో 7.6 రేటింగ్ సాధించిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
“జూన్ 10 నుంచి జియోహాట్స్టార్ లో కామెడీ ఫైర్ వర్క్స్ పేలనున్నాయి” అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని ఆ ఓటీటీ వెల్లడించింది. పదక్కలమ్ అంటే తెలుగులో పెన్సిల్ అని అర్థం. ఈ వెరైటీ టైటిల్ తో వచ్చిన సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే అప్పటికే థియేటర్లలో తుడరుమ్ లాంటి మూవీ కూడా ఆడుతుండటంతో ఊహించినంత హైప్ రాలేకపోయింది.
పదక్కలమ్ మూవీ గురించి..
పదక్కలమ్ మూవీ మే 8న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాను మను స్వరాజ్ డైరెక్ట్ చేశాడు. సూరజ్ వెంజరమూడుతోపాటు షరాఫుద్దీన్, సందీప్ ప్రదీప్ లాంటి వాళ్లు నటించారు. బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.13 కోట్ల వరకూ వసూలు చేయడం విశేషం. సూపర్ నేచురల్ ఫ్యాంటసీ కామెడీ జానర్లో తెరకెక్కింది. కామిక్ పుస్తకాలను బాగా ఇష్టపడే నలుగురు స్టూడెంట్స్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది.
కొత్తగా వచ్చిన ప్రొఫెసర్ కొన్ని సూపర్ నేచురల్ ఈవెంట్స్ తో ఆ నలుగురి ప్రపంచాన్ని తలకిందులు చేస్తాడు. ఈ మూవీలోని ప్రతి సీన్ మొదటి నుంచి చివరి వరకూ బాగా నవ్వించిందని, ఎక్కడా బోర్ కొట్టదని కొందరు ప్రేక్షకులు కామెంట్స్ చేశారు. కేవలం రెండు గంటల నిడివితో ఉన్న ఈ సినిమాకు ఓటీటీలో మరింత మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను జూన్ 10 నుంచి జియోహాట్స్టార్ ఓటీటీలో చూడొచ్చు.
సంబంధిత కథనం