Best Web Hosting Provider In India 2024

Hyderabad Drugs : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఎస్ఆర్ నగర్‌లోని అపార్ట్‌మెంట్‌పై నార్కోటిక్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అపార్ట్‌మెంట్‌లో నెల్లూరు జిల్లాకు చెందిన యువకులు డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేశారు. పట్టుబడిన వారిలో ఓ రాజకీయ నాయకుడు బంధువు ఉన్నట్లు సమాచారం. పట్టుబడిన కార్లలో రాజకీయ నేతకు చెందిన కారు సైతం ఉంది. కారు నెంబర్ ప్లేట్‌పై నుడా ఛైర్మన్ అనే స్టిక్కరింగ్ ను నార్కోటిక్ బ్యూర్ పోలీసులు గుర్తించారు. ప్రేమ్ చంద్ అనే వ్యక్తి తన బర్త్ డే పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారని నార్కోటిక్ బ్యూరో అధికారులు తెలిపారు. దాదాపు 30 మంది వరకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఇంజినీరింగ్ విద్యార్థులు కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారని తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
అంతరాష్ట్ర ముఠా అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం కృషి చేయాలని అధికారులను ఆదేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు డ్రగ్స్, గంజాయి తదితర వాటిపై నిఘా పెంచారు.ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఓపియం ( డ్రగ్ ) సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను మల్కాజిగిరి ఎస్ఓటి, కుషాయిగూడ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.56 లక్షలు విలువ చేసే 3.5 కేజీల ఓపియంను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 45 గ్రాముల పొప్పిస్త్ర పౌడర్….రూ.2 లక్షల 80 వేల నగదు, ఒక ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు.
న్యూ ఇయర్ వేడుకలే లక్ష్యం
ఈ ముఠా నూతన సంవత్సర వేడుకలను లక్ష్యం చేసుకుని, రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు ఓపియం, పొప్పి స్ట్రా డ్రగ్స్ అక్రమంగా తరలిస్తున్నట్లు సుధీర్ బాబు ప్రకటించారు. ఈ ముఠాలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన శశిపాల్ బిష్ణోయ్, మదన్ లాల్ బిష్ణోయ్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అయన తెలిపారు. ఈ ముఠాకు సంబంధించి మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు వివరించారు. శశి పాల్ గతంలో కూడా డ్రగ్స్ సరఫరా చేస్తూ జైలుకు వెళ్లి వచ్చాడని అయన అన్నారు.
పబ్బులు, బార్లపై ప్రత్యేక నిఘా
డ్రగ్స్ తో ఈవెంట్ చేసే వారికి బ్రేక్ వేసినట్లు అయిందని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. నిందితులు వారి ఫెండ్స్ కు అమ్మడానికి చిన్న ఫ్యాకెట్లలో డ్రగ్స్ సిద్ధం చేసిన వివరించారు. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని పబ్స్, బార్లపై ప్రత్యేక నిఘా ఉంటుందని సీపీ సుధీర్ బాబు హెచ్చరించారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్ , హైదరాబాద్