Best Web Hosting Provider In India 2024

YS Sharmila : వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో షర్మిల రేపు దిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే షర్మిల భర్త అనిల్ కుమార్ దిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ పిలుపు మేరకే షర్మిల రేపు దిల్లీ వెళ్తున్నారని ప్రచారం జరుగుతోంది. రేపు కాంగ్రెస్ వ్యవస్థాపన దినోత్సవం… ఈ సందర్భంగా షర్మిల కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే జాతీయస్థాయిలో తనను సర్దుబాటు చేయాలని షర్మిల అడుగుతున్నారని, కానీ ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించేందుకు ఏఐసీసీ మొగ్గుచూపుతుందని సమాచారం.
ట్రెండింగ్ వార్తలు
ఏపీ కాంగ్రెస్ నేతలతో హైకమాండ్ భేటీ
ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టింది. తెలంగాణ ఎన్నికల్లో విజయంతో… కాంగ్రెస్ లో కూడా పార్టీ పరిస్థితిని మార్చాలని అధిష్టానం ప్రణాళికలు మొదలుపెట్టింది. ఈ మేరకు ఏపీ కాంగ్రెస్ నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో దిల్లీలో సమావేశం అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, పల్లంరాజు, రఘువీరా రెడ్డి, చింతా మోహన్ పాల్గొన్నారు. ఏపీలో పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించారని తెలుస్తోంది.
షర్మిల చేరికపై ఖర్గేదే నిర్ణయం
ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్‌ను పునర్నిర్మిస్తామని, కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్మే వారికి పార్టీలోకి స్వాగతిస్తామన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరికపై మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కాంగ్రెస్‌తో కలిసొచ్చే పార్టీలను ఆహ్వానిస్తున్నామన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటు శాతం పెంచుకునేందుకు కృషి చేస్తామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు అన్నారు. రానున్న 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై ఈ భేటీలో చర్చించామన్నారు.
రాహుల్ గాంధీ పర్యటన
ఏపీలో రాహుల్ గాంధీ పర్యటనకు ముహుర్తం ఖరారైంది. జనవరి 9న విశాఖపట్నంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఆందోళన కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించడంతో ఏపీలో కూడా ఎంతోకొంత ప్రభావం ఉంటుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఏపీ రాజకీయాల్లో 2014 నుంచి స్తబ్దత ఏర్పడింది. పార్టీ అధ్యక్షులను మారుస్తున్నా పెద్దగా ప్రయోజనం ఉండట్లేదు.