Best Web Hosting Provider In India 2024

CM Revanth Reddy – KCR : ఆస్పత్రిలో కేసీఆర్ చికిత్స పొందుతున్న సమయంలో అక్కడికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి… పరామర్శించి అందర్నీ ఆశ్చర్యపర్చిన సంగతి తెలిసిందే. స్వయంగా వచ్చి కేసీఆర్ ను కలిసి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ పరిణామం రాజకీయవర్గాల్లో ఆత్యంత ఆసక్తిని రేపింది. అయితే ఆ రోజు ఏం జరిగింది…? కేసీఆర్ వద్దకు వెళ్లటానికి గల కారణాలేంటి..? వంటి పలు అంశాలపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. శనివారం ఓ తెలుగు టీవీ ఛానెల్ కు ప్రత్యేకంగా ఇంటర్వూ ఇచ్చిన సమయంలో…. ఈ అంశంపై మాట్లాడారు.
ట్రెండింగ్ వార్తలు
కేసీఆర్ గాయంపై రాహుల్ గాంధీ అడిగారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మాజీ ముఖ్యమంత్రిని కేసీఆర్ను కలిశావా… ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అని ఆరా తీశారని పేర్కొన్నారు. “రాహుల్ గాంధీని కలవటానికి వెళ్ళినప్పుడు కేసీఆర్ ఆరోగ్యంపై నన్ను అడిగారు. కేసీఆర్ గారు హాస్పిటల్ లో ఉన్నారని తెలిసింది ఇప్పుడు ఎలా ఉన్నారు ఆయన అని అడిగారు.! బాగానే ఉన్నారని తెలిసింది అని చెప్పాను. తెలిసింది అంటున్నావు నువ్వు వెళ్ళి కలవలేదా అని కోప పడ్డారు. రాజకీయాలు వేరు పర్సనల్ గా అందరితో బాగుండాలి… నువ్వు ఫస్ట్ వెళ్లి ఆయన్ని కలిసి యోగక్షేమాలు కనుక్కో అని చెప్పారు” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఈ ఇంటర్వూలో అనేక అంశాలపై స్పందిస్తూ… కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జగన్ ఇప్పటి వరకు కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదన్నారు. సాధారణంగా పొరుగు రాష్ట్రాల్లో ఎవరైనా కొత్తగా సీఎం అయితే… పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోన్ చేసి అభినందిస్తారని… కానీ ఏపీ సీఎం జగన్ ఇప్పటి వరకు కనీసం ఫోన్ కాల్ కూడా చేయలేదని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి కూర్చుని పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయని అలాంటిది ఆయన కనీసం కలవకపోవడం ఏంటో అర్థం కాలేదన్నారు. వ్యక్తిగతంగా జగన్ తో తనకు ఎలాంటి విబేధాలు లేవని అన్నారు. ఇక షర్మిల… ఏపీకి కాబోయే పీసీసీ అధ్యక్షురాలు అంటూ హింట్ ఇచ్చారు.
ఇక తెలంగాణలో నామినేటెడ్ పదవులపై స్పందిస్తూ…. ఎన్నికల సమయంలో చాలా మంది నేతలకు హామీలిచ్చామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్, ఈరవతి అనిల్ తో పాటు అనేక మందిని టికెట్ ఇవ్వకపోయినా… పార్టీ కోసం పని చేశారని గుర్తు చేశారు. ప్రొఫెసర్ కోదండరామ్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేసే అవకాశం ఉందని… దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. జనవరి 31వ తేదీలోపు నామినేటెడ్ పదవులను భర్తీ చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
రుణమాఫీపై మాట్లాడుతూ… ఈ విషయంలో మా ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందన్నారు. కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి… రుణమాఫీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే నెలాఖరులో 22,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని వ్యాఖ్యానించారు.