Sankranti Cock Fight : సంక్రాంతి బరిలో పోటీకి కాలు దువ్వుతున్న కోళ్లు, సిద్ధమవుతున్న భారీ బరులు!

Best Web Hosting Provider In India 2024

Sankranti Cock Fight : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్ద పండుగ. ముఖ్యంగా ఏపీలోని గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతాయి. కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు, రంగుల హరివిల్లులతో గ్రామగ్రామాన సంబరాలు కన్నుల పండుగగా జరుగుతాయి. సంక్రాంతి వేడుకల్లో కోడి పందాలకు ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతి మూడు రోజులు ఏపీలోని చాలా జిల్లాల్లో భారీగా కోడి పందాలు నిర్వహిస్తారు. ఈ పందాల్లో వందల కోట్లు చేతులు మారతాయి. సంక్రాంతి రోజుల్లో నిర్వహించే పందాలకు ఏడాది ముందు నుంచే కోడి పుంజులను సిద్ధం చేస్తారు. గోదావరి జిల్లాల్లో రకరకాల పేర్లతో పిలిచే కోడిపుంజులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంటారు. బరిలో పోటీ పడే కోళ్లకు ప్రత్యేక ఆహారం కూడా పెడతారు. కోడి పందాల నిర్వహణ చట్టరీత్యా నేరమని పోలీసుల ప్రకటన, అనధికార అనుమతులు ఏటా జరిగే తంతులో భాగమే.

 

ట్రెండింగ్ వార్తలు

కాలు దువ్వుతున్న విదేశీ పుంజలు

కత్తి కట్టి బరిలో దించేందుకు కోడి పుంజులను రెడీ చేస్తున్నారు. నెమలి, పర్లా, డేగ, కాకి డేగ, కేతువా రంగును బట్టి వివిధ పేర్లతో కోడిపుంజులను పిలుస్తారు. ఈ పుంజులకు బాదం, పిస్తాతో పాటు మాంసం కూడా ఆహారంగా పెడతారు. ఈ పందాల్లో దేశవాళీ పుంజులకు మంచి గిరాకీ ఉంటుంది. సంక్రాంతి పండుగ సమయాల్లో ఈ కోళ్లు లక్షల ధరకు కొనుగోలు చేసి పందాలు వేస్తుంటారు. అయితే ఈ ఏడాది విదేశీ పుంజులు సైతం బరిలో దిగేందుకు కాలుదువ్వుతున్నాయి. విదేశీ జాతులైన పెరు కోడిపుంజులను బరిలో దించేందుకు పందెంరాయుళ్లు సిద్ధమయ్యారు. పెరు జాతి పుంజులు దేశవాళీ పుంజుల కన్నా తక్కువ ఎత్తులో ఉంటాయి. కానీ వేగంలో పెరు జాతి దూసుకుపోతుంది. ప్రత్యర్థి పుంజు దెబ్బకు దొరక్కుండా పోరాడుతుంది. అందుకు ఈసారి పందెంరాయుళ్లు విదేశీ పుంజుల వైపు మెగ్గుచూపుతున్నారు.

రెడీ అవుతున్న బరులు

జనవరి నెల మొదటి నుంచే సంక్రాంతి కోళ్ల పందాలకు బరులు సిద్ధం చేస్తుంటారు. వందల ఎకరాల్లో బరులు గీస్తూ సకల సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందాల బరి, చుట్టూ వీక్షించేందుకు స్టేజీలు, పార్కింగ్ ఏర్పాట్లు, ఫుడ్ స్టాల్స్, ఇలా సకల హంగులు సిద్ధం చేస్తారు. ఇక బరిలో దిగే కోడి పుంజుల ధరలు ప్రస్తుతం రూ.5 లక్షల వరకూ పలుకుతున్నాయి. పండుగ దగ్గర్లో వీటి ధర మరింత పెరిగే అవకాశం ఉంది. లక్షలు పెట్టి కోడి పుంజులు కొని కోట్లలో పందాలు వేయడం గోదావరి జిల్లాల్లో చూస్తుంటాం. కోడి పందాలు చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు గోదావరి జిల్లాలకు క్యూ కడతారు.

 

కోడిపుంజులకు వయాగ్రా

సంక్రాంతి సీజన్ లో పుంజులకు దెరాణిఖెత్ అనే వైరల్ వ్యాధి సోకి వాటిని బలహీనపరిచింది. దీంతో పెంపకందారుల్లో ఆందోళన చెందుతున్నారు. కోడిపుంజులు బలహీనపడకుండా…తెగుళ్ల నుంచి కోలుకునేందుకు వయాగ్రా, షిలాజిత్, విటమిన్ల కాక్టెయిల్‌తో కూడిన ఆహారం అందిస్తున్నారు. వీటితో కోడిపుంజులు తాత్కాలికంగా బలంగా తయారవుతాయి కానీ భవిష్యత్తులో హాని తప్పదని పశువైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాటిని మనుషులు తింటే వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు.

 

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024