Best Web Hosting Provider In India 2024
YSRCP MP: వైసీపీలో టిక్కెట్ల కేటాయింపు వ్యవహారం రచ్చకు కారణమవుతోంది. నియోజక వర్గాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పుల అంశం సిట్టింగ్ అభ్యర్థుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఉన్న స్థానం నుంచి మార్పులు చేయడంపై కొందరు అభ్యర్థుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. పార్లమెంటు సభ్యుల్లో పలువురిని అసెంబ్లీకి పోటీ చేయించాలని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో మార్పుల వ్యవహారం బెడిసికొట్టగా తాజాగా రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌పై గ్యారంటీ లేని వైసీసీ ఎంపీలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ పేరు కూడా తెరపైకి వచ్చింది. సంజీవ్ కుమార్ టీడీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కర్నూలు వైసీపీ ఎంపీని టీడీపీలోకి ఆహ్వానిస్తూ ఆ పార్టీ పొలిటికల్ కన్సల్టెంట్లు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది అన్నీ అనుకూలిస్తే త్వరలోనే సంజీవ్ కుమార్ తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలున్నాయి.
2019 ఎన్నికల్లో తొలిసారి ఎంపీగా గెలిచిన సంజీవ్ కుమార్ పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. టీడీపీ అభ్యర్థిపై 1,48,889ఓట్ల ఆధిక్యంతో గెలిచిన సంజీవ్ కుమార్ పెద్దగా ఎక్కడా కనిపించింది లేదు. పార్టీలో తమకు గుర్తింపు అంతంత మాత్రమేననే అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
బీసీ సామాజిక వర్గానికి చెందిన సంజీవ్ కుమార్ ఇటీవల టీడీపీ నేతలతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో ఆ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు నగరంలో ప్రముఖ డాక్టర్‌గా సంజీవ్ కుమార్ గుర్తింపు పొందారు. ఎంపీగా గెలిచిన తర్వాత పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం, ఢిల్లీలో ఒకరిద్దరు ఎంపీలు మినహా మిగిలిన వారంతా సొంతంగా పనిచేసే అవకాశాలు లేకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
లావు శ్రీకృష్ణదేవరాయలు అదే బాట…
నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా వైసీపీ అధిష్టానం నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నారు. నరసరావుపేట ఎంపీని గుంటూరు నుంచి పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం భావించింది. ఈ మేరకు నిర్ణయాన్ని సిఎం జగన్ చెప్పడంతో లావు దానికి సుముఖత వ్యక్తం చేయలేదు.
గుంటూరు పరిధిలో రాజధాని అమరావతి ప్రాంతం ఉండటంతో అక్కడ గెలిచే అవకాశాలు ఉండవని అభ్యంతరం చెప్పినట్టు తెలుస్తోంది. నరసరావుపేట నుంచి మాత్రమే పోటీ చేస్తానని వైసీపీ అధిష్టానంతో తేల్చి చెప్పారు. దీంతో గుంటూరులో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని రాయపాటి కుటుంబానికి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
మొదట్లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి రాయపాటి కుటుంబం ఆసక్తి చూపించినా తాజా రాజకీయ పరిణామాలతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని పక్కకు తప్పుకున్నట్టు చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి పార్టీ నుంచి ఆర్ధిక భరోసా ఇవ్వకపోవడం, ఎన్నికల ఖర్చులు సొంతంగా పెట్టుకోవాలనే సూచనలతో చాలామంది నిరాసక్తత చూపుతున్నట్లు వైసీపీలో ప్రచారం జరుగుతోంది.
నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సైతం ఈ విషయంల విభేదించినట్టు తెలుస్తోంది. పార్లమెంటు పరిధిలో పోటీ చేసే ఎమ్మెల్యేల ఎన్నికల ఖర్చు భారం తన వల్ల కాదని తేల్చేసినట్టు తెలుస్తోంది.