EC Effect on Police: బెజవాడ పోలీసులపై ఈసీ ఎఫెక్ట్‌… వారంలోనే భారీగా లిక్కర్ సీజ్

Best Web Hosting Provider In India 2024

EC Effect on Police: ఈసీ ఆగ్రహంతో బెజవాడ పోలీసుల్లో కదలిక వచ్చింది. గత ఏడాది కాలంగా పట్టనట్టు వ్యవహరించిన పోలీసులపై సీఈసీ బృందం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

 

ట్రెండింగ్ వార్తలు

కొత్త ఏడాదిలో జిల్లా వ్యాప్తంగా భారీగా మద్యం పట్టుబడింది. గత ఏడాది మొత్తం స్వాధీనం చేసుకున్న మద్యానికి సమానంగా పక్షం రోజుల్లోనే అక్రమ మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు.

ఈ ఏడాది జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు రూ.90లక్షల విలువైన మద్యం పట్టుబడింది. ఇందులో ఒకే కేసులో 264లీటర్ల ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ ఉంది. దీని విలువ రూ.25లక్షల వరకు ఉంటుంది. మరో రూ.4.52లక్షల విలువైన 100కేసుల్లో 647 లీటర్ల ఎన్డీపిఎల్‌ పట్టుబడింది.

మరో 219 కేసుల్లో రూ.14.70లక్షల విలువైన 2100 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. ఇవి కాకుండా మరో రూ.46.27లక్షల విలువైన మద్యాన్ని 105 కేసుల్లో సీజ్ చేశారు. తొలి 15రోజుల్లోనే మొత్తం రూ.90.50లక్షల విలువైన మద్యం పట్టుబడింది.

గత ఏడాదిలో కోటి విలువైన మద్యం…

2023లో మొత్తం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో కేవలం కోటి రుపాయల విలువైన అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 869కేసుల్లో ఎన్డీపిఎల్‌ లిక్క‌ర్‌ సీజ్ చేవారు. దీని విలువను రూ.46.22లక్షలుగా పేర్కొన్నారు. మరో 965కేసుల్లోరూ.18.33లక్షల విలువైన 2619లీటర్ల మద్యం పట్టుబడింది. ఇవి కాకుండా 300కేసుల్లో 12746 లీటర్ల మద్యం పట్టుబడింది. 2023 ఏడాది మొత్తంలో రూ.1.02కోట్ల విలువైన మద్యాన్ని మాత్రమే బెజవాడ పోలీసులు సీజ్ చేశారు.

 

మద్యంతో పాటు సరైన పత్రాలు లేకుండా రవాణా చేస్తున్న వెండి, బంగారు ఆభరణాలు, నగదు కలిపి మొత్తం రూ.2.8 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమాండ్ కేంద్రంలో పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాతా వివరాలు వెల్లడించారు.

ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా పోలీసుల వైఖరిపై ఎన్నికల అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా లేకపోవడం, పోలీసు పికెట్లు ఏర్పాటు చేయలేదంటూ ఈసీ అసహనం వ్యక్తం చేసింది.

దీంతో పోలీస్ కమిషనర్ తనిఖీలను విస్తృతం చేయాలని ఆదేశించడంతో పెద్ద మొత్తంలో అక్రమ మద్యం పట్టుబడింది. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున మద్యం తీసుకు వచ్చి జిల్లాలో అమ్ముతున్నట్లు తేలింది. అలాగే విదేశీ మద్యం సీసాలు పట్టుబడ్డాయి. పట్టుబడిన సొత్తులో రూ.1.83 కోట్ల నగదు, 1.198 కేజీలు బంగారం, 28.618 కిలోల వెండి ఉంది.

మరోవైపు విదేశీ మద్యం కూడా విజయవాడకు యథేచ్ఛగా సరఫరా అవుతోంది. రైళ్ల ద్వారా విజయవాడకు మద్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా రహ స్యంగా విక్రయిస్తున్నారు. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్‌కు నగరంలో డిమాండ్ ఉంది. ఏపీ తయారీ మద్యంపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉండటంతో స్తోమత ఉన్న వారు ఎంత ధరైనా ఇచ్చి కొనేం దుకు మొగ్గు చూపుతున్నారు.

 

ఇతర రాష్ట్రాల్లో తయారైన నాన్యమైన మద్యానికి వేల రూపాయలు లాభం వేసుకుని విక్రయిస్తున్నారు. పోలీసులు లోపాయికారీగా అక్రమ విక్రయాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విదేశీ మద్యం అమ్మకాలతోనే మద్యం మాఫియా రూ. లక్షలు సంపాదిస్తున్నట్లు గుర్తించారు.

మాజీ సైనికోద్యోగుల సాయంతో ఈ వ్యాపారానికి రాజకీయనేతల అండతో సాగుతోందని గుర్తించారు. విజయవాడ పోలీసులకు ఈ నెల మొదట్లో బాపట్ల జిల్లా జంపని గ్రామానికి చెందిన కోగంటి విజయ సాయి దొరికాడు. ఇతని వద్ద 10 విదేశీ మద్యం సీసాలు దొరికాయి. అతడిని విచారించడంతో ఒక గోదా ములో దాచి ఉంచిన 342 విదేశీ మద్యం సీసాలు వెలుగు చూశాయి.

ఈ మద్యాన్ని రైలులో హరియాణా నుంచి తీసుకు వచ్చినట్టు తేలింది. ఇలా తెచ్చిన మద్యాన్ని గురునానక్ కాలనీలో ఒక ఇంట్లో దాచి ఉంచి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. జనవరి 1 నుంచి 15 వరకు కేవలం 15 రోజుల వ్యవధి లోనే ఎన్టీఆర్ కమిషనరేట్లో రూ.90 లక్షల విలువైన అక్రమ మద్యం పట్టుబ డింది. గత ఏడాది మొత్తంలో రూ.1.02. కోట్ల విలువైన మద్యం దొరికితే ఈ ఏడాది మొదటి 15 రోజుల్లోనే దాదాపు కోటి విలువైన మద్యం సీజ్ చేశారు.

 

ఏపీలో అక్రమ మద్యం రవాణా నియంత్రణకు ప్రవేశపెట్టిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పత్తా లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. సరిహద్దుల్లో తనిఖీలను ఎప్పుడో గాలికొదిలేశారు. దీంతో ఇటీవల ఎన్నికల సంఘం పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపిఎస్‌లపై ఈసీ చర్యలు తప్పవనే ప్రచారం జరుగుతోంది.

WhatsApp channel
 

టాపిక్

 
 
Telugu NewsBreaking Telugu NewsLatest Telugu NewsAndhra Pradesh NewsVijayawadaAp PoliceElection Commission Of India

Source / Credits

Best Web Hosting Provider In India 2024