Road Accident: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

Best Web Hosting Provider In India 2024

Road Accident: వేములవాడ దైవదర్శనం కోసం వెళ్లి వస్తున్న ఆటో ట్రాలీని హసన్ పర్తి మండలం బావుపేట క్రాస్ వద్ద వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. మరో 8 మంది గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.

 

ట్రెండింగ్ వార్తలు

పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఉర్సు కరీమాబాద్ ఏరియాకు చెందిన ఆమంచ శ్యామ్ సుందర్ రెడ్డి(53) ఉర్సు బొడ్రాయి కమిటీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. కొద్దిరోజుల్లో మేడారం జాతర ప్రారంభం కానుండగా ముందుగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో ఉర్సు కు చెందిన ఆటో ట్రాలీ మాట్లాడుకుని బయలు దేరారు.

సమీపంలోని విలీన గ్రామమైన తిమ్మాపూర్ కు చెందిన రవి(37) అనే వ్యక్తిని డ్రైవర్ గా తీసుకెళ్లారు. మంగళవారం ఇంట్లో నుంచి వెళ్లి వేములవాడ, కొండగట్టు ఆలయాల్లో మొక్కులు చెల్లించుకుని గురువారం సాయంత్రం అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు.

వేగంగా ఢీకొట్టిన కారు

ఆటో ట్రాలీలో ఆమంచ శ్యామ్ సుందర్ రెడ్డి, ఆయన భార్య దేవి, తల్లి లలిత, తమ్ముడు సంతోష్, ఇతర కుటుంబ సభ్యులు లక్ష్మణ్, నాగేంద్ర, ఆలేఖ్య ఉండగా.. వారి వెహికిల్ గురువారం రాత్రి వరంగల్- కరీంనగర్ నేషనల్ హైవేపై హసన్ పర్తి మండలం బావుపేట క్రాస్ కు చేరుకుంది.

ఈ క్రమంలో ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన కారు వెనుక వైపు నుంచి వేగంగా వచ్చి ఆటో ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో ట్రాలీలో ఉన్న ఆమంచ శ్యామ్ సుందర్ రెడ్డి తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాలీ డ్రైవర్ రవి తో పాటు శ్యామ్ సుందర్ రెడ్డి భార్య దేవి, కుటుంబ సభ్యులు లలిత, సంతోష్, లక్ష్మణ్, నాగేంద్ర, ఆలేఖ్య కు తీవ్రంగా గాయాలయ్యాయి.

 

ప్రమాదం విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే హసన్ పర్తి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా డ్రైవర్ రవికి బలమైన గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన రాత్రి ప్రాణాలు కోల్పోయారు.

దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరగగా.. ఇద్దరు మృతి చెంది మిగతా వాళ్లు గాయాలతో ఆసుపత్రిపాలవడంతో ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కారి డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు హసన్ పర్తి ఎస్సై అశోక్ కుమార్ వివరించారు.

వరుస ప్రమాదాలతో హడల్

వరంగల్–కరీంనగర్​ హైవేపై ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే జనాలు హడలెత్తిపోతున్నారు. దాదాపు నెల రోజుల కిందట డిసెంబర్ 22న వేములవాడ రాజరాజేశ్వరస్వామి దర్శనం కోసం ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన అన్నదమ్ముల రెండు ఫ్యామిలీలకు చెందిన ఏడుగురు ఒకే కారులో వెళ్తుండగా.. ఎల్కతుర్తి మండలం పెంచికలపేట వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు విడిచారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. 24వ తేదీన హుజురాబాద్​ నుంచి హనుమకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.

 

హుజురాబాద్​ నుంచి హనుమకొండ వెళ్తున్న అద్దె బస్సు రన్నింగ్​ లోనే వెనక ఎడమవైపు ఉన్న రెండు టైర్లు ఊడిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది వరకు ఉండగా.. తృటిలో పెను ముప్పు తప్పింది. మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేటకు చెందిన రెండు కుటుంబాలకు చెందిన 10 మంది టాటా మ్యాజిక్​ వెహికిల్​ లో వేములవాడ వెళ్తుండగా ఎల్కతుర్తి వద్ద ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా.. మరో ఎనిమిది స్వల్పంగా గాయపడ్డారు.

ఆ తర్వాత బావు పేట క్రాస్ వద్ద ఓ స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బంధువు అంత్యక్రియల నిమిత్తం బావుపేటకు వెళ్లి వస్తున్న ధర్మసాగర్​ మండల కేంద్రానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పుడు అదే చోటా మరో యాక్సిడెంట్ జరిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో నేషనల్ హైవే-563 వరంగల్-కరీంనగర్ మార్గంలో ప్రయాణించాలంటేనే జనాలు జంకుతున్నారు.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

WhatsApp channel
 

టాపిక్

 
Telugu NewsBreaking Telugu NewsLatest Telugu NewsRoad AccidentTelangana News

Source / Credits

Best Web Hosting Provider In India 2024